ఉలిక్కిపడిన నగరం
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:48 AM
ఈస్టిండియా పెట్రోలియం కంపెనీలోని ఫిల్టర్ ట్యాంకుపై పిడుగు పడడంతో నగరం ఉలిక్కిపడింది.
ఈస్టిండియా కంపెనీపై పిడుగు
ప్రమాద ప్రాంతానికి సమీపంలో పెట్రోలియం రిఫైనరీలు
ఘటనా స్థలానికి 50 వరకు అగ్నిమాపక శకటాలు
ట్యాంకులో కొనసాగుతున్న మంటలు
సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, అగ్నిమాపక డీజీ, పీసీబీ, ఫ్యాక్టరీస్ అధికారులు
విశాఖపట్నం/మల్కాపురం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
ఈస్టిండియా పెట్రోలియం కంపెనీలోని ఫిల్టర్ ట్యాంకుపై పిడుగు పడడంతో నగరం ఉలిక్కిపడింది. అత్యంత శక్తివంతమైన పిడుగు దెబ్బకు ఎంతో బరువైన, సురక్షితమైన ట్యాంకు పైకప్పు ఊడిపడింది. మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఏ ప్రమాదం జరిగినా దాని పర్యవసనాలు తీవ్రంగా ఉండడంతో నగర ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి పారిశ్రామిక ప్రాంతంలో వర్షం ప్రారంభమైంది. విశాఖకు ఆనుకుని పిడుగులు పడతాయని తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరిక బులెటిన్ విడుదలచేసిన కొద్ది గంటల్లోనే డాక్‌యార్డుకు కొద్దిదూరంలో ఉన్న ఈస్టిండియా కంపెనీపై పెద్ద శబ్దంతో పిడుగు పడింది. వెంటనే నింగిన తాకేలా మంటలు రేగడంతో ఏదో ప్రమాదం జరిగిందని నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పిడుగుపడి హెచ్‌పీసీఎల్ తగలబడిపోతుందంటా..? నిజమేనా..? అనే వదంతులు వ్యాపించాయి. అయితే ఈస్టిండియా కంపెనీలో ప్రమాదం జరిగిందని తేలడంతో కొంత ఆందోళన తగ్గింది. అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో భయం భయంగా గడిపారు. అయితే పిడుగు ఈస్టిండియా కంపెనీకి సమీపంలో ఉన్న హెచ్‌పీసీఎల్ ఎల్‌పీజీ ప్రాజెక్టు, హెచ్‌పీసీఎల్ అడిషనల్ ట్యాంక్ ప్రాజెక్ట్స్టు, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఆవరణలో పడితే పెద్దఎత్తున ప్రాణ నష్టం సంభవించేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ట్యాంకు సామర్ధ్యం 7,200 కిలో లీటర్లు
ఈస్టిండియా కంపెనీ ఆవరణలో సుమారు 50 స్టోరేజీ ట్యాంకులున్నాయి. ఇతర దేశాల నుంచి పలు రకాల ముడిచమురు, అనుబంధ ఉత్పత్తులను కొన్ని కంపెనీలు విశాఖ పోర్టుకు దిగుమతి చేసుకుని ఇక్కడ నుంచి బయటకు తరలిస్తుంటాయి. పోర్టు నుంచి ఒకేసారి వేల కిలో లీటర్లు రవాణా సాధ్యంకానందున పోర్టు ఏరియాలో ఉన్న ఈస్టిండియా కంపెనీలో నిల్వ చేస్తుంటారు. ఆదివారం పిడుగు ధాటికి గురైన ట్యాంకు సామర్ధ్యం 7,200 కిలో లీటర్లు. అయితే ప్రస్తుతం 7 వేల కిలో లీటర్ల మిథనాల్ ఆయిల్ నిల్వ ఉంది. మిథనాల్ ఆయిల్ కామన్ సాల్వెంట్. దీని నుంచి పలు రకాల ఉత్పత్తులు తయారుచేస్తారు. దీనికి వుడ్ ఆయిల్ అని కూడా అంటారు. మిథనాల్ ఆయిల్‌కు మండే స్వభావం ఉంది. అయితే ఆదివారం పిడుగు పడడంతో ట్యాంకుపై కప్పు ఊడిపోయింది. పిడుగు ధాటికి ట్యాంకులోపల, చుట్టూ మంటలు అంటుకున్నాయి. ట్యాంకు చుట్టూ మంటలను సుమారు ఎనిమిది గంటలు శ్రమించి ఆర్పేశారు. ట్యాంకు లోపల మంటలు అదుపుచేయడం అంత సులువుకాదు. మిథనాల్‌ను ట్యాంకు అడుగు భాగం నుంచి పైపు ద్వారా మరో ట్యాంకుకు తోడుతున్నారు. అదే సమయంలో ట్యాంకుపైన అంటుకున్న మంటలను అదుపు చేస్తున్నారు. సోమవారం ఉదయానికి మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా మిథనాల్‌కు మండే స్వభావం ఉన్నా మంటల వల్ల కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్( నీటి ఆవిరి)గా మారుతున్నందున కొంత వరకు ప్రమాదం తగ్గుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఈస్టిండియా కంపెనీలో ప్రమాదం సంభవించిన వెంటనే ఫ్యాక్టరీస్ విభాగం అధికారులు, పోలీసులు, కాలుష్య నియంత్రణమండలి అధికారులు సందర్శించారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఇన్‌చార్జి ఫైర్‌డీజీ వెంకటరమణ సందర్శించి పరిస్థితి సమీక్షించారు. స్టోరేజీకి ఎప్పటికప్పుడు అనుమతులు ఇస్తుంటామని కాలుష్య నియంత్రణమండలి ఈఈ ముకుందరావు తెలిపారు.
లైట్నింగ్ ప్రొటెక్టర్ లేదా?
పిడుగు ప్రమాదం నుంచి రక్షణకు చాలా భవనాలపై లైట్నింగ్ ప్రొటెక్టర్లు అమర్చుతారు. నగరంలో చాలా భవనాలు, వాణిజ్య సముదాయాలపై వీటినా అమర్చడం సర్వసాధారణం. భవనాలు, సముదాయాలపై భాగాన వాటిని అమర్చి అక్కడి నుంచి వైర్లను కిందకు తీసుకువచ్చి భూమిలోకి పంపుతారు. ఇంటికి విద్యుత్ సరఫరా చేసేటప్పుడు ఎర్త్ ఇచ్చినట్టే. ఇవి పిడుగు ప్రభావం నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తాయి. అయితే ఈస్టిండియా కంపెనీలో లైట్నింగ్ ప్రొటెక్టర్లు ఏర్పాటు చేయలేదా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. అయితే ముడిచమురు నిల్వ ఉంచిన ఎత్తైన ట్యాంకులపై లైట్నింగ్ ప్రొటెక్టర్లు అమర్చితే ఇబ్బందులు తలెత్తు ప్రమాదం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీ ఆవరణలోని భవనాలపై అమర్చవచ్చుచని, తద్వారా తగిన రక్షణ లభిస్తుందని వివరించారు. కంపెనీ ఆవరణకు ఆనుకుని చెట్లు, రాత్రి సమయాల్లో లైటింగ్ కోసం ఎత్తుగా ఏర్పాటుచేసిన టవర్లు ఉన్నందున పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
నగరంలో పిడుగులు సాధారణమే..
జనావాసాలకు దూరంగా పిడుగులు పడుతుంటాయి. అయితే ఒక్కోసారి తీవ్రమైన పిడుగులు నగరంలో ఖాళీ ప్రదేశాలు, ఎత్తైన చెట్లు/ టవర్లపై పడుతుంటాయి. పారిశ్రామిక కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో ఆదివారం పిడుగు పడడం సాధారణమేనని వాతావరణ అఽధికారి సముద్రాల జగన్నాథకుమార్ తెలిపారు. మిచాంగ్ తుఫాన్ సమయంలో చినవాల్తేరులోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం సమీపంలో ఎత్తైన తాటిచెట్లపై పిడుగు పడిందని గుర్తుచేశారు. అంతకుముందు ఏయూ ఉన్నత పాఠశాల సమీపంలో పిడుగు పడడంతో రెండు చెట్లు కాలిపోవడం చాలామంది చూసే ఉంటారన్నారు. పిడుగుల తీవ్రత ఏటా పెరుగుతుందని, ప్రజలు నిరంతరం విద్యుత్ వాడుతుంటారని, పిడుగులు పడే వాతావరణం ఉన్నప్పుడు టీవీలు, సెల్‌ఫోన్లు ఆఫ్ చేయాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, వాటిని వాడితే పిడుగు తీవ్రత పెరుగుతుందన్నారు.