Share News

ఫలించనున్న రైతుల నిరీక్షణ

ABN , Publish Date - Aug 17 , 2025 | 10:52 PM

మినీ గోకులాల పేరిట షెడ్లు నిర్మించుకున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో త్వరలో పెండింగ్‌ బిల్లులు జమకానున్నాయి. ఈ మేరకు రైతుల వివరాలను ఉపాధి హామీ పథకం సిబ్బంది సేకరిస్తున్నారు.

 ఫలించనున్న రైతుల నిరీక్షణ
జెడ్‌.గంగవరంలోని మినీ గోకులం షెడ్డు

త్వరలో వారి ఖాతాల్లో జమకానున్న మినీ గోకులాల పెండింగ్‌ బిల్లులు

వివరాలు సేకరిస్తున్న ఉపాధి హామీ సిబ్బంది

మాకవరపాలెం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మినీ గోకులాల పేరిట షెడ్లు నిర్మించుకున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో త్వరలో పెండింగ్‌ బిల్లులు జమకానున్నాయి. ఈ మేరకు రైతుల వివరాలను ఉపాధి హామీ పథకం సిబ్బంది సేకరిస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో మినీ గోకులాల పేరుతో రైతులు షెడ్లు నిర్మించుకున్నారు. అప్పట్లో ప్రభుత్వం 90 శాతం రాయితీపై గోకులాల షెడ్లు నిర్మించుకునేందుకు రైతులను ప్రోత్సహించింది. ఆరు పశువులకు సంబంధించి షెడ్డు నిర్మించుకుంటే రూ.లక్షా 60 వేలు, నాలుగు పశువులకు అయితే రూ.లక్షా 30 వేలు చొప్పున మంజూరు చేసింది. ప్రతి రైతు తమ షెడ్డు నిర్మాణానికి అయిన ఖర్చు చూపించే బిల్లు, షెడ్డు ఫొటో తీసి పశుసంవర్థక శాఖాధికారులకు అందజేశారు. బిల్లులు జమ చేయడానికి ఎం.బుక్‌లు సిద్ధం చేశారు. అయితే ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో షెడ్ల డబ్బులు రైతుల ఖాతాల్లో జమకాలేదు. దీనిపై రైతులు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాలు చేశారు. అలాగే హైకోర్టును ఆశ్రయించారు. కానీ బిల్లులు మాత్రం మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దీనికి కదలిక వచ్చింది. పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకు పశుసంవర్థక శాఖాధికారులను వివరాలు కోరింది. అయితే తమ వద్ద వివరాలు లేవని ఆ శాఖ చేతులెత్తేసింది. దీంతో ఉపాధి హామీ పథకం సిబ్బంది ద్వారా రైతుల వివరాలు సేకరిస్తున్నారు. గ్రామాలవారీగా రైతుల నుంచి గత పది రోజులుగా గోకులాల షెడ్లు వివరాలు తీసుకుంటున్నారు. రైతుల వద్దకు వెళ్లి రైతు ఫొటో, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌లను అప్‌లోడ్‌ చేస్తున్నారు. 15 రోజుల్లో పెండింగ్‌ బిల్లులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని ఉపాధి హామీ పథకం సిబ్బంది చెబుతున్నారు.

Updated Date - Aug 17 , 2025 | 10:52 PM