Share News

తరగతి చిన్నబోయింది..

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:36 AM

రేగుపాలెం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థికి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

  తరగతి చిన్నబోయింది..

- జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కడే విద్యార్థి

- ముగ్గురు ఉన్నవి మరికొన్ని..

- ఎలమంచిలి మండలంలో 10 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 15

- రామారాయుడుపాలెంలో ఒకటో తరగతి ఖాళీ

- తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లపై ఆసక్తి చూపిస్తుండడంతో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య

ఎలమంచిలి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ ఏడాది మండలంలోని పలు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం విద్యాశాఖలో ఆందోళన నెలకొంది. పది మంది కూడా విద్యార్థులు లేని పాఠశాలలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఎలమంచిలి మండలంలో పది మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 15కి పైగానే ఉన్నాయి. ఇదే మండలంలోని రేగుపాలెం ఫౌండేషన్‌ స్కూల్‌లో 1, 2 తరగతులకు ఇద్దరు మాత్రమే విద్యార్థులున్నారు. ఈ ఏడాది ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థి చేరగా, రెండవ తరగతిలో ఒకే విద్యార్థిని మాత్రమే ఉంది. ఇక్కడి ఏకోపాధ్యాయుడు ఆనంద్‌రాజు వీరికి పాఠాలు బోధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫౌండేషన్‌, బేసిక్‌ ప్రైమరీ, మోడల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించింది. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభం నుంచే విద్యామిత్ర కిట్లతో పాటు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేసింది. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన బియ్యం వినియోగిస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో విద్యార్థుల ప్రవేశాలు జరగడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్ల వయసు దాటిన పిల్లలు, పాఠశాలకు దూరంగా ఉన్న బడి ఈడు పిల్లలను గుర్తించి ప్రతి ఏటా విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదికలు ఇస్తోంది. ఈ ఏడాది జూన్‌ 12 నుంచి నెల రోజుల పాటు పిల్లల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినా ఫలితం లేకుండా పోతోంది. ప్రైవేటు పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.

ఎలమంచిలి మండలంలోని కొన్ని పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరని పాఠశాలలున్నాయంటే పరిస్థితి ఏ స్థాయికి ఉందో అర్థమవుతోంది. ఇక్కడ ఫౌండేషన్‌ పాఠశాలలు 4, బేసిక్‌ ప్రైమరీ పాఠశాలలు 33తో పాటు మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 51 ఉన్నాయి. 3,482 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా పది మంది కంటే తక్కువమంది విద్యార్థులున్న పాఠశాలలు 15 వరకు ఉన్నాయి. రేగుపాలెం ఫౌండేషన్‌ పాఠశాలలో ఇద్దరు, కొత్త యర్రవరంలో ముగ్గురు విద్యార్థులే ఉన్నారు. లైను కొత్తూరులో 9 మంది, సోమలింగ పాలెం, మర్రిబంద, కేపీ పురం పాఠశాలల్లో నలుగురి చొప్పున విద్యార్థులున్నారు.

ప్రైవేటు పాఠశాలలపై ఆసక్తి

ప్రధానంగా ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గు చూపుతుండడమే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాల ప్రజలు పనుల నుంచి సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత వస్తుంటారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే సాయంత్రం 4 గంటలకే ఇంటికి వస్తారని, తాము వచ్చే వరకు వారి పర్యవేక్షణ ఇబ్బంది అవుతోందని, అదే ప్రైవేటు పాఠశాలలైతే సాయంత్రం 6 గంటల తరువాత పంపుతారని చెబుతున్నారు. ఈ విషయమై జిల్లా ఉప విద్యాశాఖాధికారి కె.అప్పారావు వివరణ కోరగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల చేరికకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రోజూ ప్రణాళికాబద్ధంగా తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తున్నట్టు చెప్పారు.

Updated Date - Jul 06 , 2025 | 12:36 AM