Share News

వైద్యుడి వక్రబుద్ధి

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:20 AM

ఆంధ్ర మెడికల్‌ కళాశాల (ఏఎంసీ) పరిధిలోని ఒక బోధనాస్పత్రి ఉన్నతాధికారి వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైద్యుడి వక్రబుద్ధి

  • ఏఎంసీ పరిధిలోని ఓ బోధనాస్పత్రిలో అధికారి వికృత చేష్టలు

  • వైద్యులు, పీజీ విద్యార్థినులు, నర్సింగ్‌ సిబ్బందిని లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపణలు

  • ఆయన వ్యవహారశైలి

  • జుగుప్సాకరమంటున్న సిబ్బంది

విశాఖపట్నం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర మెడికల్‌ కళాశాల (ఏఎంసీ) పరిధిలోని ఒక బోధనాస్పత్రి ఉన్నతాధికారి వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఆస్పత్రిలో పనిచేసే మహిళా వైద్యులు, పీజీ విద్యార్థినులు, నర్సింగ్‌ సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఈ తరహా ఆరోపణలు చాలాకాలంగా ఉన్నప్పటికీ ఆయనపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బాధితులు పలువురు విజయవాడలోని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ (డీఎంఈ) కార్యాలయానికి ఫిర్యాదు చేసినా అవి బుట్టదాఖలు అవుతున్నాయి. వారం క్రితం కూడా ఈ వైద్యాధికారి ఆస్పత్రిలో ఓపీ విభాగం నుంచి సూపరింటెండెంట్‌ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఓ వైద్య విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించబోయారు. ఈ ఆకస్మిక పరిణామానికి భయపడిన ఆమె పెద్దగా కేకలు వేశారు. ఓపీలో ఉన్నవారంతా పరుగెత్తుకు వచ్చారు. ‘ఏమీ లేదు...అంతా వెళ్లిపోండి’ అంటూ ఆయన వారిని వెనక్కి పంపేశారు. ఈ ఘటనపై కొందరు సీఎం కార్యాలయానికి, డీఎంఈకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై రహస్య విచారణ జరుగుతున్నట్టు సమాచారం.

తొలి నుంచి అదే తీరు..

ఇంకా ఆరేడేళ్లు సర్వీస్‌ ఉన్న ఈ సీనియర్‌ వైద్యుడు మెడిసిన్‌ చదువుతున్నప్పటి నుంచే ఇలాంటి వ్యవహారాలు ఎక్కువ నడిపేవాడనిసహాధ్యాయులు చెబుతున్నారు. అమ్మాయిలను దక్కించుకునేందుకు తొలుత అధికారాన్ని ఉపయోగిస్తాడని, అప్పటికీ దారిలోకి రాకపోతే డబ్బు ఆశ చూపిస్తాడని తెలిసింది. తాను విధులు నిర్వర్తిస్తున్న కార్యాలయంలోనే అనేకసార్లు అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడ్డారని సిబ్బంది చెబుతున్నారు. ఆయన వద్దకు మహిళా రోగులు వస్తే...పరీక్ష పేరుతో శరీరంపై ఇష్టానుసారం చేతులు వేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి.

బంధువులు పెద్ద స్థానంలో ఉన్నారని ధీమా

పోలీస్‌ శాఖలో, ఏసీబీలో ఆయన బంధువులు ఉన్నారు. దాంతో తనపై ఎవరు ఫిర్యాదు చేసినా ఏమీ కాదనే ధైర్యంతోనే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ప్రచారం ఉంది. తన వాంఛలు తీర్చుకునేందుకు ఎవరూ లభించనప్పుడు బయట కాల్‌గర్ల్స్‌ని కూడా బుక్‌ చేసుకుంటారని, వారిని నగరంలోని స్టార్‌ హోటళ్లకు తీసుకువెళతారని తెలిసింది. తాజాగా వారం క్రితం ఓ స్టార్‌ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసుకొని ఓ మహిళను తీసుకువెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కీచక వైద్యాధికారిపై విచారణ చేసి, తగిన చర్యలు చేపట్టాలని వైద్య విద్యార్థినులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 01 , 2025 | 01:20 AM