వాడీవేడిగా కౌన్సిల్
ABN , Publish Date - Jun 07 , 2025 | 01:10 AM
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం వాడీవేడిగా జరిగింది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి తొమ్మిది గంటల వరకూ సాగింది.
10 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన సమావేశం
28 అంశాలు ఆమోదం, ఐదు వాయిదా
జీవీఎంసీలో ఘోస్ట్ ఉద్యోగులు ఉంటే వారి సంగతి తేల్చండి: ఎమ్మెల్యే పల్లా
త్వరలోనే కమిషనర్ నియామకం
కమిషనర్‌ను నియమించేలా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలి: ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
శ్రీహరిపురం ఎఫ్‌ఆర్‌యూ లీజు ప్రతిపాదనపై చర్చ
జీవీఎంసీ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టేస్తున్నారని వైసీపీ అభ్యంతరం
స్పోర్ట్స్ ఎరీనా, ఆక్వా స్పోర్ట్స్‌ను కారుచౌకగా ఎలా కట్టబెట్టారంటూ కూటమి ఎదురుదాడి
స్మార్ట్ సిటీ గడువు ముగిసినా కొనసాగించడంపై సభ్యుల అభ్యంతరం
కమిషనర్‌ను నియమించాలంటూ వైసీపీ ప్లకార్డులు ప్రదర్శన
విశాఖపట్నం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం వాడీవేడిగా జరిగింది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి తొమ్మిది గంటల వరకూ సాగింది. ప్రధాన అజెండాలోని 24 అంశాలతోపాటు టేబుల్ అజెండాలోని నాలుగు అంశాలను కౌన్సిల్ ఆమోదించగా, ప్రధాన అజెండాలోని మూడు అంశాలు, టేబుల్ అజెండాలోని రెండు అంశాలను వాయిదా వేసింది.
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారితోపాటు, ఆపరేషన్ సిందూర్‌లో అశువులుబాసిన వీరజవాన్లకు సంతాప తీర్మానాలతో కౌన్సిల్ ప్రారంభమైంది. అనంతరం సమావేశాన్ని ప్రారంభిస్తున్నట్టు మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రకటించగానే ఇన్‌చార్జి కమిషనర్ లేకుండా కౌన్సిల్ సమావేశం జరగడం సరికాదని వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో టీ బ్రేక్ ఇస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. అనంతరం ఇన్‌చార్జి కమిషనర్, కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ కౌన్సిల్ హాలుకు చేరుకోవడంతో సమావేశాన్ని ప్రారంభించారు. మొదట జీరో అవర్ కావాలని వైసీపీ సభ్యులు కోరడంతో గంటసేపు అవకాశం ఇస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌ను నియమించినందుకు కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానన్నారు. ఇదే స్ఫూర్తిగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టవిటీ, నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కోరారు. డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ మాట్లాడుతూ పీలా గోవిందను కౌన్సిల్‌లోకి ఏ హోదాతో అనుమతించారని ప్రశ్నించారు. ఏపీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్‌గా ఉన్న ఆయన్ను ప్రత్యేక ఆహ్వానితుడిగా కౌన్సిల్ సమావేశాలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ వివరణ ఇచ్చారు. జనసేన ఫ్లోర్‌లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి మాట్లాడుతూ గతంలో కేకే రాజు, ఆడారి ఆనంద్ వంటి వారు జీవీఎంసీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేవారని, కూటమి ప్రభుత్వంలో అనధికార వ్యక్తుల జోక్యానికి ఆస్కారం లేదన్నారు. 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్ మాట్లాడుతూ తన వార్డులో ప్రభుత్వ భూమి కబ్జా అయిపోతోందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత మాట్లాడుతూ తన వార్డులోని అనేకప్రాంతాల్లో ఆకతాయిలు, చిల్లర దొంగల బెడద ఎక్కువగా ఉన్నందున లైటింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్‌జైన్ మాట్లాడుతూ పాతజైలురోడ్డులోని ఫుడ్‌కోర్ట్‌ను తొలగిస్తామని ఏడాది కిందట కౌన్సిల్ తీర్మానం చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవీఎంసీలో కూడా కొంతమంది ఘోస్ట్ ఉద్యోగులు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయని, దీనిపై అధికారులు దృష్టిసారించి ఉద్యోగానికి రాకున్నా జీతం తీసుకుంటున్నవారి సంగతి తేల్చాలని సూచించారు. 68వ వార్డు పరిధిలో విశాఖ డెయిరీ వ్యర్థాలను వెనక్కి వదిలేస్తుండడంతో వ్యవసాయ భూములు నాశనం అవుతున్నందున ప్రత్యేకంగా డ్రెయిన్ నిర్మించాలని కోరారు. గాజువాక నుంచి ఎలమంచిలి వరకూ రాష్ట్ర రహదారిని అభివృద్ధి చేయాలని కోరారు. విశాఖ నగర అభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పనిచేస్తున్నారని, త్వరలోనే యువ అధికారిని జీవీఎంసీ కమిషనర్‌గా నియమిస్తారని సభకు తెలిపారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ నాలుగు నెలలుగా కమిషనర్ లేకపోవడం సరికాదని, దీనిపై కార్పొరేటర్లతోపాటు ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దామని ప్రతిపాదించారు. రోడ్లను తవ్వేసి సరిగా పూడ్చడం లేదని ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లు 25 శాతం లెస్‌కు ఎలా టెండర్ వేస్తున్నారని, దీనిలో ఇంజనీరింగ్ అధికారుల పాత్రపై ఆరోపణలు ఉన్నాయన్నారు.
