అదరగొట్టిన అమ్మాయిలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 01:26 AM
తొలి మ్యాచ్‌లోనే భారత్ అమ్మాయిలు తడాఖా చూపించారు. బౌండరీలతో చెలరేగి ప్రేక్షకులకు టీ 20 మజాను అందించారు.
చెలరేగిన జెమీమా... మెరిసిన మందాన
తొలి టీ-20లో శ్రీలంకపై భారత్ మహిళల విజయం
బౌండరీలతో హోరెత్తిన ఏసీఏ- వీడీసీఏ స్టేడియం
భారీగానే తరలివచ్చిన ప్రేక్షకులు
విశాఖపట్నం, స్పోర్ట్స్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
తొలి మ్యాచ్‌లోనే భారత్ అమ్మాయిలు తడాఖా చూపించారు. బౌండరీలతో చెలరేగి ప్రేక్షకులకు టీ 20 మజాను అందించారు. మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో భారత జట్టు సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించిన జెమిమా రోడ్రిగ్స్ మరోసారి తనదైన బ్యాటింగ్‌తో మెరిసి ప్రేక్షకులకు కనువిందు చేసింది. మరో ఎండ్‌లో స్టార్ క్రికెటర్ స్మృతి మందాన కూడా బౌండరీలతో విరుచుకుపడి క్రికెట్ మజానందించింది.
ఐదు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పీఎం పాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి సిరీస్‌లో ఆధిక్యత సాధించింది. శ్రీలంక నిర్ధేశించిన 122 పరుగులు విజయలక్ష్యాన్ని భారత్ మహిళలు సునాయాసంగా ఛేదించారు. జెమిమా (69; 10 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మందాన (25; 4 ఫోర్లు) కొద్దిసేపు మెరుపులు మెరిపించింది. భారత్ బ్యాటర్లపై శ్రీలంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. స్మృతి మందాన ఐదో ఓవర్లో చమరి అటపట్టు బౌలింగ్‌లో బ్యాక్ వర్డ్ పాయింట్, కవర్స్ మీదుగా బౌండరీలు బాది పేక్షకులను ఉత్సాహపరిచింది. తర్వాతి ఓవర్‌లో మరో ఎండ్‌లోని జమీమా కూడా చెలరేగి సహాని బౌలింగ్‌లో బ్యాక్ వర్డ్ పాయింట్, పాయింట్ మీదుగా బౌండరీలు కొట్టి స్కోరు బోర్డు పరిగెత్తించింది. ఇద్దరూ చెలరేగడంతో 5.4 ఓవర్లోనే భారత్ 50 పరుగులు పూర్తి చేసింది. 12 ఓవర్‌లో సహాని బౌలింగ్‌లో జెమీమా విధ్వంసం సృష్టించింది. స్వీప్, ఎక్స్‌ట్రా కవర్, బ్యాక్ వర్డ్ పాయింట్, థర్ట్ మ్యాన్ మీదుగా వరుసగా నాలుగు బౌండరీలు బాదడమే కాకుండా కేవలం 34 బంతుల్లో ఏడు బౌండరీలతో అర్ధ సెంచరీ పూర్తి చేసింది. స్మృతి మందాన స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ (15) సహరించడంతో భారత్ 14.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 121 పరుగులు చేసింది. భారత్ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు పరుగులు చేయడానికి శ్రమించాల్సి వచ్చింది. మూడో ఓవర్‌లో విరుచుయుపడిన కెప్టెన్ ఆటపట్టు మిడాన్, పాయింట్ మీదుగా వరుసగా రెండో ఫోర్లు కొట్టి దూకుడు మీద కనిపించినా అదే ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ అయి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ విష్మి గుణరత్నే (39), మిడిల్ ఆర్డర్‌లో ఫెరీరా (20), హర్షిత సమర (21) కొద్దిసేపు మెరుపులు మెరిపించడంతో శ్రీలంక స్కోరు బోర్డు ముందుకు నడిచింది. భారత్ ఫీల్డర్లు వరుసగా సులువైన క్యాచ్‌లు జార విడిచినా శ్రీలంక బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు.
క్యాచ్‌లు జారవిడిచిన భారత్ ఫీల్డర్లు
మ్యాచ్ ఎనిమిదో ఓవర్లో తొలి ఇంటర్నేషనల్ టీ20 ఆడుతున్న వైష్ణవి బౌలింగ్‌లో షార్ట్ లెగ్ వద్ద క్యాచ్‌ను జార విడిచిన శ్రీచరణి....15వ ఓవర్లో అరుంధతి బౌలింగ్‌లో మరోసారి క్యాచ్ జారవిడిచింది. 17వ ఓవర్లో బౌండరీ లైను వద్ద స్మృతి మందాన క్యాచ్ జార విడిచింది.
ఏడు వేలకుపైగా ప్రేక్షకుల హాజరు
భారత్, శ్రీలంక మహిళల టీ 20 మ్యాచ్‌కు ఆరు వేలకు పైగా టికెట్లు అమ్ముడవగా ఏడువేల మందికి పైగా ప్రేక్షకులు హాజరవడం విశేషం.