Share News

చెత్త కాంట్రాక్టర్ల మాయ!

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:39 AM

నగరంలో చెత్త తరలింపు పర్యావరణహితంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా జరిగేందుకు జీవీఎంసీ చేపట్టిన క్లోజ్డ్‌ కాంపాక్టర్‌ సిస్టమ్‌ (సీసీఎస్‌) ప్రాజెక్టులో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.

చెత్త కాంట్రాక్టర్ల మాయ!

పర్యావరణహితం కోసం ఓపెన్‌ టిప్పర్‌లలో తరలించడాన్ని నిలిపివేసిన జీవీఎంసీ

సీసీఎస్‌ ప్రాజెక్టుకు రూపకల్పన...హుక్‌లోడర్‌లలో తరలించేందుకు టెండర్లు

కానీ నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట ఓపెన్‌ టిప్పర్‌లలోనే తరలింపు

నిర ్వహణ ఖర్చులు తగ్గించుకునేందుకు కాంట్రాక్టర్ల ఎత్తులు

చోద్యం చూస్తున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో చెత్త తరలింపు పర్యావరణహితంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా జరిగేందుకు జీవీఎంసీ చేపట్టిన క్లోజ్డ్‌ కాంపాక్టర్‌ సిస్టమ్‌ (సీసీఎస్‌) ప్రాజెక్టులో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఓపెన్‌ టిప్పర్లలో తరలించడం వల్ల చెత్త గాల్లోకి ఎగిరి వెనుకవచ్చే వాహన చోదకులపై పడుతుండడంతో జీవీఎంసీ సీసీఎస్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు కింద చెత్తను ట్యాంకర్ల మాదిరిగా ఉండే హుక్‌ లోడర్లతో కాపులుప్పాడలోని యార్డుకు తరలించాలి. అయితే కాంట్రాక్టర్లు ఖర్చును తగ్గించుకునేందుకు రాత్రి వేళ ఓపెన్‌ టిప్పర్లతో తరలించేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.

జీవీఎంసీ పరిధిలో ప్రతిరోజూ 1,100 టన్నుల చెత్త వస్తోంది. క్లాప్‌ వాహనాలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి సంబంధిత జోన్‌లోని ఎంఎస్‌ఎఫ్‌ (చెత్త తరలింపు కేంద్రం)కి తీసుకువెళ్లి అక్కడ సీసీఎస్‌ ప్రాజెక్టు కింద ఏర్పాటుచేసిన హూపర్‌ (గల్లా పెట్టె)లో వేయాలి. హూపర్‌లో పడిన చెత్తను ప్రత్యేక యంత్రం ప్రెస్‌ చేసి కేకు మాదిరిగా చేస్తుంది. అలా కేకు మాదిరిగా చేసిన చెత్తను ట్యాంకర్‌ వంటి హుక్‌ లోడర్‌లోకి లోడ్‌ చేస్తారు. ఇలా ఒకేసారి 12 టన్నుల చెత్తను ఒక ట్రిప్పులో హుక్‌ లోడర్‌ డంపింగ్‌ యార్డుకు తీసుకువెళ్లిపోతుంది. దీనివల్ల గాలికి ఎగిరి రోడ్లపై పడడం, వెనుకవచ్చే వాహన చోదకులకు ఇబ్బంది కలగడం వంటి సమస్యలు ఉండవు. ఇలాంటి ప్రాజెక్టును భీమిలి, ముడసర్లోవ, టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక, చీమలాపల్లిలో జీవీఎంసీ ఏర్పాటుచేసింది. ఒక్కోచోట సీసీఎస్‌ ప్రాజెక్టు నిర్వహణ కోసం యంత్రాలను బిగించి, రెండు నుంచి ఆరు వరకు హుక్‌ లోడర్‌లు (ట్యాంకర్‌ లారీలు) సమకూర్చింది. ఎంఎస్‌ఎఫ్‌ వద్ద ఏర్పాటుచేసిన సీసీఎస్‌ ప్రాజెక్టుతోపాటు హుక్‌ లోడర్ల నిర్వహణను టెండరు ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించింది.

ఓపెన్‌ టిప్పర్లతో చెత్త తరలింపు

ఎంఎస్‌ఎఫ్‌ల నుంచి హుక్‌ లోడర్ల ద్వారా చెత్తను కాపులుప్పాడలోని యార్డుకు తరలించాల్సిన కాంట్రాక్టర్లు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. హుక్‌లోడర్లు మరమ్మతులకు గురైనా వాటికి రిపేర్లు చేయించడం లేదు. అయితే హుక్‌లోడర్లు తిరగకపోతే ఎంఎస్‌ఎఫ్‌లో చెత్తకుప్పలు పేరుకుపోతాయి కాబట్టి తమదైన వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. క్లాప్‌ వాహనాల్లో వచ్చే చెత్తను హూపర్‌ (గల్లా)లో కాకుండా నేలపైనే అన్‌లోడ్‌ చేయించేస్తున్నారు. ఓపెన్‌ టిప్పర్లను అద్దెకు తెచ్చి రాత్రివేళ కాపులుప్పాడ యార్డుకు తరలించేస్తున్నారు. టౌన్‌కొత్తరోడ్డులోని ఎంఎస్‌ఎఫ్‌ను తీసుకుంటే అక్కడ సీసీఎస్‌ ప్రాజెక్టు కింద రెండు హూపర్‌లు (గల్లాపెట్టెలు), యంత్రాలు ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ సుమారు 300 టన్నుల చెత్తను తరలించేందుకు ఆరు హుక్‌ లోడర్లు (టిప్పర్లను) అందుబాటులో ఉంచారు. సీసీఎస్‌ప్రాజెక్టుతోపాటు హుక్‌ లోడర్ల నిర్వహణ కాంట్రాక్టును టెండర్‌ ద్వారా రూ.2.2 కోట్లకు ఒకరికి అప్పగించారు. అయితే ఆ కాంట్రాక్టర్‌ పట్టించుకోకపోవడంతో సీసీఎస్‌ ప్రాజెక్టులోని ఒక యంత్రం పనిచేయడం లేదు. అలాగే రెండు హుక్‌లోడర్లు మూలనపడి ఉన్నాయి. అయినప్పటికీ కాంట్రాక్టర్‌ మాత్రం రెండు గల్లాపెట్టెలు, ఆరు హుక్‌లోడర్లు పనిచేస్తున్నట్టు చూపించి జీవీఎంసీ నుంచి డీజిల్‌ డ్రా చేసుకుంటున్నారు. మరోవైపు ఎంఎస్‌ఎఫ్‌కు చేరిన చెత్తను రాత్రి వేళ ఓపెన్‌ టిప్పర్లలో కాపులుప్పాడ తరలిస్తున్నారు. ఇటీవల జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆ ప్రాజెక్టును పరిశీలించి కాంట్రాక్టర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు కాంట్రాక్టర్‌ను తొలగించాలని నోటీస్‌ జారీచేశారు. కానీ అదే కాంట్రాక్టర్‌ అక్కడ పనిచేస్తుండడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళ ఓపెన్‌ టిప్పర్లతో చెత్తను యార్డుకు తరలిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో మరి.

Updated Date - Oct 01 , 2025 | 12:39 AM