గుబులు పుట్టిస్తున్న ఘాట్ ప్రయాణం!
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:07 PM
జిల్లాలోని ఘాట్ మార్గాల్లో ప్రయాణాలంటే ప్రజలకు గుబులు పడుతోంది. శుక్రవారం ఉదయం మారేడుమిల్లి ఘాట్‌లో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. 17 మంది ప్రయాణికులు గాయపడిన ఘటనతో మన్యం వాసులు ఉలిక్కిపడ్డారు. దీంతో ఘాట్ మార్గాల్లో ప్రమాదాలు చర్చనీయాంశమయ్యాయి.
రక్షణ చర్యలు అంతంతమాత్రమే
వాహన డ్రైవర్లకు అవగాహన లేమి
మారేడుమిల్లి ఘాట్‌లో బస్సు ప్రమాదంలో
తొమ్మిది మంది మృతితో ఆందోళన
రాత్రుళ్లు ఘాట్‌లో భారీ వాహనాల
రాకపోకలు నిషేధించాలంటున్న నిపుణులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పాడేరు నుంచి చోడవరం వెళ్లే మార్గంలో, అరకులోయ నుంచి ఎస్.కోట, చింతపల్లి నుంచి నర్సీపట్నం, కొయ్యూరు మండలంలో చింతాలమ్మ ఘాట్, సీలేరు నుంచి చింతూరు వెళ్లే మార్గంతో పాటు చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే మార్గాల్లో ఘాట్‌లున్నాయి. అయితే ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. చిన్నపాటి వర్షం కురిసినా ఘాట్ మార్గాల్లో ఎక్కడికక్కడ చెట్లు కూలడం, కొండ చరియలు విరిగిపడడం జరుగుతుండడం సర్వసాధారణమైపోయింది. మలుపులు ఇరుకుగా ఉండడంతో పాటు ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించని విధంగా తుప్పలు పెరిగిపోతున్నాయి. ఇక రక్షణ గోడల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రెండు దశాబ్దాలు కొత్తగా రక్షణ గోడలు నిర్మించిన దాఖలాలు లేవు. ఘాట్ మార్గాల్లో వాహన ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే హడావిడిగా రక్షణ గోడలకు తూతూమంత్రంగా మరమ్మతులు చేయడం, తర్వాత మిన్నకుండడం మామూలైపోయింది. అలాగే ఘాట్‌లో ప్రమాదాలు జరిగినా తక్షణమే సహాయం చేసే ఎటువంటి వ్యవస్థ లేకపోవడంతో సకాలంలో బాధితులకు సాయం అందడం లేదు. వాస్తవానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఘాట్ మార్గాల్లో అంబులెన్స్, టోయింగ్ వ్యాన్‌లను అందుబాటులో ఉంచుకోవడం అవసరం. అయితే జిల్లాలోని ఏ ఘాట్ మార్గంలోని అటువంటి సహాయక చర్యలు అందించే పరిస్థితి లేదు. వాటిని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, పర్యాటకులు కోరుతున్నారు.
చలి కాలం ఘాట్ మార్గాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
ప్రస్తుత శీతాకాలంలో ఘాట్ మార్గాల్లో వాహనాల రాకపోకల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శీతకాలంలో ఉదయం 11 గంటల వరకు పొగమంచు కమ్మేస్తున్న తరుణంలో రోడ్డు మార్గం సరిగా కనిపించదు. ఈక్రమంలో ప్రయాణాలు వాయిదా వేయడం లేదా అత్యవసరమైనపుడు మంచును చీల్చుకుని రోడ్డు మార్గం కన్పించేలా ఉన్న ప్రత్యేకమైన పసుపు రంగు హెలోజిన్ లైట్ల వెలుతురులో మాత్రమే ప్రయాణించాలి. అలాగే ఘాట్ ప్రయాణాలపై అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడిపేలా చర్యలు తీసుకోవాలి. మంచు కారణంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పక్కాగా గుర్తించి, అటువంటి ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలి. అలాగే ఘాట్ మార్గాల్లో మలుపులు సూచించే పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలి. అలాగే ఘాట్ ఎక్కినా, దిగినా పరిమిత వేగం మాత్రమే పాటించడంతో పాటు గేర్‌లో మాత్రమే దిగేలా డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి.
రాత్రుళ్లు వాహనాల రాకపోకల నిషేధంతో కొంత మేలు
పొగమంచు, వర్షాలు కొనసాగే పరిస్థితులున్న సందర్భాల్లో ఘాట్ మార్గంలో రాత్రి వేళల్లో రాకపోకలను నిషేధించడం ఎంతో అవసరం. వర్షాలు కురిసే సమయంలో ఘాట్‌లోని కొండప్రాంతాల పూర్తిగా నానిపోవడంతో చెట్లు కూలడం లేదా కొండచరియలు విరిగిపడడం వంటి సంఘటనలు చోటు చే సుకునే అవకాశాలున్నాయి. అలాగే శీతాకాలంలో రాత్రుళ్లు పొగ మంచు దట్టంగా కమ్మేయడంతో రోడ్డు మలుపులు కన్పించని పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలో రాత్రి వేళల్లో అనుకోని సంఘటనలు జరిగితే ప్రయాణికులకు ఊహించని నష్టం కలిగే ప్రమాదముంది. వాటిని నివారించేందుకు జిల్లాలో పాడేరు, అరకులోయ, అనంతగిరి, చింతూరు, లంబసింగి ఘాట్ మార్గాల్లో రాత్రుళ్లు రాకపోకలను నిలుపుదల చేయాలని పలువురు కోరుతున్నారు.