జోన్-8 పరిధిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన డి.వెంకటరావు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అంశంపై 56వ వార్డు కార్పొరేటర్ శరగడం రాజశేఖర్, 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, 94వ వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆస్తి పన్ను విధించినట్టు ఆరోపణలు ఉన్నందున వాటిపై సమగ్ర విచారణ జరిగేంత వరకు అనుమతించవద్దంటూ కోరడంతో ఆ అంశాన్ని వాయిదా వేస్తున్నట్టు మేయర్ ప్రకటించారు. మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ వద్ద స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు నుంచి జీవీఎంసీ నేరుగా విద్యుత్ కొనుగోలు చేసే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. జనసేన, టీడీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గడువు ముగిసిందని, అయినా స్మార్ట్ సిటీని జీవీఎంసీ కొనసాగించాలని యత్నించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. జీవీఎంసీ ఆస్తులను తాకట్టుపెట్టి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతున్నామని, ఆ పనులపై స్మార్ట్‌సిటీ పెత్తనం సాగుతుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏడాదిలో గరిష్ఠంగా రూ.500 కోట్లు విలువైన పనులు జరిగితే స్మార్ట్ సిటీ కింద రూ.వెయ్యి కోట్లు పనులు జరుగుతున్నాయని, ఆ నిధులన్నీ ఒక ప్రైవేటు వ్యక్తి ఆధ్వర్యంలోనే ఖర్చు పెడుతుండడంతో ఏదైనా జరిగితే జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు. తక్షణం స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను జీవీఎంసీ స్వాధీనం చేసుకోవాలని, స్మార్ట్ సిటీకి కొత్తపనులు అప్పగించవద్దని కోరడంతో సోలార్ విద్యుత్ కొనుగోలు అంశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
జోన్‌ల పునర్విభజన అంశంపై కార్పొరేటర్లు కొందరు అభ్యంతరం తెలిపారు. దీనికి ఇన్‌చార్జి కమిషనర్ వివరణ ఇస్తూ పరిపాలన సౌలభ్యం కోసమే నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులు జోన్‌ల పునర్విభజన ప్రతిపాదన చేశారన్నారు. ఈ అంశంపై కార్పొరేటర్లకు అవగాహన కల్పించిన తర్వాత వచ్చే అజెండాలో పెట్టాలని మేయర్ ఆదేశించారు. టేబుల్ అజెండాలోని ముఖ్యమైన అంశాలను చర్చించడానికి సమయం లేకపోవడంతో వచ్చే సమావేశంలో చర్చించాలని మేయర్ ప్రతిపాదించగా, సభ్యులంతా అంగీకరించారు.
