రోజుకొక మలుపు తిరుగుతున్న కాపర్ ప్లేట్ల చోరీ కేసు
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:05 AM
స్టీల్ ప్లాంటులో కాపర్ ప్లేట్ల చోరీ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ప్లాంట్ బీఎఫ్ విభాగంలో ఈ ఏడాది జూన్ నెలలో తొలగించిన 45 స్ర్కాప్ కాపర్ ప్లేట్లను స్టోర్సులో భద్రపరచగా, ఆరు ప్లేట్లు మాయమైనట్టు అధికారులు గుర్తించారు. దీనిపై గతనెల 28న ఉక్కు అధికారులు స్టీల్ ప్లాంట్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
4 కాపర్ ప్లేట్లను కరిగించి 41 దిమ్మలుగా మార్చిన వైనం
చోరీ సొత్తు స్వాధీనం, ముగ్గురి అరెస్టు
మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాం: స్టీల్ ప్లాంట్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావు
ఉక్కుటౌన్‌షిప్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): స్టీల్ ప్లాంటులో కాపర్ ప్లేట్ల చోరీ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ప్లాంట్ బీఎఫ్ విభాగంలో ఈ ఏడాది జూన్ నెలలో తొలగించిన 45 స్ర్కాప్ కాపర్ ప్లేట్లను స్టోర్సులో భద్రపరచగా, ఆరు ప్లేట్లు మాయమైనట్టు అధికారులు గుర్తించారు. దీనిపై గతనెల 28న ఉక్కు అధికారులు స్టీల్ ప్లాంట్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుండగా ఈ నెల 2న మాయమైన 6 ప్లేట్లకు గాను రెండు ప్లాంటులోని ఆర్‌ఎంహెచ్‌పీ విభాగం వద్ద గల పొదల్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మిగతా నాలుగు ప్లేట్ల కోసం దర్యాప్తు చేపట్టగా... వీటిని ప్లాంట్ బయట గల ఓ స్ర్కాప్ దుకాణం వద్ద కరిగించి 50 కిలోల చొప్పున 41 చిన్నపాటి దిమ్మలుగా మార్చినట్టు గుర్తించారు. దీంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నామని, ఇప్పటికే గాజువాక ప్రాంతానికి చెందిన రాజా, రామస్వామి, ప్రకాశ్‌లను అరెస్టు చేశామని క్రైమ్ సీఐ కె.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఒక్కో కాపర్ ప్లేటు సుమారు టన్నున్నర బరువు ఉంటుందని, అలాంటిది నాలుగు ప్లేట్లను కట్టుదిట్టమైన భద్రత గల ప్లాంట్ నుంచి ఎలా బయటకు తెచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంత బరువు గల ప్లేట్లను స్టోర్సు నుంచి బయటకు తీసేందుకు ఓ హైడ్రా మిషన్, వీటిని తరలించాలంటే ఓ లారీ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఈ చోరీలో ఎవరి పాత్ర ఎంతనేది పోలీసుల విచారణలో తేలనున్నది. కాగా ఎఫ్‌ఎండీ విభాగంలోని ఓ నాయకుడు దీని వెనక ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.