సింహాచలం టీడీఆర్‌లపై కమిషనర్ ఆరా
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:15 AM
సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణలో స్థలాలు పోగొట్టుకున్న వారికి టీడీఆర్‌ల జారీలో అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ మంగళవారం ఆరా తీసినట్టు తెలిసింది.
మేయర్‌తో చర్చ
ఆరోపణలపై నిగ్గు తేల్చిన తరువాతే ముందుకు వెళ్లాలని నిర్ణయం
మరోవైపు సమాచార సేకరణలో సీఎం కార్యాలయం, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు
జాబితాలో అనర్హులు ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు సమాచారం
విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణలో స్థలాలు పోగొట్టుకున్న వారికి టీడీఆర్‌ల జారీలో అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ మంగళవారం ఆరా తీసినట్టు తెలిసింది. ‘బీఆర్‌టీఎస్ రోడ్డు టీడీఆర్‌ల జారీలో అనర్హులకు చోటు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై జనసేనకు చెందిన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ సైతం ఆధారాలతో సీఎం చంద్రబాబునాయుడు, విజిలెన్స్ డీజీపీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఆస్తిపన్ను ఒకరి పేరిట ఉంటే టీడీఆర్ మరొకరికి ఇవ్వడం, తక్కువ విస్తీర్ణం పోయిన వారికి ఎక్కువ విస్తీర్ణం పోయినట్టు అదనంగా టీడీఆర్ జారీచేయడం, తక్కువ ధర ఉన్నచోట ఎక్కువ ధర ఉన్న డోర్ నంబర్‌ను చూపించి అదనంగా టీడీఆర్ జారీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా టౌన్‌ప్లానింగ్ అధికారులు రోడ్డును ఆక్రమించే వ్యాపారులకు విధించే జరిమానా రశీదుల ఆధారంగా కొందరికి పరిహారం చెల్లించేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఆధారాలతో మూర్తియాదవ్ ఫిర్యాదు చేయడంతో కమిషనర్ స్పందించారు. మంగళవారం మేయర్ పీలా శ్రీనివాసరావు ఛాంబర్‌కు వెళ్లి సింహాచలం బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణ టీడీఆర్‌లపై చర్చించినట్టు తెలిసింది. టీడీఆర్‌ల జాబితాలో అనర్హులను చేర్చడంతోపాటు అక్రమాలు జరిగినట్టు తనకు కొందరు ఆధారాలను అందజేసినందున వాటిపై సమగ్ర అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ అభిప్రాయపడినట్టు సమాచారం. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతోపాటు ఏసీబీ అధికారులు సైతం బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణకు సంబంధించిన టీడీఆర్‌ల జాబితా గురించి ఆరా తీసినట్టు తెలిసింది. సీఎం కార్యాలయం నుంచి కొందరు అధికారులు సైతం ఫోన్ ద్వారా టీడీఆర్‌ల జారీలో ఆరోపణలపై ఆరా తీసినట్టు ప్రచారం జరుగుతోంది. టీడీఆర్‌లను అందజేస్తే ఏదైనా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్నందున అక్రమాలపై వస్తున్న ఆరోపణలు, ఆధారాలపై నిగ్గు తేల్చిన తర్వాతే ముందుకువెళ్లడం మంచిదని కమిషనర్ అభిప్రాయపడినట్టు కొందరు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.
కొనసాగుతున్న ఆపరేషన్ లంగ్స్
ఎనిమిది జోన్లలో 281 ఆక్ర మణలు తొలగింపు
విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లతోపాటు పార్కుల్లో ఆక్రమణలను తొలగించేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రారంభించిన ‘ఆపరేషన్ లంగ్స్ 2.0’ మంగళవారం కూడా కొనసాగింది. జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది 281 ఆక్రమణలను తొలగించారు. జోన్-1 పరిధిలో మంగమారిపేట నుంచి భీమిలి వరకూ 13, జోన్-2 పరిధిలో కార్‌షెడ్ జంక్షన్ నుంచి పీఎం పాలెం ఆఖరి బస్టాప్ వరకు 18, జోన్-3 పరిధిలో రామాటాకీస్ నుంచి సత్యం జంక్షన్ వరకూ, సత్యం జంక్షన్ నుంచి సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ, ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్ నుంచి పోర్టు స్టేడియం వరకూ, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నుంచి గురుద్వార జంక్షన్ వరకూ 83 ఆక్రమణలను తొలగించారు. అలాగే జోన్-4 పరిధిలో అగర్వాల్ ఆస్పత్రి నుంచి ఆంథోని స్కూల్ వరకూ 33 ఆక్రమణలను, జోన్-5 పరిధిలో అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డు నుంచి రైల్వేన్యూకాలనీ వరకూ 40, మల్కాపురం నుంచి కోరమాండల్ గేట్ వరకు 12, జోన్-6 పరిధిలో బీసీ రోడ్డు నుంచి గంగవరం పోర్టు రోడ్డు వరకూ, అగనంపూడి నుంచి స్టీల్‌ప్లాంటు జనరల్ ఆస్పత్రి వరకూ 67, జోన్-8 పరిధిలో వేపగుంట జంక్షన్ నుంచి చినముషిడివాడ వరకూ 15 ఆక్రమణలు తొలగించారు. ఇకపై కూడా ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు.