Share News

సీల్డ్‌ కవర్‌లో డిప్యూటీ మేయర్‌ పేరు!

ABN , Publish Date - May 17 , 2025 | 12:41 AM

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి ఎంపికకు సంబంధించి సీల్డ్‌ కవర్‌ సంస్కృతిని అమలు చేయనున్నారు.

సీల్డ్‌ కవర్‌లో డిప్యూటీ మేయర్‌ పేరు!

  • అభ్యర్థి ఖరారు బాధ్యత చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లదే..

  • నలుగురి పేర్లను ప్రతిపాదించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి):

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌ అభ్యర్థి ఎంపికకు సంబంధించి సీల్డ్‌ కవర్‌ సంస్కృతిని అమలు చేయనున్నారు. డిప్యూటీ మేయర్‌ పోస్టు కోసం టీడీపీ, జనసేన మధ్య గట్టిపోటీ నెలకొనడంతో రెండు పార్టీల అధినేతల సూచన మేరకు అభ్యర్థి పేరును సీల్డ్‌ కవర్‌లో విశాఖకు పంపనున్నారు. డిప్యూటీ మేయర్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్నది విశాఖలోనే తేల్చుకోవాలని ఎమ్మెల్యేలకు, మేయర్‌కు మూడు రోజుల క్రితమే సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ జనసేన పార్టీ గట్టిగా పట్టుబట్టడంతో ఎంపిక అనేది తేలికగా అయ్యే పని కాదని టీడీపీ నేతలకు అర్థమైంది. డీసీసీబీ చైర్మన్‌ పదవిని జనసేనకు చెందిన కోన తాతారావుకు కేటాయించడంతో డిప్యూటీ మేయర్‌-1 పదవిని టీడీపీ తీసుకోవాలని ఎమ్మెల్యేలు యోచిస్తున్నారు. అవసరమైతే డిప్యూటీ మేయర్‌-2 పోస్టును జనసేనకు కేటాయించేలా ఆ పార్టీ నేతలను ఒప్పించాలని భావిస్తున్నారు. ఇదే విషయం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ల దృష్టికి తీసుకువెళ్లి వారి ఆమోదంతో టీడీపీ నుంచి ఒక పేరును ఎంపిక చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి గొలగాని మంగవేణి, మొల్లి హేమలత, గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు (గాజువాక ఎమ్మెల్యే కాదు) పేర్లతో కూడిన జాబితాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మేయర్‌ పీఠం నుంచి గొలగాని హరి వెంకటకుమారిపై అవిశ్వాసం పెట్టి ఆమె స్థానంలో పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. అందువల్ల డిప్యూటీ మేయర్‌ పోస్టును యాదవ సామాజిక వర్గానికి మహిళనే ఎంపిక చేయాలని పలువురు పట్టుబడుతున్నా... నగరంలో మరో బలమైన సామాజిక వర్గమైన కాపుల నుంచి ఒకరికి ఇచ్చి తీరాలనే వాదన బలంగా ఉంది. కాగా ఈ నెల 19న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనున్నది. ఈ క్రమంలో 18వ తేదీన ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన కార్పొరేటర్లు నగరంలో భేటీ కానున్నారు. ఎన్నిక సమయం కంటే ముందుగానే అధిష్టానం నుంచి సీల్డ్‌ కవర్‌ రావడం ఖాయమని కీలక నేత ఒకరు స్పష్టం చేశారు.

Updated Date - May 17 , 2025 | 12:41 AM