జనం గజగజ
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:27 PM
మన్యంలో పొగమంచు దట్టంగా కురుస్తున్నది. దీంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు.
కమ్మేసిన మంచు
తగ్గని చలితీవ్రత
జి.మాడుగులలో 4.7 డిగ్రీలు
పాడేరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మన్యంలో పొగమంచు దట్టంగా కురుస్తున్నది. దీంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. మంచు కారణంగా ఎదురుగా ఉన్నవి సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం పాడేరుతో సహా అనేక ప్రాంతాల్లో పది గంటల వరకు దట్టంగానే పొగమంచు కమ్మేసింది. వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించగా.. జనం చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
జి.మాడుగులలో 4.7 డిగ్రీలు
మన్యంలో శనివారం సింగిల్ డిజిట్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. జి.మాడుగులలో 4.7 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ముంచంగిపుట్టులో 5.0, అరకులోయలో 5.8, పాడేరులో 6.7, పెదబయలులో 6.9, చింతపల్లిలో 7.2, హుకుంపేటలో 7.7, డుంబ్రిగుడలో 9.1, కొయ్యూరులో 12.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జి.మాడుగులలో..
మండలంలోని కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి ప్రభావానికి జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్యాలకు ప్రజలు గురవుతున్నారు. తాజాగా శనివారం మండల కేంద్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 4.7 నమోదైంది.
ముంచంగిపుట్టులో
మండలంలో చలి గజగజ వణికిస్తోంది. శనివారం 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటలు దాటినా మంచు తెరలు వీడడం లేదు. ఇళ్లలో ఉండే నీటిలో చెయ్యి పెట్టలేకపోతున్నారు. విధిగా చెవిలోకి చల్ల గాలి వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.