Share News

కబళించిన కెరటం

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:29 AM

నగరంలోని రామకృష్ణా బీచ్‌ సందర్శనకు వచ్చిన వారిలో ఒక మహిళ సముద్రంలో మునిగి మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు.

కబళించిన కెరటం

  • ఆర్కే బీచ్‌లో మహిళ మృతి

  • మృతురాలి స్వస్థలం సికింద్రాబాద్‌

  • రక్షించేందుకు యత్నించిన యువకుడి గల్లంతు

  • మరొకరిని కాపాడిన లైఫ్‌ గార్డులు

బీచ్‌ రోడ్డు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని రామకృష్ణా బీచ్‌ సందర్శనకు వచ్చిన వారిలో ఒక మహిళ సముద్రంలో మునిగి మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. ఇంకొకరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని విమలాదేవి నగర్‌లో గల మైత్రీ నివాస్‌లో నివాసముంటున్న టి.కోటేశ్వరరావు భార్య వసంత (58), బంధువు సాయికృష్ణ (35) తదితరులతో కలిసి సింహాచలంలో ఓ పెళ్లికి వచ్చారు. అక్కడి నుంచి గురువారం సాయంత్రం ఆర్‌కే బీచ్‌కు వెళ్లారు. ప్రమాదకరమని తెలియక స్నానం చేసేందుకు సముద్రంలో దిగారు. అలలు ఉధృతంగా రావడంతో వసంత, సాయికృష్ణ లోపలకు కొట్టుకుపోయారు. కళ్లెదుటే మునిగిపోతున్న వారిని రక్షించేందుకు అక్కడే ఉన్న ఒడిశాకు చెందిన గోవింద్‌ (26) యత్నించి, అతడు గల్లంతయ్యాడు. మరోవైపు లైఫ్‌గార్డులు కూడా బాధితులను కాపాడేందుకు సముద్రంలోకి దిగారు. మునిగిపోతున్న సాయికృష్ణను రక్షించి క్షేమంగా తీరానికి చేర్చారు. అయితే అప్పటికే కోటేశ్వరరావు భార్య వసంత మృతిచెందింది. గల్లంతైన గోవింద్‌ పెందుర్తిలోని ఓ రొయ్యల కంపెనీలో పనిచేస్తున్నట్టు మూడో పట్టణ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

హెల్త్‌ స్కీమ్‌ వర్తించినా అదనంగా వసూలు చేస్తున్న వైనం

పట్టించుకోని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు

సాధారణ, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతున్న ఆస్పత్రుల ఖర్చులు

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) :

నగర పరిధిలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్‌ అయ్యేంత వరకు అవసరం ఉన్నా లేకపోయినా అనేక పరీక్షలు చేయిస్తూ రోగుల వద్ద వీలైనంత లాగేస్తున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లావాసి (45) ఒకరు అనారోగ్యంపాలై ప్రముఖ ఆస్పత్రికి వెళ్లారు. శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. రూపాయి ఖర్చు కాదని, హెల్త్‌ స్కీమ్‌లో ఉచితంగా చేస్తామన్నారు. దాంతో ఆయన శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. ముందురోజు వచ్చి ఆస్పత్రిలో చేరారు. కొన్ని గంటల ముందు పరీక్షలు నిర్వహించాల్సి ఉందంటూ రూ.15 వేలు కట్టించుకున్నారు. ఆ తరువాత శస్త్ర చికిత్సకు స్కీమ్‌లో ఇచ్చే పరికరాలు నాణ్యత ఉండవని, కొంత అదనంగా చెల్లిస్తే మన్నికైన ఇంప్లాంట్స్‌ వినియోగిస్తామని సిబ్బంది చెప్పారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రూ.30 వేల వరకు చెల్లించుకున్నారు. అలాగే జ్వరం, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో చేరిన వ్యక్తిని మరో ఆస్పత్రి యాజమాన్యం అబ్జర్వేషన్‌ పేరిట రెండు రోజులు ఉంచి రూ.45 వేల వరకూ కట్టించుకుంది. పరీక్షల కోసం మరో రూ.10 వేలు లాగేశారు. ఇలా, నగర పరిధిలోని అనేక ఆస్పత్రుల్లో పెద్దఎత్తున దోపీడీ జరుగుతున్నా ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

వసూళ్లే లక్ష్యం..

నగర పరిధిలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు వసూళ్లే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ ఆస్పత్రులకు రోగులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక టీమ్‌లను నియమించుకుంటున్నాయి. ఇందుకోసం ఆర్‌ఎంపీ, పీఎంపీలకు భారీగా కమీషన్లు ముట్టజెబుతున్నాయి. కొన్ని ఆస్పత్రులైతే రోగులు చెల్లించే మొత్తంలో కొంత పర్సంటేజీ ఇస్తున్నాయి.

Updated Date - Aug 15 , 2025 | 01:29 AM