సాకారం కానున్న ఆదివాసీల కల
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:50 AM
ఎన్నో ఏళ్లుగా కనీస సౌకర్యాలకు నోచుకోక, అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయిన మైదాన ప్రాంతంలోని గిరిజనుల దశాబ్దాల కల సాకారానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనకాపల్లి జిల్లాలోని మైదానప్రాంత గిరిజనుల చిరకాల కోరిక అయిన ఏజెన్సీ ప్రాంతంలో విలీనం అంశానికి సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టినట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో మైదానప్రాంత గిరిజన గ్రామాలు ఐదో షెడ్యూల్‌లోని ఏజెన్సీలో విలీనానికి మార్గం సుగమమైంది.
మైదాన ప్రాంత గిరిజన గ్రామాలు ఏజెన్సీలో విలీనానికి కదలిక
శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించిన ఎమ్మెల్యే బండారు
సానుకూలంగా స్పందించిన మంత్రి సంధ్యారాణి
జిల్లాలోని ఎనిమిది మండలాల్లో గిరిజన ఆవాసాలు
50 శాతానికి పైబడి గిరిజన జనాభా ఉన్న గ్రామాలను అల్లూరి జిల్లాలో కలిపే యోచన
ఐటీడీఏ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనతో అన్ని విధాలా అభివృద్ధి
చోడవరం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా కనీస సౌకర్యాలకు నోచుకోక, అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయిన మైదాన ప్రాంతంలోని గిరిజనుల దశాబ్దాల కల సాకారానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనకాపల్లి జిల్లాలోని మైదానప్రాంత గిరిజనుల చిరకాల కోరిక అయిన ఏజెన్సీ ప్రాంతంలో విలీనం అంశానికి సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టినట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో మైదానప్రాంత గిరిజన గ్రామాలు ఐదో షెడ్యూల్‌లోని ఏజెన్సీలో విలీనానికి మార్గం సుగమమైంది.
నాలుగేళ్ల క్రితం నాటి వైసీపీ ప్రభుత్వం హయాంలో గిరిజన సలహా మండలిలోని ఎస్‌టీ ఎమ్మెల్యేలు మైదాన ప్రాంతంలోని గిరిజన గ్రామాలను ఏజెన్సీలో విలీనం చేయిస్తామని హడావిడి చేశారు. ఈ మేరకు రావికమతం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కోటవురట్ల, గొలుగొండ, నాతవరం మండలాల్లో 50 శాతానికి పైగా గిరిజనులు నివసిస్తున్న గ్రామాలను గుర్తించారు. ఈ మేరకు సుమారు 200 గ్రామాలను ఏజెన్సీలో విలీనం చేయడానికి ప్రతిపాదనలు కూడా రూపొందించారు. ఆయా ఆవాస ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించి, తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించారు. వీటిని అసెంబ్లీలో ఆమోదించి, కేంద్రానికి పంపించవలసిన సమయంలో.. మైనింగ్ మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెరవెనుక చక్రం తిప్పారు. దీంతో గిరిజన గ్రామాలు ఏజెన్సీలో విలీనం చేసే అంశం మరుగున పడింది. అంతేకాక నాడు అధికారులు రూపొందించిన జాబితాలోని పలు గ్రామాలను ఏజెన్సీలో విలీనం చేయడంపై అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో 200 గ్రామాలను 114 గ్రామాలకు కుందించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం వైసీపీ ప్రభుత్వం పంపలేదు. మైదాన ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసిన బడాబాబులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారుల ఒత్తిళ్లే ఇందుకు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. గిరిజన సలహా మండలి సభ్యులైన ఎస్టీ ఎమ్మెల్యే కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోవడంతో మైదాన ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో ఏజెన్సీలో విలీనం చేసే అంశం ప్రతిపాదనలకే పరిమితమైంది.
