మన్యం గజ గజ
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:00 PM
మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. గత ఆరు రోజులుగా కొయ్యూరు మండలం మినహా పది మండలాల్లోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. దీంతో చలి విపరీతంగా పెరగడంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు.
సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రత
వణుకుతున్న జనం
అర కులోయలో 3.3 డిగ్రీలు
చలి మంటలు వేసుకుంటున్న ప్రజలు
పాడేరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. గత ఆరు రోజులుగా కొయ్యూరు మండలం మినహా పది మండలాల్లోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. దీంతో చలి విపరీతంగా పెరగడంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. రాత్రి, పగలు సైతం ఒకేలా చలి ప్రభావం చూపుతుండగా.. మధ్యాహ్నం ఒక మోస్తరుగా చలి తగ్గుతోంది. తాజా వాతావరణంతో సాధారణ జన జీవనానికి అంతరాయం ఏర్పడుతున్నది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్ముకుంది. చలి నుంచి ఉపశమనం పొందేందుకు జనం అవస్థఽలు పడుతున్నారు.
అరకులోయలో 3.3 డిగ్రీలు
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో శనివారం అరకులోయలో 3.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే డుంబ్రిగుడలో 4.1, ముంచంగిపుట్టులో 4.4, జి.మాడుగులలో 4.8, చింతపల్లిలో 5.5, పాడేరులో 6.2, హుకుంపేటలో 6.7, పెదబయలులో 7.6, కొయ్యూరులో 11.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హుకుంపేటలో
మండలంలో శనివారం మంచు దట్టంగా కురిసింది. ఉదయం పది గంటల వరకు మంచు వీడకపోవడంతో రాకపోకలకు ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మంచు ప్రభావం హుకుంపేట సంతపై పడింది. వ్యాపారులు, గిరిజనులు చలిలో రావడానికి అవస్థలు పడ్డారు. రోడ్డు సక్రమంగా కనిపించపోవడంతో డ్రైవర్లు భయంతో వాహనాలను నడిపారు.
ముంచంగిపుట్టులో..
మండలంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రత పడిపోవడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. శనివారం 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి ఎముకలు కొరుకుతోంది. ఉదయం 10 గంటల వరకు పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు. చల్లటి గాలులకు ఉదయం, సాయంత్రం రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. శీతల గాలులకు వెచ్చని దుస్తులు లేక మారుమూల గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఐటీడీఏ ద్వారా ఉచితంగా రగ్గులు, శాలువాలు పంపిణీ చేయలని మారుమూల గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.