పీ4 గ్రామసభల నిర్వహణలో జిల్లాకు 11వ స్థానం
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:31 PM
జిల్లాలో పీ4లో భాగంగా ఎంపిక చేసిన బంగారు కుటుంబాల స్థితిగతులపై పునఃపరిశీలన గ్రామసభల నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 11వ స్థానం లభించింది. పీ4లో భాగంగా జిల్లాలోని 22 మండలాల్లోని కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై గ్రామ సచివాలయాల వారీగా సర్వే నిర్వహించారు.
నేటితో పునఃపరిశీలన గడువు ముగింపు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పీ4లో భాగంగా ఎంపిక చేసిన బంగారు కుటుంబాల స్థితిగతులపై పునఃపరిశీలన గ్రామసభల నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 11వ స్థానం లభించింది. పీ4లో భాగంగా జిల్లాలోని 22 మండలాల్లోని కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై గ్రామ సచివాలయాల వారీగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 92 వేల పేద(బంగారు)కుటుంబాలను గుర్తించారు. అలాగే ఆయా జాబితాలను గ్రామ సచివాలయాల వారీగా గత నెలలోనే ప్రదర్శించారు. కాగా పీ4 అమల్లో భాగంగా పేద కుటుంబాల ఎంపికను మరింత పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గానూ ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పంచాయతీల వారీగా గ్రామసభలను నిర్వహించి, ఎంపిక చేసిన పేద కుటుంబాల వివరాలను పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో పంచాయతీల్లో గ్రామసభలను ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలోనే పేద కుటుంబాల వివరాలను ప్రకటించి, పక్కాగా నిర్ధారించడం వంటివి చేస్తున్నారు. అయితే ఆయా గ్రామసభల నిర్వహణకు శుక్రవారంతో గుడువు ముగుస్తుంది. గ్రామసభల నిర్వహణలో గురువారం నాటికి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అల్లూరి జిల్లా 11వ స్థానంలో ఉంది. వరుసగా మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నంద్యాల, అన్నమయ్య, అనంతపురం ఉండగా, అల్లూరి జిల్లా 11వ స్థానంలో ఉంది. శుక్రవారం సాయంత్రానికి లక్ష్యం మేరకు గ్రామసభలను నిర్వహించి జిల్లాను ఐదో స్థానంలోకి తీసుకువస్తామని అధికారులు అంటున్నారు.