Share News

సదస్సు సూపర్‌ సక్సెస్

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:57 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన రెండు రోజుల సీఐఐ పెట్టుబడిదారుల సదస్సు సూపర్‌ సక్సెస్‌ అయింది.

సదస్సు సూపర్‌ సక్సెస్

అందరిలోను ఆనందోత్సాహాలు

అంచనాలకు మించి పెట్టుబడులు రాక

విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన రెండు రోజుల సీఐఐ పెట్టుబడిదారుల సదస్సు సూపర్‌ సక్సెస్‌ అయింది. సీఐఐ చరిత్రలో ఇంతవరకు ఏ సదస్సు ఈ స్థాయిలో విజయవంతం కాలేదని స్వయంగా ముఖ్యమంత్రే వెల్లడించారు. ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం, ఆహ్వానించిన వారంతా తరలిరావడం, అందరికీ అతిథి మర్యాదలు బాగా జరగడంతో అందరిలోను సంతృప్తి కనిపించింది. ప్రతి ఒక్కరూ నిర్వహణ, ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసలు కురిపించారు. ఈ సదస్సు కోసం జిల్లా అధికారులు నెల రోజుల ముందునుంచి కసరత్తు ప్రారంభించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పొరుగు జిల్లా మంత్రులు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటూ లోపాలను సరిదిద్దుకున్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పోలీసులు ఎక్కడా అతిగా ప్రవర్తించకుండా ముందుగానే హెచ్చరికలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. రెండు రోజుల సదస్సు పూర్తిగా విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ అధికారులను, స్థానిక నాయకులను శనివారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. ఆ ఉత్సాహంతోనే వచ్చే సదస్సు కూడా నవంబరు 2026లో ఇక్కడే నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు.


ఐటీ కంపెనీల్లో రాష్ట్ర యువతకు ప్రాధాన్యం

ఈ విషయంలో అపోహలు పెట్టుకోవద్దు

లూలూ షాపింగ్‌ మాల్‌ కాదు.. ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌

ఉమ్మడి విశాఖలోనే అధిక స్టీల్‌ ఉత్పత్తి

తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి పోర్టు కనెక్టవిటీ

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ ఆగిందని ఇంటింటికీ వెళ్లి చెప్పాలా?

మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):

కొత్తగా వచ్చే ఐటీ కంపెనీల్లో రాష్ట్ర యువతకు అధికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తారని, ఈ విషయంలో అపోహలు పెట్టుకోవద్దని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సీఐఐ పెట్టుబడిదారుల సదస్సు ముగిసిన తరువాత శనివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని సీఎం దృష్టికి తీసుకురాగా అందులో వాస్తవం లేదన్నారు. కొత్తగా వచ్చిన టీసీఎస్‌, కాండ్యుయెంట్‌ కంపెనీలన్నీ ఏపీ యువతనే తీసుకుంటున్నాయని ఐటీ శాఖా మంత్రి లోకేశ్‌ సమాధానమిచ్చారు. సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గూగుల్‌కు కూడా ఇదే సదస్సులో శంకుస్థాపన చేయాల్సి ఉందని, కొన్ని సాంకేతిక అంశాల కారణంగా వాయిదా పడిందన్నారు. గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయడం వల్లనే గూగుల్‌ విశాఖకు వచ్చిందని, దాంతో మరో ఐదారు డేటా సెంటర్లు రానున్నాయన్నారు. రిలయన్స్‌ సంస్థ ఒక గిగావాట్‌ సెంటర్‌కు ఎంఓయూ చేసిందన్నారు.

