కమ్మేస్తున్న కాలుష్యం
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:11 AM
గాలి నాణ్యత క్షీణతలో విశాఖ నగరం దేశ రాజధాని ఢిల్లీ కంటే దారుణమైన స్థితిలో ఉంది.
గాలిలో తగ్గిన నాణ్యత
నాణ్యతా సూచీ 303గా నమోదు!
ఢిల్లీ కంటే ఘోరం
పరిశ్రమలతోపాటు ఇతరత్రా రంగాల్లో పెరిగిన కాలుష్యం
సీఎం ఆదేశాల మేరకు పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారుల తనిఖీలు
పలు లోపాలు గుర్తింపు
ఆన్‌లైన్, మాన్యువల్ ఏక్యూఐ నమోదులో తేడాలు
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
గాలి నాణ్యత క్షీణతలో విశాఖ నగరం దేశ రాజధాని ఢిల్లీ కంటే దారుణమైన స్థితిలో ఉంది. గురువారం జీవీఎంసీ ప్రఽధాన కార్యాలయం భవనంపై ఉన్న ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (గాలి నాణ్యతా సూచీ) 303గా నమోదైంది. ఇది ఢిల్లీలో (40 స్టేషన్లు ఉన్నాయి) 234గా నమోదైంది. విశాఖలో గడచిన పది రోజుల్లో నాలుగు రోజులు గాలి నాణ్యతా సూచీ 300 మార్కును దాటింది. అత్యధికంగా ఈనెల 19వ తేదీన 342గా నమోదైంది. ఈనెల 18న 319, ఇంకా 24న 319గా నమోదైంది. ఆన్‌లైన్‌లో నమోదైన గాలి నాణ్యతా సూచీలు పరిశీలిస్తే...ఈనెల 15న 295, 16న 179, 17న 224, 18న 319, 19న 342, 20న 289, 21న 273, 22న 296, 23న 296, 24న 319గా నమోదైంది.
కాలుష్య కారణాలు ప్రధానంగా ధూళి కణాలు పరిమితికి మించి అంటే...పీఎం 10 (10 మైక్రోమీటర్లు, అంతకంటే తక్కువ వ్యాసార్థం కలిగిన ధూళి కణాలు), పీఎం 2.5 (2.5 మైక్రోమీటర్లు, అంతకంటే తక్కువ వ్యాసార్థం కలిగిన అతి సూక్ష్మ ధూళి కణాలు)తో పాటు మరికొన్ని కాలుష్య కారకాల పెరిగినప్పుడు గాలి నాణ్యత పడిపోతుంది. దీని ఆఽదారంగానే గాలి నాణ్యతా సూచీ (ఎక్యూఐ) నిర్ధారిస్తారు. గాలి నాణ్యతా సూచీ 51 నుంచి 100 మధ్య నమోదైతే సంతృప్తిగా ఉన్నట్టు లెక్క. 101 నుంచి 200 వరకు ఉంటే మోడరేట్ (ఫర్వాలేదు), 201 నుంచి 300 వరకు నమోదైతే పూర్ (ప్రమాదకరం), 301 నుంచి 400 మధ్య ఉంటే వెరీ పూర్ (మరింత ప్రమాదకరం), 401 నుంచి 500 వరకు ఉంటే పరిస్థితి అదుపు తప్పినట్టుగా కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించింది. గురువారం దేశంలోని ఆరు నగరాలు/పట్టణాల్లో ఏక్యూఐ ఇండెక్స్ 300 మార్క్‌ను దాటగా వాటిలో విశాఖపట్నం ఒకటి. ఒడిశాలో మూడుచోట్ల 300 మార్కు దాటింది.
