మన్యాన్ని వణికిస్తున్న చలి
ABN , Publish Date - Dec 26 , 2025 | 10:39 PM
మన్యంలో చలి గజగజ వణికిస్తోంది. వాతావరణంలోని మార్పులతో పాటు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి గడగడలాడిస్తోంది.
దట్టంగా కురుస్తున్న మంచు
ముంచంగిపుట్టులో 7.0 డిగ్రీలు
చలి మంటలు కాగుతున్న ఏజెన్సీ వాసులు
పాడేరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి):
మన్యంలో చలి గజగజ వణికిస్తోంది. వాతావరణంలోని మార్పులతో పాటు ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి గడగడలాడిస్తోంది. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగానే కురుస్తోంది. శుక్రవారం జిల్లా కేంద్రం పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం పదిన్నర గంటల వరకు పొగమంచు విపరీతంగా పడింది. ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన్యంవాసులు ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు కాగుతున్నారు. తాజా వాతావరణం మన్యం సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తున్నది.
సింగిల్ డిజిల్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లోనే కొనసాగుతున్నాయి. శుక్రవారం ముంచంగిపుట్టులో 7.0 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అరకులోయలో 8.2, పెదబయలులో 8.4, పాడేరులో 9.2, చింతపల్లిలో 9.3, హుకుంపేటలో 10.2, కొయ్యూరులో 11.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పెరిగిన చలి తీవ్రత
ముంచంగిపుట్టు:మండలంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మండల కేంద్రంలో శుక్రవారం 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, వయసు పైబడిన వారు ఆపసోపాలు పడుతున్నారు.
జీకేవీధిలో 7.1 డిగ్రీలు
గూడెంకొత్తవీధి: గిరిజన గ్రామాల్లో 20 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత భారీగా పెరిగింది. శుక్రవారం ఆర్‌వీనగర్‌లో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. స్థానికులు 24 గంటలు ఉన్ని దుస్తులు ధరించుకోవాల్సి వస్తున్నది. రాత్రి వేళ రెండు రగ్గులు కప్పుకున్న చలి ఆగడం లేదని స్థానికులు అంటున్నారు. ప్రతి ఇంటి వద్ద చలి మంటలు వేసుకుంటున్నారు. నిద్రకు వెళ్లే వరకు స్థానికులు చలి మంట చుట్టూ కూర్చొని ఉపశమనం పొందుతున్నారు. కాగా జనవరి మొదటి పక్షం వరకు చలి తీవ్రత అధికంగానే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.