Share News

తీరం.. మురికిమయం

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:10 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సముద్ర తీరం మురికికూపంగా మారుస్తోంది. నగరానికి మణిహారంగా భావించే ఆర్కే బీచ్‌తోపాటు సముద్ర జలాల పరిరక్షణకు కృషిచేయాల్సిన అధికారులు...చేజేతులా భ్రష్టుపట్టిస్తున్నారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా పంప్‌హౌస్‌ల నుంచి నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు.

తీరం.. మురికిమయం

సముద్రంలోకి మానవ వ్యర్థాలు

యూజీడీ వ్యర్థాల శుద్ధి ప్రక్రియలో భాగంగా

బీచ్‌రోడ్డులో పలుచోట్ల పంప్‌హౌస్‌ల ఏర్పాటు

పాండురంగాపురం పంప్‌హౌస్‌లో పనిచేయని మోటార్లు

దాంతో పైపుల ద్వారా నే రుగా

సముద్రంలోకి వదిలేస్తున్న సిబ్బంది

దుర్వాసనతో పర్యాటకుల అవస్థలు

పట్టించుకోని జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సముద్ర తీరం మురికికూపంగా మారుస్తోంది. నగరానికి మణిహారంగా భావించే ఆర్కే బీచ్‌తోపాటు సముద్ర జలాల పరిరక్షణకు కృషిచేయాల్సిన అధికారులు...చేజేతులా భ్రష్టుపట్టిస్తున్నారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా పంప్‌హౌస్‌ల నుంచి నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు.

నగరంలో సుమారు రెండు లక్షల ఇళ్లకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) కనెక్షన్లు ఉన్నాయి. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే మానవ వ్యర్థాలు నేరుగా డ్రైనేజీలో కలిస్తే పారిశుధ్య సమస్య తలెత్తి వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉండడంతో యూజీడీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల మానవ వ్యర్థాలు మరుగుగొడ్డి నుంచి యూజీడీ పైప్‌లైన్‌ ద్వారా సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు చేరతాయి. అక్కడ మోటార్లతో ప్రత్యేక ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు. యూజీడీ ద్వారా వచ్చే వ్యర్థాల్లోని ప్రమాదకరమైన వాయువులతోపాటు టాక్సిన్‌లను తొలగించిన తర్వాత ఆ నీటిని నగరంలో మొక్కల పెంపకానికి, పరిశ్రమల అవసరాలకు కేటాయిస్తుంటారు. మిగిలిపోయిన నీటిని సముద్రంలోకి విడిచిపెడుతుంటారు. దీనికోసం నగరంలో 225 ఎంఎల్‌డీ యూజీడీ వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన 18 ఎస్‌టీపీలు ఉన్నాయి. బీచ్‌రోడ్డు పరిసరాల్లోని నివాసాలు, హోటళ్లు, లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌ల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు పల్లంలో ఉన్న సముద్రంలోకి వెళ్లిపోయే అవకాశం ఉన్నందున...ఆ ప్రాంతంలో ఐదు చోట్ల యూజీడీ పంప్‌హౌస్‌లను ఏర్పాటుచేశారు. పాండురంగాపురం డౌన్‌లో రెండు, పాత మునిసిపల్‌ కార్యాలయం, పెదజాలరిపేట, సాగర్‌నగర్‌ వద్ద ఒక్కొక్కటి చొప్పున బీచ్‌రోడ్డును ఆనుకుని పెద్ద సంప్‌ వెల్‌లను నిర్మించారు. బీచ్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే యూజీడీ వ్యర్థాలన్నీ ఆయా సంప్‌ వెల్స్‌లోకి చేరితే అక్కడ నుంచి మోటార్లు ద్వారా పాతనగరం, అప్పుఘర్‌లోని ఎస్‌టీపీలకు పంపింగ్‌ చేసి శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లతోపాటు ప్రతి పంప్‌హౌస్‌కు ఒక ఏఈ స్థాయి అధికారి ఉంటారు. యూజీడీ పంప్‌హౌస్‌లలోని మోటార్లు నిరంతరం పనిచేయాల్సి ఉండడంతో తరచూ మరమ్మతులకు గురవుతుంటాయి. అయితే అక్కడ ఉండే సిబ్బందితోపాటు పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్‌ అధికారులు ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటున్నారు. మరమ్మతులకు గురైనప్పుడు ప్రతిపాదనలు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారని, కానీ పనులు మాత్రం జరగడం లేదని అంటున్నారు.

తాజాగా పాండురంగాపురం వద్ద ఉన్న యూజీడీ పంప్‌హౌస్‌లోని మోటార్లు గత కొద్దిరోజులుగా పనిచేయకపోవడంతో వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్‌ ప్రక్రియ జరుగుతుండడంతో సందర్శకులు ఆ దృశ్యాన్ని చూసేందుకు తీరంలోకి వెళ్లి పైప్‌లైన్‌ మీద నిలబడుతున్నారు. అదే సమయంలో పంప్‌హౌస్‌ నుంచి యూజీడీ వ్యర్థాలు పైపు ద్వారా తీరంలోకి చేరుతున్నాయి. దుర్వాసనతో యూజీడీ వ్యర్థాలు సముద్ర జలాల్లో కలిసిపోతున్నాయి. దీనివల్ల తీరంలో పరిశుభ్రత దెబ్బతినడంతోపాటు సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. ఇదంతా ఇంజనీరింగ్‌ అధికారులు కళ్లారా చూస్తూ కూడా ఏమీ పట్టనట్టు వదిలేయడంపై సందర్శకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 01:10 AM