నేడు సీఎం అనకాపల్లి రాక
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:39 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు.
తాళ్లపాలెంలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరు
గ్రామస్థులతో ముఖాముఖి
అనకాపల్లి హైవే జంక్షన్‌లో దివంగత మాజీ ప్రధాని వాజపేయి విగ్రహావిష్కరణ
అనకాపల్లి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా కశింకోట మండలం తాళ్లపాలెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.15 గంటలకు తాళ్లపాలెం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలకు వెళతారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కొద్దిసేపు సమావేశమై మాట్లాడతారు. 11.45 గంటల నుంచి 11.55 గంటల వరకు తాళ్లపాలెం గ్రామస్థులతో మాట్లాడి పారిశుధ్య పనుల గురించి చర్చిస్తారు. అనంతరం బంగారయ్యపేటలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శిస్తారు. 12.35 గంటల వరకూ ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు. 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తాళ్లపాలెంలోని ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాటుచేసిన ప్రజా వేదిక వద్దకు చేరుకుంటారు. 1.10 గంటల నుంచి 2.50 గంటల వరకూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2.55 గంటల నుంచి 4.20 గంటల వరకూ ఉగ్గినపాలెం గ్రామం వద్ద క్యాడర్‌తో, పార్టీ ముఖ్య నేతలతో, నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులతో సమావేశమవుతారు. 4.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 4.40 గంటలకు అనకాపల్లి జలగలమదుం జంక్షన్ సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో జాతీయ రహదారి డబుల్ ట్రంపెట్ వద్ద ఏర్పాటుచేసిన దివంగత మాజీ ప్రధాని వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం హెలిప్యాడ్‌కు చేరుకుని 5.35 గంటలకు హెలికాప్టర్‌లో విజయవాడకు బయలుదేరతారు.