మన్యంపై చలి పంజా!
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:06 PM
మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలి పంజా విసురుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు.
ముంచంగిపుట్టులో 3.1 డిగ్రీలు
వణుకుతున్న గిరిజనం
సంగోడిలో గడ్డ కట్టిన మంచు
పాడేరు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో చలి పంజా విసురుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. గత ఐదు రోజులుగా కొయ్యూరు మండలం మినహా పది మండలాల్లోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. రాత్రి, పగలు సైతం ఒకేలా చలి ప్రభావం చూపుతుండగా.. మధ్యాహ్నం ఒక మోస్తరుగా చలి తగ్గుతుంది. తాజా వాతావరణంతో సాధారణ జనజీవనానికి అంతరాయం ఏర్పడుతున్నది. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్ముకుంది. ప్రజలు ఉన్ని దుస్తులు ధరిస్తూ, మంటలు కాగుతూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. పాడేరు మండలం మినుములూరు పంచాయతీ సంగోడి గ్రామ సమీపంలోని పంటల వద్ద శుక్రవారం ఉదయం మంచు గడ్డ కట్టింది. వాటిని స్థానికులు ఫోటోలు తీశారు. వరి గడ్డిపైన, నూర్పుల కోసం సిద్ధం చేసిన టార్పాలిన్‌పై పడిన మంచు ఐస్ మాదిరిగా గడ్డకట్టింది.
ముంచంగిపుట్టు గజగజ
ముంచంగిపుట్టు: మండల పరిధిలో చలి ప్రజలను గజగజలాడిస్తోంది. శుక్రవారం 3.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణుకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలు దాటినా సూర్యుడు కనిపించడం లేదు. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవుతున్నది. దీంతో ఎక్కువ శాతం మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే వారు మధ్యాహ్నం 2 గంటలు దాటితే చాలు ఇంటి ముఖం పడుతున్నారు. మంచు ఎక్కువగా ఉండడంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
పెరిగిన మంచు తీవ్రత
హుకుంపేట:మండలంలో రోజురోజుకు చలి, మంచు తీవ్రత పెరుగుతోంది. దీంతో వాహనాల లైట్లు వేసుకొని చోదకులు ప్రయాణాలు సాగిస్తున్నారు. శుక్రవారం హైవేపై మంచు కారణంగా రోడ్డు మార్గం కనిపించని పరిస్థితి నెలకొంది. పాడేరు నుంచి అరకులోయ వరకు రోడ్డుపై ఎల్‌ఈడీ లైట్లు వేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం 10 గంటలు అయినా మంచు, చలి విడడం లేదని మన్యం వాసులు వాపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.
పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
పెదబయలు:ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలతో ప్రజలను వణికిస్తోంది. పెదబయలులో ఉదయం 9 గంటలకు ముందు, సాయంత్రం 4 గంటల తరువాత రోడ్డుపై ఎవరూ కనిపించడం లేదు. దీంతో ప్రధాన రహదారి నిర్మానుష్యంగా కనిపిస్తోంది. మిట్ట మధ్యాహ్నంలో ద్విచక్ర వాహనంపై రాకపోకలు చేస్తున్నా శీతల గాలులు వీస్తున్నాయి. చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకుంటున్నారు. ఉన్ని దుస్తులు ధరిస్తూ రక్షణ పొందుతున్నారు.
వణికిస్తున్న చల్లటి గాలులు
సీలేరు: సీలేరులో చలి తీవ్రత రోజురోజుకు అధికం కావడంతో జనాలు వణికిపోతున్నారు. సీలేరులో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. శుక్రవారం సీలేరులో 9 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పది గంటలు అయినా చలి గాలులు వీస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి వణికిస్తోంది. దీంతో సీలేరులో ఎక్కడ పడితే అక్కడ చలిమంటలు వేసుకొని ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.