Share News

ఉపమాక క్షేత్రానికి తొలి ఏకాదశి శోభ

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:51 PM

ఉపమాక క్షేత్రం ఆదివారం తొలి ఏకాదశి శోభతో కళకళలాడింది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పోటెత్తింది.

ఉపమాక క్షేత్రానికి తొలి ఏకాదశి శోభ
స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు

భక్తులతో ఆలయం కిటకిట

ఘనంగా గిరి ప్రదక్షిణ

నక్కపల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఉపమాక క్షేత్రం ఆదివారం తొలి ఏకాదశి శోభతో కళకళలాడింది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పోటెత్తింది. తెల్లవారుజామున కొండపై వున్న స్వామివారి నిజరూపానికి పంచామృతాభిషేకం చేసి, ధూప, దీప నైవేద్య నీరాజన మంత్రపుష్పాలు సమర్పించిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. కింద ఆలయంలో క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి, ఉభయదేవేరులతో కూడిన స్వామివారికి అర్చకుల బృందం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో క్యూ లైన్లన్నీ కిటకిటలాడాయి. ఆలయ ప్రధాన రాజగోపురం బయట కూడా భక్తులు క్యూ లైన్లలో వేచివున్నారు. ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు, అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పీసపాటి శేషాచార్యులు, భాగవతం సాయి గోపాలాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా గిరి ప్రదక్షిణ

ఆదివారం సాయంత్రం స్వామివారు కొలువైన గరుడాద్రి పర్వతం చుట్టూ భక్తుల గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. శ్రీనివాసా భజన భక్త సమాజం భక్తులు, నక్కపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన శ్రీవారి సేవకులు, అనేక మంది మహిళా భక్తులు తరలివచ్చారు. భజన గీతాలు, గోవిందనామస్మరణతో భక్తులంతా గిరి ప్రదక్షిణ చేశారు.

Updated Date - Jul 06 , 2025 | 11:51 PM