Share News

ప్రాణం తీసిన వేట సరదా

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:49 AM

చేపల వేట సరదా రెండు నిండు ప్రాణాలు బలిగొంది. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ వద్ద వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృతిచెందారు.

ప్రాణం తీసిన వేట సరదా

మేహాద్రిగెడ్డలో మునిగి ఇద్దరు యువకుల మృతి

గోపాలపట్నం/పెందుర్తి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):

చేపల వేట సరదా రెండు నిండు ప్రాణాలు బలిగొంది. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ వద్ద వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృతిచెందారు. ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పెందుర్తి సమీపంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ (అయ్యప్పకాలనీ)కి చెందిన బల్లంకి శేఖర్‌ (18), బల్లంకి వాసుతోపాటు చినముషిడివాడ సమీపంలోని ఆక్సిజన్‌ కాలనీకి చెందిన యాదాడ లక్ష్మణ్‌ కుమార్‌ (18) డాక్‌యార్డ్‌లో కాంట్రాక్ట్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో చేపలను వేటాడేందుకు మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు వెళ్లారు. రాతి రివిట్‌ మెంట్‌పై కూర్చుని, నీటిలోకి గేలాలు వేశా రు. ఈ క్రమంలో బల్లంకి శేఖర్‌, యాదాడ లక్ష్మణ్‌కుమార్‌ ముందుకు తూలి, నీటిలో పడి మునిగిపోయారు. అక్కడే వున్న బల్లం కి వాసు భయాందోళన చెంది, సమీపంలో వున్న రిజర్వాయర్‌ సిబ్బంది వద్దకు వెళ్లి, జరిగిన సంఘటన గురించి చెప్పాడు. వారు వెంటనే పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కేవీ సతీశ్‌ కుమార్‌, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో రిజర్వాయర్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి యువకుల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెందుర్తిలో విషాదం

వారిద్దరు బాల్యమిత్రులు. చిన్నపాటి పనులు చేస్తూనే చదువుకుంటున్నారు. వచ్చిన డబ్బుతో కుటుంబాలకు ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నారు. ఎక్కడికైనా కలిసే వెళ్తారు. చివరకు మృత్యువులోనూ వారి బంధం వీడలేదు. బల్లంకి శేఖర్‌. యాదాడ లక్ష్మణ్‌కుమార్‌ మృతితో పెందుర్తిలో విషాదం అలముకుంది, ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు. శేఖర్‌ చిన్నప్పుడే తండ్రి బంగార్రాజు మరణించడంతో తల్లి మహాలక్ష్మి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అన్నయ్య వాసు, మిత్రుడు లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి శేఖర్‌ డాక్‌యార్డులో పనికి వెళ్లేవాడు. లక్ష్మణ్‌కుమార్‌ తండ్రి సూరిబాబు ఎలక్ట్రీషియన్‌, తల్లి లక్ష్మి టైలర్‌. అన్నయ్య మన్మథరావు బిగ్‌బాస్కెట్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన అన్నయ్య వాసు, మిత్రుడు లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి చేపలు పట్టేందుకు మేహాద్రి రిజర్వాయర్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కాలుజారి లక్ష్మణ్‌కుమార్‌ నీటిలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు దూకిన శేఖర్‌ విఫలమై, అతడుకూడా మునిగిపోయాడు. దీంతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - Sep 08 , 2025 | 12:49 AM