Share News

వాగుల ఉగ్రరూపం

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:21 PM

గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో గల మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆంధ్రా, ఒడిశాకు చెందిన సుమారు 52 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

వాగుల ఉగ్రరూపం
లక్ష్మీపురం పంచాయతీ ఉబ్బెంగుల సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటుతున్న గిరిజనులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు

52 గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు

ముంచంగిపుట్టు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో గల మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆంధ్రా, ఒడిశాకు చెందిన సుమారు 52 గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో గల కర్లాపొదర్‌, మెట్టగూడ, లక్ష్మీపురం, తుమిడిపుట్టు, కోడాపుట్టు, మొల్‌పుట్టు, ఉబ్బెంగుల, మొంజగూడ, సంగంవలస, దాబుగూడ, దొరగూడ, తుడుమురాయి, మెత్తగూడ, తదితర ప్రాంతాల్లో మత్స్యగెడ్డ పాయలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉబ్బెంగుల సమీపంలోని గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సోమవారం పరిసర గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకుల కోసం అతి కష్టమ్మీద గెడ్డ దాటాల్సి వచ్చింది. మత్స్యగెడ్డ పాయలపై కల్వర్టులు, వంతెనలు, కాజ్‌వేలు లేకపోవడంతో వర్షమొస్తే ఉధృతంగా ప్రవహించే గెడ్డ దాటడం కష్టంగా ఉందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మత్స్యగెడ్డ పాయలపై కల్వర్టులు, వంతెనలు నిర్మించాలని, పక్కా రహదారుల సౌకర్యం కల్పించాలని ఆ ప్రాంతీయులు కోరుతున్నారు.

Updated Date - Sep 15 , 2025 | 11:22 PM