విశాఖ నగరంలో ఉన్న ఏకైక ఆన్‌లైన్ స్టేషన్‌లో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యతా సూచీలు నమోదుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వారం అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో విశాఖలో కాలుష్యంపై సీఎం స్పందించారు. దీంతో గడచిన నాలుగు రోజుల నుంచి నగరానికి ఆనుకుని భారీ పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూడిన బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. విశాఖ పోర్టు, పోర్టు పరిధిలో కార్గో హ్యాండ్లింగ్ సంస్థలు, ఆర్సెల్లార్ మిట్టల్, ఆర్‌సీఎల్, హెచ్‌పీసీఎల్, కోరమాండల్, విశాఖ ఉక్కు కర్మాగారం, అదానీ గంగవరం పోర్టు, హిందూజా పవర్ ప్లాంటును సందర్శించినప్పుడు కాలుష్య కారకాలు ఎక్కువగా నమోదుకు అక్కడి వాతావరణం దోహదం చేస్తున్నట్టుగా గుర్తించారు. పరిశ్రమల ప్రాంగణాల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ చూపడం లేదు. విశాఖ పోర్టులో అయితే బొగ్గు, ఖనిజాల ఎగుమతి, దిగుమతి సమయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. రోడ్లను నిరంతరం నీటితో తడపకుండా జాప్యం చేస్తున్నారు. బొగ్గు రవాణా చేసే లారీలపై పూర్తిగా టార్పాలిన్లు కప్పడం లేదు. అన్ లోడ్ అయిన వాహనాలను ఆయా యార్డుల వద్ద నీటితో శుభ్రం చేయకుండా బయటకు పంపుతున్నారు. ఇలా పలు ఉల్లంఘనలు ఉన్నట్టు గుర్తించారు. ఇదిలావుండగా పరిశ్రమలు, పోర్టు పరిసరాల్లో కాలుష్యం మాదిరిగా నగరంలో కాలుష్య కారకాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. నగరంలో 15 లక్షల వాహనాలు ఉన్నాయి. మెజారిటీ వాహనాలు రోజూ రోడ్లపైకి వస్తుండడంతో పొగ నగరాన్ని చుట్టేస్తోంది. అదేవిధంగా భవన నిర్మాణాలు, పాత భవనాలు కూల్చడం, చెత్త తరలింపు, నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రోడ్లను తవ్వి...అలాగే వదిలేయడంతో ధూళి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఏక్యూఐ నమోదులో తేడాలు
విశాఖ నగరం మొత్తానికి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ భవనంపై మాత్రమే ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్ ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఆనుకుని ఈ మిషన్ ఉంది. కాంప్లెక్స్‌కు వందలాది బస్సులు వచ్చిపోతుంటాయి. నగరం మధ్యనున్న ఆన్‌లైన్ మిషన్ ఆనుకుని రోడ్డుపై నిరంతరం వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో ఎక్కువగా ఏక్యూఐ ఇండెక్స్ ఎక్కువగా నమోదవుతుందని అంటున్నారు. ఈ మిషన్‌లో కాలుష్య కారకాలు నమోదుచేసే పరికరాల్లో తేడాలున్నాయని అనుమానంతో ఇటీవల అధికారులు తనిఖీ చేశారు. అయితే పెద్దగా తేడా కనిపించలేదు. ఈనెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మిషన్‌తోపాటు నగరంలో మరో ఎనిమిదిచోట్ల మాన్యువల్‌గా ఏక్యూఐ ఇండెక్స్‌ను పరిశీలించారు. ఆన్‌లైన్ మిషన్‌కు మాన్యువల్ మిషన్లకు మధ్య వ్యత్యాసం ఉందని గుర్తించారు. గాలి నాణ్యతా సూచీ విలువకు సంబంధించి ఏడు రోజుల సగటు తీసుకుంటే జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉన్న ఆన్‌లైన్ మిషన్‌లో 308గా నమోదైంది. మాన్యువల్‌గా చూస్తే...ఆటోనగర్‌లో 217, పోలీస్ బ్యారెక్స్ వద్ద 223, జ్ఞానాపురంలో 240, మిందిలో 147, మల్కాపురం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 197, సీతమ్మధారలో 132, పెదగంట్యాడలో 137, ఎంవీపీ కాలనీ రైతుబజార్‌లో 157గా నమోదైంది. కాగా మాన్యువల్ మిషన్‌లలో కాలుష్య కారకాల తీవ్రతకు ఎప్పటికప్పుడు సాంకేతిక సిబ్బంది స్వయంగా పర్యవేక్షించడంతో ఏక్యూఐ విలువ నమోదులో కచ్చితత్వం ఎక్కువగా ఉంటుందని కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పీవీ ముకుందరావు తెలిపారు. మాన్యువల్, ఆన్‌లైన్ మిషన్ల మధ్య కొంతమేర తేడా ఉంటుందన్నారు. నగరంలో కాలుష్య తీవ్రత తగ్గించి, గాలి నాణ్యతా సూచీ మెరుగుపడడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.