కన్న తండ్రే కాలయముడై!
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:47 AM
కన్న తండ్రే కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన తగరపువలసలో జరిగింది. సీఐ తిరుమలరావు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం...
నాలుగేళ్ల కుమార్తెపై అత్యాచారం
తగరపువలసలో దారుణం
నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
భీమునిపట్నం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి):
కన్న తండ్రే కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన తగరపువలసలో జరిగింది. సీఐ తిరుమలరావు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం...
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన ఓ వ్యక్తికి భార్య, ఐదేళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. వీరంతా వన్‌టౌన్‌లోని జాలారిపేటలో నివాసం ఉంటున్నారు. సుమారు రెండేళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య జాలారిపేటలోనే ఉన్న పుట్టింట్లో పిల్లలతో ఉండగా, పక్క ఇంట్లోనే ఆ వ్యక్తి వేరేగా నివసిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో భర్త పిల్లలను తీసుకుని వెళ్లిపోయాడు. మద్యం మత్తులో తిప్పలవలస తీసుకు వెళ్లిపోతున్నాడని భావించి బాలిక తల్లి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమస్యను వివరించింది. అక్కడి సిబ్బంది ఇలాంటి విషయాలను పట్టించుకోమని చెప్పడంతో వెనుదిరిగినట్టు ప్రచారం జరుగుతోంది. పిల్లలను తీసుకువెళ్లిన వ్యక్తి తగరపువలస పాతసినిమాహాలు జంక్షన్ వద్దకు వెళ్లిన తర్వాత ఒక దుకాణం ముందు వేసిన రేకులషెడ్‌లో పిల్లలను నిద్రపుచ్చాడు. అక్కడ బళ్లారి నుంచి పప్పులోడుతో వచ్చిన లారీ తగరపువలసలో కొంత, విజయగరంలో కొంత సరకు అన్‌లోడ్ చేయాల్సి ఉండడంతో పిల్లలను నిద్రపుచ్చిన దుకాణం ముందు ఆపారు. తగరపువలస మార్కెట్‌కు మంగళవారం సెలవు కావడంతో లారీ అక్కడే ఉండిపోయింది. కుమారుడు, కుమార్తె నిద్రపోతుండగా మద్యం మత్తులో ఉన్న తండ్రి విచక్షణ మరిచి తన నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో బాలిక బిగ్గరగా ఏడుస్తుండగా, పక్కనే ఆగివున్న లారీలో వంట చేసుకుంటున్న సిబ్బంది విన్నారు. ఏం జరిగిందో చూసిరావాలని లారీ డ్రైవర్ కమ్ ఓనర్ క్లీనర్‌ను పంపించాడు. అతడు వెళ్లిచూసేసరికి బాలికపై ఆ వ్యక్తి లైంగికదాడి చేస్తుండడంతో జాతీయరహదారిపై వెళ్లే ద్విచక్ర వాహనాలను ఆపి విషయం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారంతా కన్నడంలో మాట్లాడుతుండడం, తెలుగు రాకపోవడంతో ద్విచక్రవాహదారులకు అర్థం కాలేదు. చివరకు ఒక వ్యక్తి సమీపంలోని బ్యాంకు సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లి విషయం చెప్పగా, తనకు తెలిసిన హోంగార్డుకు సమాచారం ఇచ్చాడు. అతడు తగరపువలసలో ఉన్న కానిస్టేబుల్‌కు చెప్పడంతో అతడు వెళ్లి చూసేసరికి బాలిక తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతోంది. దీంతో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ నిర్మలకు సమాచారం అందించాడు. వెంటనే ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, పక్కనే నిద్రపోతున్న ఏడేళ్ల బాలుడిని తల్లి వద్దకు, నిందితుడిని భీమిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని మహిళా పోలీసుస్టేషన్ ఏసీపీ సీహెచ్ పెంటారావు బుధవారం ఉదయం పరిశీలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, మహిళా పోలీసుస్టేషన్‌కు అప్పగించామని సీఐ తిరుమలరావు తెలిపారు.