కుండపోత
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:32 PM
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మన్యంలో గురువారం కుండపోతగా వర్షం కురిసింది. ఏజెన్సీ వ్యాప్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణ ఎండ వాతావరణం కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి నుంచి వాతారణం మారిపోయి ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.
పలు మండలాల్లో భారీ వర్షం
రహదారులు జలమయం
జన జీవనానికి అంతరాయం
పాడేరు, ఆగస్టు 14:(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మన్యంలో గురువారం కుండపోతగా వర్షం కురిసింది. ఏజెన్సీ వ్యాప్తంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణ ఎండ వాతావరణం కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి నుంచి వాతారణం మారిపోయి ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా, గెడ్డల్లోకి వర్షపు నీరు భారీగా చేరింది. పట్టణంలోని మురుగుకాల్వలు సైతం వర్షపు నీటితో ప్రవహించాయి. జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాడేరు మండలం గుత్తులపుట్టు సంతకు ఆటంకం కలగడంతో వర్తకులు, రైతులు, వినియోగదారులు అవస్థలు పడ్డారు. సుమారుగా రెండు గంటల పాటు వర్షం కురిసి, ఆ తరువాత ముసురు వాతావరణం కొనసాగింది. కాగా వర్షం కురిసినప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగాయి. గురువారం కొయ్యూరులో 33.5, పాడేరులో 30.2, అరకులోయలో 30.0, డుంబ్రిగుడలో 29.8, హుకుంపేటలో 29.0, అనంతగిరిలో 28.3, ముంచంగిపుట్టులో 28.0, జి.మాడుగులలో 27.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు న మోదయ్యాయి.
అనంతగిరిలో..
అనంతగిరి: మండలంలో గురువారం కురిసిన భారీ వర్షానికి గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. అనంతగిరి, కాశీపట్నం, చిలకలగెడ్డ, గుమ్మకోట గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెదకోట- కుడియా మధ్యలోని కాజ్‌వే పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు నాలుగు గంటలపాటు పాటు రాకపోకలు నిలిచిపోయాయి. పినకోట, పెదకోట, కివర్ల పంచాయతీలోని సుమారు 20 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.