ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:44 AM
ప్రభుత్వ స్థలాం కనిపిస్తే చాలు అక్రమార్కులు వాలిపోతున్నారు.
పెందుర్తి ఆదిత్యనగర్‌లో భవన నిర్మాణం
దువ్వాడ ఏపీఐఐసీ స్థలంలో అక్రమం
హెచ్చరిక బోర్డు తొలగించి మరీ పనులు
రెచ్చిపోతున్న అక్రమార్కులు
పెందుర్తి/కూర్మన్నపాలెం, నవంబరు 23 ( ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ స్థలాం కనిపిస్తే చాలు అక్రమార్కులు వాలిపోతున్నారు. దర్జాగా ఆక్రమణలకు తెగబడుతున్నారు. తప్పుడు పత్రాలను సృష్టించి మరీ యథేచ్ఛగా పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులు తొలగించినా మళ్లీ అదేచోట నిర్మాణాలు సాగిస్తున్నారు. పెందుర్తి, గాజువాక మండలాల పరిధిలో ఇటీవల ఈ అక్రమాలకు అడ్డు లేకుండా పోతోంది.
పెందుర్తి ఆదిత్యనగర్ సమీపంలో వేర్వేరు సర్వే నంబర్లలో 20 ఎకరాల గెడ్డ పోరంబోకు ప్రభుత్వ భూమి ఉంది.. సమీప భూముల్లో లేఅవుట్‌లు వెలియడంతో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఇక్కడి స్థలాల విలువ కోట్లకు చేరింది. ఈ క్రమంలో పది ఎకరాల గెడ్డ పోరంబోకు భూమిపై ఆక్రమణదారుల కన్ను పడింది. ఇక్కడ గజం స్థలం రూ.40 వేలు పలుకుతోంది. దీంతో కొంతమంది సిండెకేట్‌గా మారి ఈ భూమిని కొట్టేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. ప్రభుత్వ భూమిని ఆనుకుని ఉన్న జిరాయితీ సర్వే నంబరుతో తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమణలకు తెరతీశారు. ఆయా స్థలాల్లో పక్కా నిర్మాణాలు చేపట్టారు. ప్లాట్లుగా విభజించి మరీ విక్రయాలు చేసేశారు. ఫిర్యాదుల మేరకు స్పందించిన రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించినా, మళ్లీ తాజాగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీనివెనుక రెవెన్యూ కింది స్థాయి సిబ్బంది, కొంతమంది అధికార పార్టీ నేతల సహకారం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సుమారు పది ఎకరాల ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైపోయిందని సమాచారం. తాజాగా ఇక్కడి స్థలాన్ని ఆక్రమించి వరుసగా నిర్మాణాలకు సిద్ధపడిన వైనంపై అధికారులకు ఫిర్యాదు అందింది.
సర్వే చేపడతాం
ఆదిత్యనగర్ సమీప గెడ్డ పోరంబోకు ఆక్రమణలకు సంబంధించి నిర్దిష్ట సమాచారం ఉంది. వేర్వేరు సర్వే నంబర్లలో గల ప్రభుత్వ, గెడ్డ పోరంబోకు భూములపై సర్వే చేపట్టి, పరిరక్షణలకు చర్యలు తీసుకుంటాం. హెచ్చరికబోర్డులు ఏర్పాటుచేస్తాం. ఈ భూములను ల్యాండ్‌బ్యాంకులో ఉంచి ఆక్రమణదారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
-ఇంటి వెంకట అప్పారావు, తహసీల్దార్, పెందుర్తి
బోర్డు తొలగించి మరీ నిర్మాణం
గాజువాక మండలం దువ్వాడ రైల్వే స్టేషన్ సమీప సర్వే నంబరు 133/1లో ఏపీఐఐసీకి (సుమారు 150 గజాల స్థలం ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.50 లక్షలు. ఈ స్థలాన్ని కబ్జా చేసి అక్రమార్కులు భవన నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రెండు నెలల కొందట ఏపీఐఐసీ అధికారులు ఆ నిర్మాణంలో హెచ్చరిక బోర్డు పెట్టారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అయితే తాజాగా ఆ బోర్డును తొలగించి మరీ కబ్జాదారులు పక్కా నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయంపై ఏపీఐఐసీ అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.