అది ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

విశాఖలో ఐటీ ఉద్యోగులకు సోషల్‌ లైఫ్‌ కావాలని, ఈ నేపథ్యంలోనే లూలూ మాల్‌ను పెడుతున్నామన్నారు. అది షాపింగ్‌కే పరిమితం కాదని, ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ స్టీల్‌, కొత్తగా అనకాపల్లి జిల్లాలో వచ్చే ఆర్సెలర్‌ మిట్టల్‌ ద్వారా దేశంలోనే అత్యధిక స్టీల్‌ తయారవుతుందన్నారు. మిట్టల్‌ స్టీల్‌ కోసం ఎన్‌ఎండీసీ నుంచి ముడిఇనుమును పైపులైన్‌ ద్వారా తెప్పించడానికి ప్రధాని నరేంద్రమోదీతో ఆ శాఖకు చెప్పించాల్సి వచ్చిందని వివరించారు. వారు దశల వారీగా రూ.1,35,000 కోట్ల పెట్టుబడి పెడతారన్నారు. తూర్పు తీరంలో పోర్టుల ద్వారా పశ్చిమ తీరంలో పోర్టులకు కనెక్టివిటీ పెంచుతున్నామని, దానిద్వారా లాజిస్టిక్స్‌ వ్యయం తగ్గుతుందన్నారు. దసపల్లా , నాగార్జున కనస్ట్రక్షన్‌ కంపెనీ భూములు చేతులు మారిపోయాయని, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని ఓ విలేకరి ప్రశ్నించగా, చట్టప్రకారం ముందుకు వెళతామన్నారు.

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ ఎలా జరుగుతుంది?

స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ ఆగినట్టా?, లేదా?...అని ఓ విలేకరి ప్రశ్నించగా సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కేంద్రం రూ.12 వేల కోట్లు ఇచ్చింది దేనికని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉంటే ఇస్తారా?...అని నిలదీశారు. ప్రైవేటీకరణ ఆగిందని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి చెప్పాలా? అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలను ఈక్విటీగా మార్చిందని, నీటి పన్ను, ఆస్తి పన్ను వదులుకుందని, సెక్యూరిటీ కూడా ఇచ్చిందని, ఇదంతా దేని కోసమని ప్రశ్నించారు. పనిచేయకుండా పడుకుంటే నష్టాలు రావా? అన్నారు. అందుకే కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.


అధికారులకు సీఎం అభినందనలు

చక్కగా పనిచేశారని కితాబు

విశాఖపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):

భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడంతో ప్రజా ప్రతినిధులు, అధికారులను సీఎం నారా చంద్రబాబునాయుడు అభినందించారు. శనివారం సదస్సు ముగింపు కార్యక్రమంలో భాగంగా అధికారులను ప్రధాన వేదికపై సత్కరించారు. ఎంపీ ఎం.శ్రీభరత్‌, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు, కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌, పోలీస్ కమీషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌, ఈపీడీసీఎల్‌ సీఎండీ పృథ్వీతేజ్‌, జీసీసీ ఎండీ కల్పనాకుమారి, సమాచార పౌరసంబంధాల శాఖ డీడీ సదారావు, పర్యాటకశాఖ అఽధికారి మాధవి తదితరులు సీఎం నుంచి జ్ఞాపికలు అందుకున్నారు. ఇంకా సీఐఐ లోకల్‌ చాప్టర్‌ చైర్మన్‌ గన్నమని శ్రీనివాస్‌, ఆయన బృందాన్ని సీఎం అభినందించారు. అనంతరం అందరితో సీఎం ఫొటోలు దిగారు.

పోలీసు సేవలు ప్రశంసనీయం

సీఐఐ సదస్సు సందర్భంగా సమర్థంగా బందోబస్తు, ట్రాఫిక్‌ నిర్వహణ చేపట్టారని సీపీ శంఖబ్రతబాగ్చి, పోలీసులను సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. సీఐఐ సదస్సుకు ఉపరాష్ట్రపతి సీఎస్‌ రాధాకృష్ణన్‌, గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌, సీఎం చంద్రబాబునాయుడుతోపాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, 40 దేశాల ప్రతినిధులు హాజరవడంతో సీపీ శంఖబ్రతబాగ్చి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్‌జామ్‌లకు అవకాశం లేకుండా ’అస్తం’ యాప్‌ ద్వారా పర్యవేక్షించారు. సదస్సు ప్రాంగణంలోనే కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షించేలా ఐపీఎస్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రజలు, ప్రతినిధులపట్ల గౌరవంగా వ్యవహరించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. డ్యూటీలో ఉన్నచోటకే భోజనం సరఫరా చేస్తామని చెప్పడంతో సిబ్బంది ఉన్న చోటే సమర్థంగా విధులు నిర్వర్తించారు.

Updated Date - Nov 16 , 2025 | 01:57 AM