గత వైౖసీపీ ప్రభుత్వం జిల్లా పునర్విభజనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాన్ని పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేయడంతో మైదానప్రాంతంలోని గిరిజన గ్రామాలను ఆ జిల్లాలో చేరుస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఏ నిర్ణయం లేకుండానే వైసీపీ ప్రభుత్వం నాటి పాడేరు డివిజన్‌ను మాత్రమే కొత్త జిల్లాలో చేర్చింది. దీంతో మైదానప్రాంత గిరిజనులు తీవ్ర నిరాశ చెందారు. తాజాగా కూటమి ప్రభుత్వం మైదాన ప్రాంతంలోని గిరిజన గ్రామాలను ఏజెన్సీలో విలీనం చేయడంపై సానుకూలంగా వుంది. ఆయా గ్రామాల్లో గిరిజనుల జనాభా వివరాలను పంపించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో తమ చిరకాల కోర్కె నెరవేరుతుందని మైదాన ప్రాంత గ్రామాల గిరిజనుల ఆశగా ఎదురుచూస్తున్నారు.
అభివృద్ధికి ఆమడ దూరం..
అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆనుకొని అనకాపల్లి జిల్లాలో వున్న వందలాది గిరిజన గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్తు, రహదారి వంటి సదుపాయాలు అరకొరగానే వున్నాయి. కనీసం ఉపాధి హామీ పథకం కింద పనులు చేద్దామన్నా సాగునీటి వనరులు లేవు. దీంతో అడవులపై ఆధారపడి, వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను అమ్ముకుంటూ, వచ్చే అరకొర ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నారు. అటు ఐటీడీఏలో విలీనం చేయక, ఇటు మైదాన ప్రాంత అధికారులు పట్టించుకోక.. తమ పని రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఆదివాసీలు వాపోతున్నారు. దేవరాపల్లి, రావికమతం, మాడుగుల మండలాల్లోని పలు గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్తు, రహదారి సౌకర్యాలు లేవు. చదువులు అంతంతమాత్రమే. మైదాన ప్రాంతంలో వుండడంతో ఏజెన్సీలో రిజర్వేషన్లు వీరికి వర్తించవు. మైదాన ప్రాంతంలో ఇతర షెడ్యూల్డు కులాల వారితో వీరు పోటీ పడలేకపోతున్నారు. ఐటీడీఏ ద్వారా ప్రత్యేకంగా ఎటువంటి సంక్షేమ ఫలాలు అందడంలేదు. తమ గ్రామాలను ఐదో షెడ్యూల్డు ప్రాంతంలో విలీనం చేయాలని ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో.. అనకాపల్లి జిల్లాతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 600 గిరిజన గ్రామాలు నాన్‌షెడ్యూల్డు ఏరియాలో ఉన్నాయని, దీంతో ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పారు. ఈ గ్రామాలను ఐదో షెడ్యూల్డు ఏరియాలో చేరుస్తారా? అన్న ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి స్పందించారు. రాష్ట్రంలో 496 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతంలోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు వచ్చాయని, 50 శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా వున్న గ్రామాల వివరాలు తీసుకోవాలని ఐటీడీఏ పీవోలు, కలెక్టర్లకు సూచించామని చెప్పారు. దీంతో మైదానప్రాంత గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
డి.వెంకన్న, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు
అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆనుకొని అనకాపల్లి జిల్లాలోని ఎనిమిది మండలాల్లో వున్న గిరిజన గ్రామాల్లో సర్వే నిర్వహించాలి. గ్రామ సభలు నిర్వహించి గిరిజన జనాభా ఎంత శాతం వున్నారో గుర్తించాలి. వాస్తవానికి 200 పైచిలుకు గ్రామాల్లో గిరిజనులు సగానికిపైబడి వున్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ సంఖ్యను 114కు తగ్గించింది. పైగా ఈ గ్రామాలను సైతం ఐదో షెడ్యూల్‌లో చేర్చలేదు. ఇందుకు రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారుల ఒత్తిళ్లే కారణం. గిరిజన గ్రామాల్లో వేలాది ఎకరాలను వీరు అక్రమంగా కొనుగోలు చేశారు. ఈ గ్రామాలు ఏజెన్సీలో విలీనం అయితే తాము భూములను కోల్పోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో అడ్డుకుంటున్నారు. గిరిజన గ్రామాలను ఏజెన్సీలో విలీనం చేయడానికి కూటమి ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంటు ఆమోదం కోసం కేంద్రానికి పంపాలి.