Share News

స్టీల్‌ ప్లాంట్‌కు తొలిఅడుగు

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:36 AM

చందనాడ శివారు పాటిమీద గ్రామంలో నిర్వహించే ఈ సభ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోండా 400 మంది పోలీసు సిబ్బందిని నియమించారు.

స్టీల్‌ ప్లాంట్‌కు తొలిఅడుగు
ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

నక్కపల్లి మండలంలో ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ ఉక్కు ఫ్యాక్టరీ

నేడు ప్రజాభిప్రాయ సేకరణ

పాటిమీద గ్రామంలో ఏర్పాట్లు

400 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు

మొత్తం పెట్టుబడి రూ.1,47,162 కోట్లు

మొదటి దశ 2029 జనవరి నాటికి పూర్తి

7.3 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి

రెండో దశ 2033నాటికి పూర్తి

10.5 మిలియన్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి

61 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

పాయకరావుపేట నియోజకవర్గం

నక్కపల్లి మండలంలో విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ భూముల్లో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కాలుష్య

నియంత్రణ మండలి, పర్యావరణ

అనుమతులకు సంబంఽధించి శనివారం ప్రజాభిప్రాయసేకరణ జరగనుంది.

చందనాడ శివారు పాటిమీద గ్రామంలో నిర్వహించే ఈ సభ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోండా 400 మంది పోలీసు సిబ్బందిని నియమించారు.

ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ కార్పొరేషన్‌.. ప్రపంచంలోనే దిగ్గజ ఉక్కు తయారీ సంస్థలు. యూర్‌పలోని లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలర్‌ మిట్టల్‌, జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ సంస్థలు సంయుక్తంగా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి, ‘ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌‘ (ఏఎం ఎన్‌ఎ్‌సఐ) పేరిట జేవీగా ఏర్పాటయ్యాయి. నక్కపల్లి మండలంలో భారీ ఉక్కు కర్మాగా రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. ఇందుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.

మొత్తం రూ.1,47,162 కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో దీనిని నిర్మిస్తారు. 7.3 మిలియన్‌ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 2029 జనవరి నాటికి తొలి దశ, 10.5 మిలియన్‌ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 2033 నాటికి రెండో దశ ఉత్పత్తి ప్రారంభం అవుతాయి. మొత్తం 61 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉక్కు ఫ్యాక్టరీ తొలి దశ నిర్మాణం కోసం నక్కపల్లి మండలం బుచ్చిరాజుపేటలో 102.18 ఎకరాలు, చందనాడలో 840.2 ఎకరాలు, డీఎల్‌ పురంలో 674.39 ఎకరాలు, రాజయ్యపేటలో 36.62 ఎకరాలు, వేంపాడులో 510.92 ఎకరాలు కలిపి మొత్తం 2,164.31 ఎకరాలను కేటాయించారు. ఒకే బ్లాక్‌ కింద ఉన్న ఈ భూములను ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం ఏపీఐఐసీ గతంలోనే సేకరించింది. తొలి దశ సివిల్‌ వర్క్‌లు పూర్తిచేసి యంత్ర పరికరాలను అమర్చాక.. ఆయా పనుల పురోగతిని బట్టి రెండో దశ ప్రాజెక్టుకు, క్యాప్టివ్‌ పోర్టుకు భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సుమారు నాలుగు వేల ఎకరాలు అవసరం అవుతాయని అంచనా వేశారు.

ఏపీ ఇండస్ట్రియల్‌ డెవల్‌పమెంట్‌ పాలసీ 4.0 (2024-29) ప్రకారం.. ఆర్థిక ప్రోత్సాహకాలు, 50 శాతం మూలధన రాయితీ, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపు, పదేళ్లపాటు నీటి సరఫరా, 15 ఏళ్ల పాటు ఈడీ మినహాయుంపు, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌, ఇంకా విద్యుత్తు, నీరు, రైలు, రోడ్డు కనెక్టివిటీ, సమీపంలోని క్వారీల వినియోగం, నిబంఽధనల ప్రకారం ఎన్‌ఎండీసీతో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ముడి ఖనిజం వినియోగం తదితర ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రతిపాదించింది.

అనుబంధంగా పోర్టు

స్టీల్‌ ప్లాంట్‌కు ముడి సరకు దిగుమతి, ఉక్కు ఉత్పత్తుల ఎగుమతి కోసం కో-టెర్మినస్‌ క్యాప్టివ్‌ పోర్ట్‌ నిర్మాణానికి సముద్ర తీరాన 128 హెక్టార్ల భూమి కావాలని ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ కోరింది. తొలిదశలో 1.5 కిలోమీటర్ల మేర 5 బెర్తులు, రెండో దశలో 3.8 కిలోమీటర్ల పొడవున 12 బెర్తులు నిర్మించనున్నట్టు ప్రతిపాదనల్లో పేర్కొంది. మొదటి దశలో రూ.5,816 కోట్లు, రెండో దశలో మరో రూ.5,383 కోట్లు కలిపి మొత్తం రూ.11,199 కోట్ల పెట్టుబడితో ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. ఈ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటైతే రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుగా నిలుస్తుంది. ఉక్కు పరిశ్రమకు అనుబంధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుతో మరికొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు పూర్తి

స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ అనుమతులకు సంబంఽధించి శనివారం చందనాడ శివారు పాటిమీద గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాలమైన సభావేదికను నిర్మించారు. పటిష్ఠమైన ఐరన్‌ గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు శనివారం రాత్రి ఇక్కడకు వచ్చి సభా వేదికను పరిశీలించారు. బందోబస్తుకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట సీఐ కె.కుమారస్వామి వున్నారు.

Updated Date - Sep 27 , 2025 | 12:36 AM