గుబులు పుట్టిస్తున్న ఘాట్!
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:55 PM
జిల్లా కేంద్రం నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించే పాడేరు ఘాట్ మార్గం అభివృద్ధిపై పాలకులు చాలా ఏళ్లుగా నిర్లక్ష్యం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తున్నది.
ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని ఘాట్ రోడ్లు
అభద్రతగా మారిన ప్రయాణాలు
ఆందోళన చెందుతున్న ప్రయాణికులు
అమలుకు నోచుకోని రూ.5.కోట్లతో మరమ్మతుల ప్రతిపాదన
ఘాట్ మార్గాలు మెరుగుపర్చాలని జనం వేడుకోలు
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
మన్యంలోని రాకపోకలకు ఘాట్ రోడ్డును మరింతగా అభివృద్ధి చేసి, ప్రమాదాలను నివారించడంతోపాటు పర్యాటకుల్ని ఆకర్షించేలా తీర్చిదిద్దాల్సి ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం ఘాట్ రోడ్డు అంటేనే జనం భయపడే దుస్థితి నెలకొంది. మొంథా తుఫాన్‌కు పాడేరు, కొయ్యూరు, చింతపల్లి ఘాట్ మార్గాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అలాగే ఒక మోస్తరు వర్షం కురిసినా చెట్లు కూలిపోతున్నాయి. దీంతో ఘాట్ మార్గాలు అభివృద్ధి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కనీస అభివృద్ధికి నోచుకోని ఘాట్ రోడ్లు
జిల్లాలోని ఘాట్ మార్గాలు చాలా ఏళ్లుగా కనీస అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం ఘాట్‌లోని రక్షణ గోడలు శిథిల స్థితిలో ఉన్నాయి. వాస్తవానికి ఎక్కడైనా ఘాట్ రోడ్లకు రక్షణ గోడలే ప్రధాన ఆధారం. కాని ప్రభుత్వాలు ఘాట్ రోడ్లలో రక్షణపై కనీసం దృష్టి సారించడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు డివిజన్ కేంద్రంగా ఉన్న పాడేరు ప్రస్తుతం జిల్లా కేంద్రం కావడంతో ఘాట్ మార్గంలో రాకపోకలు పెరిగాయి. ఈక్రమంలో పాడేరు ఘాట్ రక్షణపై ప్రభుత్వం దృష్టి సారించాలనే డిమాండ్ వస్తోంది. పాడేరు నుంచి చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలకు రాకపోకలు సాగించాలన్నా.. ఆయా ప్రాంతాల నుంచి పాడేరుతో పాటు ఒడిశా రాష్ట్రానికి వెళ్లాలన్నా.. ఘాట్ ప్రయాణం తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్గంలో రక్షణపై పాలకులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ప్రధానంగా ఘాట్‌లోని వ్యూపాయింట్‌కు సమీపంలో, రాజాపురం వద్ద, ఏసుప్రభు బొమ్మ మలుపులకు అటూ.. ఇటూ.. వంట్లమామిడి నుంచి గరికిబంద వరకు ఉన్న మలుపుల్లో రక్షణ గోడలు శిథిలమైపోయాయి. పొరపాటున వాహనాలు అదుపు తప్పితే లోయలోకి దూసుకుపోవాల్సిందే. గతంలో నిర్మించిన రక్షణ గోడలు శిథిలం కాగా.. చాలా ఏళ్లుగా కొత్త రక్షణ గోడలు నిర్మించకపోవడంతో ఘాట్ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కనీసం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న రక్షణ గోడలకైనా మరమ్మతులు చేపట్టినా కాస్తా మెరుగ్గా ఉంటుందని డ్రైవర్లు, ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని మారేడుమల్లి, అడ్డతీగల, అనంతగిరి, చింతపల్లి ఘాట్ మార్గాల్లోనూ ఉంది. వాస్తవానికి గత రెండు దశాబ్దాలుగా ఘాట్ మార్గాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. కాని గతంతో పోల్చితే వాహనాల రాకపోకల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ఘాట్ మార్గాలను వెడల్పు చేయడంతో పాటు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అవసరమైన భద్రత, రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఘాట్ మార్గాలను ఎంతో అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు.
కార్యరూపం దాల్చని మరమ్మతుల ప్రతిపాదన
పాడేరు ఘాట్ మార్గంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఏసుప్రభు బొమ్మ మలుపు, సమీపంలోని మలుపులను క్రమబద్ధీకరించేందుకు చాలా కాలంగా రోడ్ల, భవనాల శాఖాధికారులు ప్రతిపాదిస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. వాస్తవానికి ఘాట్‌లో కొండచరియలు, చెట్లు విరిగిపడడం వంటివి వర్షాకాలంలో మాత్రమే జరుగుతుండగా, ఏసుప్రభు బొమ్మ మలుపు వద్ద భారీ వాహనాలు ఆగిపోవడంతో నిత్యం ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈక్రమంలోనే భారీ, ఇతర వాహనాల రాకపోకలకు అనువుగా పలు ఘాట్ మలుపులను క్రమబద్ధీకరించేందుకు రూ.5 కోట్ల అంచనాతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దానికి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే పనులు చేపడతారు.
ఏవోబీ రవాణాకు పాడేరు ఘాట్ ఎంతో కీలకం
పాడేరు ఘాట్ రోడ్డు కేవలం మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి మాత్రమే రాకపోకలు సాగించేందుకే కాకుండా సరిహద్దున ఉన్న ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన రవాణాకు కీలక మే. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఒడిశా రాష్ట్రం జైపూర్, కొరాపుట్ ప్రాంతాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాలు పాడేరు ఘాట్ మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతానికి పర్యాటకులు పెరగడంతో ఘాట్‌లో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. తాజా పరిస్థితుల నేపథ్యంలోనైనా ఘాట్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.