కళకళలాడిన కొమ్ము కోనాం చేపలు
ABN , Publish Date - May 26 , 2025 | 12:09 AM
ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం కొమ్ము కోనాం చేపలు కళకళలాడాయి. ప్రస్తుతం సముద్రంలో చేపల వేట నిషేధం అమలులో ఉంది.
తెరపడవలతో వేట సాగించిన మత్స్యకారులు
ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే పనిలో నిమగ్నం
బీచ్ రోడ్డు, మే 25, (ఆంధ్రజ్యోతి):
ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం కొమ్ము కోనాం చేపలు కళకళలాడాయి. ప్రస్తుతం సముద్రంలో చేపల వేట నిషేధం అమలులో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మర బోట్లలో మత్స్యకారులు సంద్రంలోకి వేటకు వెళ్లకూడదు. కానీ తెరపడవల మీద వేటకు వెళ్లవచ్చు. ఇలా వెళ్లిన పలువురు మత్స్యకారుల వలలకు కొమ్ము కోనాం చేపలు చిక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒక్కో చేప సుమారు 40 నుంచి 50 కిలోల వరకు ఉంటుందని వారు తెలిపారు. విశాఖ తీరంలో లభించే కొమ్ము కోనాం చేపలకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉందని వారన్నారు. అయితే ఇక్కడ కొమ్ము కోనాం చేపకు కిలో రూ.150 నుంచి రూ.300కు మించి లభించదన్నారు. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వీటికి డిమాండ్ అధికంగా ఉండడంతో పాటు ధర కూడా లాభదాయకంగా ఉంటుండడంతో అక్కడకు ప్యాకింగ్ చేసి పంపుతున్నట్టు పలువురు మత్స్యకారులు తెలిపారు. ప్రతిరోజు 40 నుంచి 60 కిలోల వరకు ఎగుమతి చేయగలమని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు లక్ష్మణరావు వెల్లడించారు.