పది గంటలైనా వదలని పొగమంచు
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:37 AM
మన్యంలో సోమవారం పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఉదయం పది గంటలైనా పొగమంచు వదలని పరిస్థితి నెలకొంది.
సింగిల్ డిజిట్‌కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
జి.మాడుగులలో 6.5 డిగ్రీలు నమోదు
పాడేరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఉదయం పది గంటలైనా పొగమంచు వదలని పరిస్థితి నెలకొంది. శీతాకాలం నేపథ్యంతో పాటు వాతావరణంలోని మార్పులతో మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగ జారుగుతున్నాయి. దీంతో చలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీని వలన ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. అలాగే ఉదయం తొమ్మిది పది గంటల వరకు దట్టంగా పొగమంచు కురవడం, మధ్యాహ్నం వేళలో ఒకటి రెండు గంటలు మాత్రమే గట్టిగా ఎండ కాస్తుండడంతో పగలు, రాత్రుళ్లు తేడా లేకుండా చలి ప్రభావం చూపుతున్నది. జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు.
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా సింగిల్ డిజిట్‌లో కొనసాగుతున్నాయి. సోమవారం జి.మాడుగులలో 6.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అరకులోయలో 6.7, డుంబ్రిగుడలో 8.0, ముంచంగిపుట్టులో 8.8, హుకుంపేటలో 9.5, పెదబయలులో 10.3, పాడేరులో 10.9, చింతపల్లిలో 11.5, కొయ్యూరులో 13.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల పరిధిలో సోమవారం ఉదయం 10 గంటలు దాటినా మంచు తెరలు వీడలేదు. దీంతో వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలుకావడంతో వృద్ధులు, చిన్నారులు గజగజ వణుకుతున్నారు.
జి.మాడుగులలో...
జి.మాడుగుల: మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 10 గంటలైనా మంచు తెరలు వీడలేదు. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌గా నమోదు కావడంతో చలి ప్రభావం అధికంగా ఉంది. జి.మాడుగుల నుంచి పాడేరు, చింతపల్లి ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు.