రిజర్వాయర్లకు పోటెత్తిన వరద
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:27 AM
రిజర్వాయర్లకు పోటెత్తిన వరద
అధికారులు అప్రమత్తం
స్పిల్‌వే గేట్లు ఎత్తి.. దిగువకు నీరు విడుదల
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు
------
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ప్రభావంతో జిల్లాలో సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాల్లోకి వరద పోటెత్తుతున్నది. దీంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రిజర్వాయర్లకు ఎటువంటి ముప్పు వాటిల్ల కుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా జలాశయాల స్పిల్‌వే గేట్ల నుంచి భారీ ఎత్తున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శారదా, బొడ్డేరు, పెద్దేరు, తాండవ, సర్పా, వరహా నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. నదులకు ఇరువైపులా వున్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
-----
రైవాడ జలాశయంలోకి 3 వేల క్యూసెక్కుల వరద
దేవరాపల్లి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రైవాడ జలాశయంలోకి సమ్మెద, పినకోట గెడ్డల నుంచి మూడు వేల క్యూసెక్కుల వరదనీరు చేరుతుంది. గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా మంగళవారం సాయంత్రం 112.3 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్‌లోకి వరద ప్రవాహం పెరుగుతుండడంతో స్పిల్‌వే గేట్లు ఎత్తి 2,700 క్యూసెక్కుల నీటిని శారదా నదిలోకి విడుదల చేస్తుననట్టు జలాశయం డీఈఈ సత్యంనాయుడు తెలిపారు. దిగువున వున్న తామరబ్బ వద్ద వంతెనను తాకుతూ శారదా నది ప్రవహిస్తున్నది.
తాండవ నుంచి 2,472 క్యూసెక్కులు విడుదల
నాతవరం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాండవ జలాశయంలోకి వరద ప్రవాహం పెరుగుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా మంగళవారం 1,220 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 377.6 అడుగులు వుంది. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో రెండు స్పిల్‌వే గేట్లు ఎత్తి 2,472 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు డీఈఈ అనురాధ, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ చెప్పారు. మంగళవారం రాత్రికి ఇన్‌ఫ్లో పెరిగితే స్పిల్‌వే గేట్ల నుంచి అవుట్‌ఫ్లోను మరింత పెంచుతామన్నారు. అందువల్ల తాండవ నదికి ఇరువైపులా వున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.
పెద్దేరుకు పెరుగుతున్న వరద
మాడుగుల రూరల్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): పెద్దేరు జలాశయానికి వరద తాకిడి పెరిగింది. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు కాగా మంగళవారం ఉదయం 467 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 134.6 మీటర్లకు చేరింది. అధికారులు స్పిల్‌వేలో ఒక గేటు తెరిచి 300 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. సాయంత్రానికి ఇదే ఇన్‌ఫ్లో కొనసాగడంతో నీటి విడుదలను 400 క్యూసెక్కులకు పెంచారు. తుఫాన్ వర్షాలతో ఇన్‌ఫ్లో మరింత ఎక్కువైతే మరో గేటు ఎత్తుతామని, రిజర్వాయర్‌లోకి చేరుతున్న వరద నీటికి అనుగుణంగా గేట్లు ఎత్తి నదిలోకి నీటిని విడుదల చేస్తామని డీఈఈ చిన్నంనాయుడు తెలిపారు.
రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయానికి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నది. అధికారులు స్పిల్‌వేగేట్లు ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని సర్పా నదిలోకి వదులుతున్నారు.
కోనాం జలాశయం నుంచి 500 క్యూసెక్కులు..
చీడికాడ, అక్టోబరు 28 (ఆంధ్ర జ్యోతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మండలంలోని కోనాం జలాశయంలోకి 500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 101.25 మీటర్లుకాగా మంగళవారం 98.75 మీటర్ల వద్ద స్థిరంగా వుంచుతూ స్పిల్‌వే గేట్లను ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని బొడ్డేరు నదిలోకి విడిచిపెడుతున్నారు.
తీవ్రరూపం దాల్చిన శారదా నది
అనకాపల్లి టౌన్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావంతో పలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో శారదా నదిలో వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతున్నది. రైవాడ, పెద్దేరు, కోనాం జలాశయాల నుంచి నీటి విడుదలతోపాటు తాచేరు, బొడ్డేరు, తదితర గెడ్డలన్నీ శారదా నదిలో కలవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నది. సోమవారంతో పోల్చితే మంగళవారం నీటి ఉధృతి మరింత పెరిగింది. అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర శారదా నది వంతెన వద్దకు వెళ్లి పరిశీలించారు.