Share News

అడ్డగోలుగా రాక్రీట్‌ వ్యవహారం

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:48 AM

గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ‘రాక్రీట్‌’ కంపెనీ మొదటి నుంచి అడ్డగోలుగా వ్యవహరించింది.

అడ్డగోలుగా రాక్రీట్‌ వ్యవహారం

పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు

మెటీరియల్‌ పక్కదారి

వైసీపీ ప్రభుత్వంలో అధికారులకు లెక్కచేయని వైనం

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిపివేత

అసంపూర్తిగా నిర్మాణాలు

పూర్తిస్థాయి విచారణకు హౌసింగ్‌ సిద్ధం

విశాఖపట్నం/ఉక్కుటౌన్‌షిప్‌/సబ్బవరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి):

గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ‘రాక్రీట్‌’ కంపెనీ మొదటి నుంచి అడ్డగోలుగా వ్యవహరించింది. పాలకుల దన్ను ఉండడంతో అధికారులను అసలు పట్టించుకునేది కాదు. నిర్మాణంలో నాణ్యతను గాలికొదిలేసిన ఈ సంస్థ, తనకు కేటాయించిన నాలుగు లేఅవుట్‌లలో ఒక్క ఇల్లు మాత్రమే పూర్తిచేసింది. అది కూడా మోడల్‌ ఇల్లు. 2022 మే నెలలో అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపనకు వస్తున్నారని సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో దానిని నిర్మించింది.

రాక్రీట్‌ సంస్థ రూ.80 కోట్ల అవినీతికి పాల్పడినట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించిన నేపథ్యంలో జిల్లాలో ఆ సంస్థ చేపట్టిన పనులపై విచారణ జరపాలని హౌసింగ్‌ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నగరంలో పేదల కోసం పైడివాడ అగ్రహారం, గంగవరం, నంగినారపాడు, నడుపూరుల్లో సుమారు 12 వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతను వైసీపీ ప్రభుత్వం రాక్రీట్‌కు అప్పగించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు ప్రభుత్వం మంజూరుచేసింది. అయితే సిమెంట్‌, ఇనుము, ఇసుక ప్రభుత్వమే సరఫరా చేసింది. మొత్తం యూనిట్‌ ఖరీదు రూ.1.8 లక్షల్లో మెటీరియల్‌ కాస్ట్‌ మినహా మిగిలిన మొత్తం నిర్మాణ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించింది.

కానీ, రాక్రీట్‌ సంస్థ నాలుగు లేఅవుట్‌లలో మొదటి నుంచి అనుకున్న విధంగా పనులు చేయలేకపోయింది. కేటాయించిన మెటీరియల్‌ వినియోగంపై పక్కాగా రికార్డులు నిర్వహించలేదు. కొన్నిచోట్ల మెటీరియల్‌ను సంస్థ ఉద్యోగులు కొందరు విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. పైడివాడ అగ్రహారం, గంగవరంలో స్థానికంగా ఉండే కొందరు చోటా నేతలు ఇనుము, ఇసుక పట్టుకుపోయారు. నిర్మాణాల్లో కూడా నాణ్యత ఉండేది కాదు. ఈ విషయమై అప్పట్లో కొందరు అధికారులు ప్రశ్నిస్తే కంపెనీ ప్రతినిధులు ఎదురుతిరిగేవారు. మరికొందరు అధికారులు ఆ కంపెనీతో కుమ్మక్కైపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ‘రాక్రీట్‌’ సంస్థ పూర్తిగా పనులు నిలిపివేసి, జిల్లా నుంచి బిచాణా ఎత్తేసింది. ఈ నేపథ్యంలో బిల్లులు మంజూరును అధికారులు నిలిపివేయడంతో కంపెనీ కోర్టును ఆశ్రయించింది. దీంతో సుమారు ఏడాదికిపైగా రాక్రీట్‌కు ఇచ్చిన నాలుగు లేఅవుట్‌లలో ఇళ్లు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అధికారుల వద్ద ఉన్న వివరాల మేరకు పైడివాడ అగ్రహారం, నడుపూరుల్లో 8,044 ఇళ్లకుగాను ఒక ఇల్లు పూర్తిచేయగా...రూఫ్‌ స్థాయిలో 137 ఉన్నాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. గత ఏడాది వరకూ నిర్మించిన ఇళ్లకు రూ.26.76 కోట్లు బిల్లులు మంజూరుచేయగా, రూ.6.02 కోట్లు విలువైన 2,17,348 సిమెంట్‌, రూ.12.03 కోట్ల విలువైన 2005 టన్నుల ఇనుము సరఫరా చేశారు. తాజాగా రాక్రీట్‌ అవినీతి గురించి మంత్రి వెల్లడించడంతో జిల్లాలో ఆ సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు, లేఅవుట్‌లలో మిగిలిన మెటీరియల్‌, ఇతర అంశాలపై విచారణ చేయాలని హౌసింగ్‌ అధికారులు నిర్ణయించారు. కాగా ఆయా లేఅవుట్‌లలో ఇతర కంపెనీలకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలు మాత్రం కొనసాగుతున్నాయి.

Updated Date - Nov 28 , 2025 | 12:48 AM