ఎంవీవీ, ఎంకే అపార్టుమెంట్‌కు నీటి సరఫరాపై రచ్చ
86వ వార్డు పరిధి కూర్మన్నపాలెంలో నిర్మించిన ఎంవీవీ, ఎంకే అపార్టుమెంట్‌కు నీటి కనెక్షన్ ఇచ్చే అంశంపై కౌన్సిల్‌లో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. దీనిపై 87వ వార్డు కార్పొరేటర్ బొండా జగన్ మాట్లాడుతూ ఎంవీవీ, ఎంకే అపార్టుమెంట్ నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు జరగడంతోపాటు నాలా కింద రూ.పది కోట్లు వరకు బకాయి ఉన్నందున నీటి కనెక్షన్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. దీనికి 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు, సీపీఎం కార్పొరేటర్ బి.గంగారావు, సీపీఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్‌లు జీవీఎంసీ ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇచ్చినందున నీటి సరఫరా చేయాలని, లేనిపక్షంలో అందులో నివాసం ఉండేవారు ఇబ్బందిపడతారని మేయర్‌ను కోరారు. జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావులు మాట్లాడుతూ శ్మశానం, ఏలేరు కాలువ బఫర్ జోన్ కబ్జా చేయడంతోపాటు నాలా చెల్లించలేదని, అయినప్పటికీ ప్లాన్, ఆక్యుపేషన్ సర్టిఫికెట్ జారీచేసిన అధికారులు ఎవరో గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నాలా చార్జీలు కట్టిన తర్వాతే నీటి సరఫరాపై ఆలోచన చేయాలని కోరడంతో ఆ అంశాన్ని వాయిదావేశారు.
కోరమాండల్‌కు శ్రీహరిపురం ఎఫ్‌ఆర్‌యూ
జీవీఎంసీకి చెందిన శ్రీహరిపురం ఎఫ్‌ఆర్‌యూ (ఫస్ట్ రిఫరల్ యూనిట్)ను కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు 30 ఏళ్ల లీజుకు అప్పగించడంతోపాటు నామమాత్రపు యూజర్ చార్జీలు వసూలు చేసుకునేందుకు అనుమతించే అంశంపై కౌన్సిల్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. దీనివల్ల ప్రజలకు ఉచిత వైద్యం దూరమైపోతుందని, జీవీఎంసీ ఆస్తులను ప్రైవేటుకి ధారాదత్తం చేయడం సరికాదని 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్ అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై టీడీపీకి చెందిన 56, 63 వార్డుల కార్పొరేటర్లు శరగడం రాజశేఖర్, గల్లా పోలిపల్లి మాట్లాడుతూ రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్ ఎరీనాతోపాటు రూ.ఏడు కోట్లు వ్యయంతో ఆధునీకరించిన బీచ్‌రోడ్డులోని ఆక్వా స్పోర్ట్ కాంప్లెక్స్‌ను వైసీపీ హయాంలో అస్మదీయులకు ఉదారంగా కట్టబెట్టుకున్నారని, మల్కాపురం ఎఫ్‌ఆర్‌యూను సీఎస్‌ఆర్ కింద ఉచితంగా సేవలందించే సంస్థకు అప్పగిస్తుంటే అభ్యంతరం తెలపడం సరికాదన్నారు. దీనికి ఇన్‌చార్జి కమిషనర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ వివరణ ఇస్తూ ఎఫ్‌ఆర్‌యూ విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రతిపాదన మంచిదని, దీనిని ఆమోదించి, ఏమైనా సేవల్లో లోపాలు ఉంటే కౌన్సిల్‌లో పెట్టి రద్దు చేద్దామని హామీ ఇచ్చారు.
పార్కుల కబ్జాపై కార్పొరేటర్ నిరసన
జీవీఎంసీ 20వ వార్డులోని ఈస్ట్ పాయింట్ కాలనీలో సాయిబాబా సేవ పేరుతో రెండు పార్కులను కొందరు కబ్జా చేశారని, వారిని ఖాళీ చేయించి వాటిని స్థానిక కాలనీ అసోసియేషన్‌కు అప్పగించాలని స్థానిక కార్పొరేటర్ మువ్వల లక్ష్మి డిమాండ్ చేశారు. పార్కుల కబ్జాపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాన్ని ఆమె కౌన్సిల్ సమావేశంలో ప్రదర్శించారు. గతంలో ఇలాగే కబ్జా చేశారని, దానిపై ఫిర్యాదులు చేస్తే జీవీఎంసీ చర్యలు తీసుకుందని, ఇప్పుడు కొందరు నాయకుల సాయంతో మళ్లీ కబ్జా చేశారని, వారిని ఖాళీ చేయించాలని ఆమె కుర్చీ ఎక్కి మరీ డిమాండ్ చేశారు.