Share News

అరకులో సందడి

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:24 PM

సహజసిద్ధ అందాల నిలయం అరకులోయలో సందర్శకులు సందడి చేశారు.

అరకులో సందడి
అరకులోయ మండలం బోసుబెడ్డ- మాడగడ మధ్య వలిసె పూలలో ఫొటోలు దిగుతున్న పర్యాటకులు

మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌కు సందర్శకుల తాకిడి

మంచు అందాలు ఆస్వాదన

చాపరాయి జలవిహారిలో జలకాలాటలు

అరకులోయ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): సహజసిద్ధ అందాల నిలయం అరకులోయలో సందర్శకులు సందడి చేశారు. వీకెండ్‌ కావడంతో అరకులోయకు పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. శుక్రవారం రాత్రికే అరకులోయకు పర్యాటకులు చేరుకున్నారు. శనివారం తెల్లవారు జాము నుంచే మాడగడ సన్‌రైజ్‌ హిల్స్‌ను పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శించారు. గిరిమహిళల వేషధారణతో దింసా కళాకారులతో కలిసి నృత్యం చేశారు. మరోవైపు లోయలో పాలసముద్రంలా ఉన్న మంచు అందాలను ఆస్వాదించారు. సూర్యుడు మంచుతెరలను చీల్చుకుంటూ వస్తున్న ఉషోదయాన్ని తమ సెల్‌ఫోన్లు, కెమెరాల్లో బంధించారు. ఆ దృశ్యాన్ని సెల్ఫీలు తీసుకున్నారు. అదేవిధంగా దారిలో ఉన్న వలిసె పూల తోటల్లో మంచు కురుస్తున్న సమయంలో సందర్శకులు ఫొటోలు దిగారు. అంతేకాకుండా సుంకరమెట్ట ఉడెన్‌ బ్రిడ్జి వద్ద సందర్శకులు తిరుగుతూ ట్రీడెక్‌, బర్డ్‌నెస్ట్‌లో ఫొటోఫ్రేమ్‌లో ఫొటోలు దిగుతూ కేరింతలు కొట్టారు. అరకులోయలోని ట్రైబల్‌ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌ను పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శించారు. మంచు అందాల నడుమ సందర్శకులు ఎంజాయ్‌ చేశారు.

చాపరాయి వద్ద కోలాహలం

డుంబ్రిగుడ: మండలంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలవిహారిలో, అరకు ఫీనరి అంజోడ సిల్క్‌ఫాం, కొలాపుట్టు జల తరంగిణిలో శనివారం పర్యాటకులు సందడి చేశారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది. చాపరాయి జలవిహారిలో పర్యాటకులు స్నానాలు చేసి సందడి చేశారు. అరకు ఫినరిలో ఎతైన పైనరీ చెట్ల మధ్య, పూలవనంలో సెల్ఫీలు దిగుతూ సాయంత్రం వరకు కుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడిపారు.

Updated Date - Nov 08 , 2025 | 11:25 PM