Share News

బల్క్‌డ్రగ్‌ ఉద్యమానికి తెర

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:50 AM

బల్క్‌డ్రగ్‌ పార్కు వద్దంటూ మండలంలోని రాజయ్యపేట కేంద్రంగా రెండు నెలలకుపైగా నిర్వహించిన ఉద్యమానికి, ధర్నా శిబిరానికి మత్స్యకారులు తెరదించారు. శనివారం జిల్లా పర్యటకు వచ్చిన సీఎం చంద్రబాబునాయుడును కలిసిన అనంతరం మత్స్యకార నేతలు హోం మంత్రి అనితతో సమావేశం అయ్యారు.

బల్క్‌డ్రగ్‌ ఉద్యమానికి తెర
రాజయ్యపేటలో శిబిరం టెంట్‌ను తొలగిస్తున్న మత్స్యకారులు

సీఎం, హోం మంత్రి హామీతో సంతృప్తి చెందిన మత్స్యకారులు

రాజయ్యపేటలో ధర్నా శిబిరం ఎత్తివేత

నక్కపల్లి, డిసెంబరు 21: బల్క్‌డ్రగ్‌ పార్కు వద్దంటూ మండలంలోని రాజయ్యపేట కేంద్రంగా రెండు నెలలకుపైగా నిర్వహించిన ఉద్యమానికి, ధర్నా శిబిరానికి మత్స్యకారులు తెరదించారు. శనివారం జిల్లా పర్యటకు వచ్చిన సీఎం చంద్రబాబునాయుడును కలిసిన అనంతరం మత్స్యకార నేతలు హోం మంత్రి అనితతో సమావేశం అయ్యారు. దీంతో ఆదివారం రాజయ్యపేటలో మత్స్యకారులు, స్థానికులతో సమావేశం నిర్వహించారు. సీఎం, హోం మంత్రి ఇచ్చిన హామీలను వారికి తెలియజేశారు. అందరూ ఆమోదం తెలపడంతో బల్క్‌డ్రగ్‌ పార్కుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు.

బల్‌డ్రగ్‌ పార్కు వద్దంటూ మండలంలోని రాజయ్యపేట కేంద్రంగా సెప్టెంబరు రెండో వారం నుంచి మత్స్యకారులు శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆందోళన చేస్తున్నారు. సుమారు నెల రోజులు అవుతున్నా.. అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అక్టోబరు 12వ తేదీన రాజయ్యపేట శిబిరం నుంచి నక్కపల్లి వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. పోలీసు అధికారులు వచ్చి నచ్చజెప్పినా ససేమిరా అన్నారు. బల్క్‌డ్రగ్‌ పార్కు అనుమతులను రద్దు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. త్వరలో రాజయ్యపేట వచ్చి మత్స్యకారులందరితో సమావేశమై మాట్లాడతామని చెప్పడంతోఓ మత్స్యకారులు ఆందోళన విరమించారు. మరుసటి రోజు నుంచి రాజయ్యపేటలో భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు. హోం మంత్రి అనిత సూచనల మేరకు గత నెల చివరిలో ధర్నాను తాత్కాలికంగా విరమించారు. శనివారం తాళ్లపాలెంలో సీఎం చంద్రబాబును రాజయ్యపేట మత్స్యకారులు కలిశారు. బల్క్‌డ్రగ్‌ పార్కు రాజయ్యపేటలో ఏర్పాటు కాదని స్పష్టం చేశారు. అనంతరం శనివారం రాత్రి హోం మంత్రి అనిత, తన క్యాంపు కార్యాలయం వద్ద మత్స్యకారులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. మీ డిమాండ్లలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు.

రాజయ్యపేటలో ఆదివారం మత్స్యకార నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనితతో మాట్లాడిన విషయాలు, వారు ఇచ్చిన హామీలను సహచర మత్స్యకారులకు వివరించారు. దీంతో సంతృప్తి చెందిన మత్స్యకారులు.. ఆందోళనను విరమించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో.. ధర్నా టెంట్‌ను తీసివేయాలని వారుసూచించారు. అయితే కొంతమంది మత్స్యకార యువకులు ఒకరోజు సమయం కావాలని, కలెక్టర్‌ను కలిసిన తరువాత ఆలోచిద్దామని అన్నారు. అయితే పెద్దలు జోక్యం చేసుకుని రాజయ్యపేటలో బల్క్‌డ్రగ్‌ పార్కు వుండదని చెప్పిన తరువాత శిబిరాన్ని వుంచడం ఎందుకని ప్రశ్నించారు. అనంతరం మత్స్యకారులంతా స్వచ్ఛందంగా ధర్నా శిబిరం టెంట్‌ను తొలగించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు, పాయకరావుపేట, నక్కపల్లి సర్కిళ్ల పరిధిలో గల సీఐలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 12:50 AM