ఉద్యోగుల చేతుల్లోనే స్టీల్‌ప్లాంటు భవిష్యత్తు
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:13 AM
స్టీల్‌ప్లాంటును ఉద్యోగులే కాపాడుకోవాలని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సెక్రటరీ సందీప్ పాండ్రిక్ అన్నారు.
మిగిలిన కర్మాగారాలతో పోల్చితే విశాఖ ఉక్కు పనితీరు భేష్
నష్టాల నుంచి బయటపడేందుకు రోజుకు కనీసం 19 వేల నుంచి 21 వేల టన్నుల ఉత్పత్తి సాధించాలి
అక్టోబరు నుంచి పూర్తి జీతాలు
ఉక్కు మంత్రిత్వ శాఖ సెక్రటరీ సందీప్ పాండ్రిక్
విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటును ఉద్యోగులే కాపాడుకోవాలని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సెక్రటరీ సందీప్ పాండ్రిక్ అన్నారు. శుక్రవారం ప్లాంటు సందర్శనకు వచ్చిన ఆయన సుమారు రెండు వందల మంది ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ దేశంలో మిగిలిన స్టీల్‌ప్లాంట్ల కంటే విశాఖ స్టీల్‌ప్లాంటు పనితీరే బాగుందని ప్రశంసించారు. కొన్ని నిర్ణయాలు తమ చేతుల్లో లేవని, అయితే ప్లాంటు భవిష్యత్తు కోసమే కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఏడాది కాలంలో మూడుసార్లు మంత్రిత్వశాఖ అధికారులు వచ్చారంటే స్టీల్‌ప్లాంటుపై కేంద్ర ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉన్నదో ఆలోచించాలన్నారు. గత ఏడాది ఆగస్టులో ముడి సరకుల కొరత, అప్పుల భారంతో ప్లాంటు మూసివేత దశకు చేరుకున్నదని, ఉద్యోగుల కృషితో నేడు మళ్లీ మంచి స్థితికి చేరిందన్నారు. కానీ సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 11,440 కోట్లు బ్యాంకుల అప్పులు తీర్చడానికి వినియోగించారన్నారు. మరో 36,000 కోట్లు అప్పు ఉందన్నారు.
రెండు బ్లాస్ట్‌ఫర్నేస్‌లు పూర్తి సామర్థ్యంతో నడిపినప్పుడు లాభాలు వచ్చాయని, ఇప్పుడు మూడు ఫర్నేస్‌లు 72 శాతం సామర్థ్యం (రోజుకు 16 వేల టన్నులు)తో నడపడం వల్ల నష్టాలు వస్తున్నాయన్నారు. నష్టాల నుంచి బయటపడేందుకు రోజుకు కనీసం 19 వేల నుంచి 21 వేల టన్నుల ఉత్పత్తి సాధించాలన్నారు. ఉక్కు ధరలు 2021లో టన్నుకు 65 వేల నుంచి 70 వేలు ఉండగా, ఇప్పుడు 45 వేల కంటే తక్కువ ఉందన్నారు. ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ.38-39 వేలు అవుతుందన్నారు. ఇది వర్షాకాలం కావడంతో ఉక్కు అమ్మకాలు తగ్గాయని, అక్టోబరు నెల నుంచి మళ్లీ పుంజుకుంటాయన్నారు. అప్పుడు టన్ను ఉక్కు 80 వేలకు చేరే అవకాశం ఉందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంటుకు ప్రధానంగా ముడి సరకులు కొరత ఉందని, ఇంకా మూడున్నర దశాబ్దాల కిందట కర్మాగారం కావడంతో నిర్వహణపరమైన సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వాటి పరిష్కారంలో సిబ్బంది సహకారం చాలా అవసరమన్నారు. కొందరూ స్టీల్‌ప్లాంటు ఆస్తులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, దయచేసి అలాంటి పనులకు పాల్పడవద్దన్నారు. సీఎండీ సహా ఉన్నతాధికారులంతా కొద్దిరోజులు మాత్రమే ఇక్కడ ఉంటారని, ఆ తరువాత వెళ్లిపోతారని, శాశ్వతంగా ఉండేది ఉద్యోగులు మాత్రమేనన్నారు. కాబట్టి వారే ప్లాంటు పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. మూడు ఫర్నేస్‌లను వంద శాతం సామర్థ్యంతో నడపాలన్నారు. టీమ్ వర్క్, ఎవరు ఎక్కడైనా పనిచేసేలా అన్నింటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మానవ వనరులును సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. స్టీల్‌ప్లాంటు భూముల అమ్మకంపై అపోహాలు పెట్టుకోవద్దన్నారు. ఉద్యోగులకు అక్టోబరు నుంచి వంద శాతం జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అన్నీ కుదుటపడి ప్లాంటు పూర్వస్థితికి వస్తే మళ్లీ ప్రమోషన్‌లు ఇస్తామని భరోసా ఇచ్చారు.