Share News

బధిరులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:33 PM

బధిరులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో అవకాశం ఉందని, అందుకు మరింత కృషి జరగాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ అన్నారు.

బధిరులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలి
బధిరుల సైన్‌ లాంగ్వేజ్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ. అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, తదితరులు

ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ

పాడేరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): బధిరులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో అవకాశం ఉందని, అందుకు మరింత కృషి జరగాలని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ అన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ బుధవారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వినికిడి లోపం కలిగిన వారిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడం ఎంతైనా అవసరమన్నారు. వారికి ప్రత్యేక సైన్‌ లాంగ్వేజ్‌ ఉంటుందన్నారు. వాళ్లు ఉపయోగించే సైన్‌ లాంగ్వేజ్‌ సైతం ఒక నాట్యం వంటిదేనని, పూర్వం భరతనాట్యంలో ఎటువంటి మాటలు లేకుండా కేవలం ముఖ కవళికలు, చేతులతో చేసే సంజ్ఞల ద్వారా మాత్రమే భావాలను పలికించేవారన్నారు. మహాభారతం, రామాయణం వంటి కథాంశాలను సైతం కేవలం సంజ్ఞల ద్వారా తెలిపేవారన్నారు. వినికిడి లోపం ఉన్న సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్‌ అభినయ సినీ రంగంలో ఎంతగానో రాణిస్తున్నారని ఉదాహరణగా పేర్కొన్నారు. అలాగే అనేక కార్పొరేట్‌ వ్యాపార సంస్థల్లో సైతం బధిరులు ఉద్యోగాలు చేస్తూ రాణిస్తున్నారని, అలాగే ఇతర అనేక కార్యకలాపాల్లో సైతం వారి పాత్ర ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, దివ్యాంగుల శాఖ ఏడీ కవిత, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ డప్పోడి వెంకటరమణ, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, సర్పంచ్‌ లకే పార్వతమ్మ, రెడ్‌క్రాస్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎస్‌.గంగరాజు, సభ్యురాలు వి.జయ, అధిక సంఖ్యలో బధిరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:33 PM