Share News

పేదల సొంతింటి కల సాకారం!

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:44 AM

జిల్లాలో పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో అసంపూర్తిగా నిలిచిన పేదల గృహ నిర్మాణాలకు అదనపు సాయం అందించి పూర్తి చేయాలని నిర్ణయించింది.

పేదల సొంతింటి కల సాకారం!

ప్రభుత్వ అదనపు సాయంతో గృహ నిర్మాణాలు వేగవంతం

తొలి దశలో 5,797 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం

కూటమి ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారులు ఆనందం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో అసంపూర్తిగా నిలిచిన పేదల గృహ నిర్మాణాలకు అదనపు సాయం అందించి పూర్తి చేయాలని నిర్ణయించింది. వైసీపీ అధికారంలో వున్నప్పుడు పేదలకు ఇళ్ల నిర్మాణాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఇచ్చిన రూ.1.8 లక్షలు మినహా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక్క రూపాయి కూడా లబ్దిదారులకు అందించలేదు. పైగా సిమెంట్‌, ఇటుకలు, ఇసుక, ఇతరత్రా నిర్మాణ సామాగ్రి సరఫరా పేరుతో వైసీపీ నాయకులే బినామీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి లబ్ధిదారుల సొమ్మును స్వాహా చేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లాలో 704 లేఅవుట్‌లకుగాను సగం లేఅవుట్‌లలోఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణాలు పడకేశాయి. ఫలితంగా పేదల సొంతింటి కల నెరవేరలేదు. దీనిని గుర్తించిన కూటమి ప్రభుత్వం అసంపూర్తిగా వున్న ఇళ్ల నిర్మాణ పనులను దశల వారీగా పూర్తి చేసుకొనేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం అదనంగా ఆర్థిక సాయం ప్రకటించింది. దీంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు.

జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో సుమారు 2,464 ఎకరాల్లో 704 లేఅవుట్‌లు వేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని 65,800 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. అయితే కొన్ని గ్రామాల్లో కొండలు, గుట్టలు వున్నచోట లేఅవుట్లు వేయడంతో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. ఐదేళ్లలో వివిధ కారణాల వల్ల 12 వేల గృహ నిర్మాణాలు మాత్రమే పూర్తి చేశారు. మిగిలినవి వివిధ దశల్లో నిలిచిపోయాయి. గత ప్రభుత్వం అదనంగా ఎటువంటి ఆర్థిక సాయం చేయకపోవడంతో పలువురు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను మధ్యలోనే వదిలేశారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసేందుకు సర్వే చేయించింది. 50 శాతానికిపైగా నిర్మాణ పనులు పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనపు సాయం ప్రకటించింది. గతంలో మంజూరైన రూ.1.8 లక్షలతోపాటు ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీలకు రూ.50 వేల చొప్పన సాయం అందజేసింది. జిల్లాలో తొలి విడత 4,524 మంది బీసీ, 1,021 ఎస్సీ, 252 మంది ఎస్టీ లబ్ధిదారులు.. మొత్తం 5,797 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకొనేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ఏడాది మార్చిలో రూ.6.5 కోట్లు విడుదల చేస్తూ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనకాపల్లి నియోజకవర్గంలో 600 మంది, చోడవరంలో 753 మంది, మాడుగులలో 789 మంది, నర్సీపట్నంలో 1,062 మంది, పాయకరావుపేటలో 1,384 మంది, పెందుర్తిలో 476 మంది, ఎలమంచిలిలో 733 మందికి అదనపు సాయం మంజూరవడంతో ఇళ్ల నిర్మాణ పనులను పునరుద్ధరించారు. ఇళ్ల నిర్మాణాల పూర్తికి కూటమి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుండడంతో ఆయా వర్గాల లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలి దశలో నిధులు మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేయగానే, మిగిలిన వాటిలో మరికొన్ని ఇళ్లకు అదనపు సాయం నిధులు మంజూరు చేసి, ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jul 26 , 2025 | 12:44 AM