Share News

మారనున్న జిల్లా స్వరూపం

ABN , Publish Date - Nov 26 , 2025 | 12:15 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా స్వరూపం మారనుంది. ర ంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాలతోపాటు పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలను కలుపుతూ కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు.

మారనున్న జిల్లా స్వరూపం
రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాకు సీఎం చంద్రబాబు ఆమోదం

రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు, 18 మండలాలతో కొత్త జిల్లా

పాడేరు, అరకులోయ నియోజకవర్గాలు, 11 మండలాలకే పరిమితం కానున్న అల్లూరి జిల్లా

కొత్త జిల్లా ఏర్పాటుతో తీరనున్న రంపచోడవరం ప్రాంతీయుల కష్టాలు

(పాడేరు- అంధ్రజ్యోతి)

అల్లూరి సీతారామరాజు జిల్లా స్వరూపం మారనుంది. ర ంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాలతోపాటు పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలను కలుపుతూ కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాలు, అరకులోయ నియోజకవర్గంలోని అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని రంపచోడవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం, దేవిపట్నం, రాజవొమ్మంగి, చింతూరు, కూనవరం, వీఆర్‌.పురం, ఎటపాక మండలాలు(మొత్తం 22) కలుపుకొని 2022 ఏప్రిల్‌ 4న పాడేరు కేంద్రంగా అల్లూరి సీతామరాజు జిల్లాను ఏర్పాటు చేశారు.

చింతూరు, రంపచోడవరం డివిజన్‌ వాసులకు దూరాభారం

పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుతో రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 11 మండలాల ప్రజలకు జిల్లా కేంద్రం దూరమైపోయింది. చింతూరుకు 250, రంపచోడవరానికి 180 కిలోమీటర్ల దూరంలో పాడేరు ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజనులు జిల్లా కేంద్రానికి రావాలంటే నానా అవస్థలు పడాల్సిందే. అలాగే జిల్లా అధికారులు సైతం ఆయా ప్రాంతాల్లో పర్యటించడం చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో కొత్త జిల్లా ఏర్పాటుతో తమకు మరిన్ని కష్టాలు ఏర్పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే చింతూరు డివిజన్‌ పరిధిలోని నాలుగు మండలాలను తెలంగాణకు చెందిన ఖమ్మంలో కలపాలని, రంపచోడవరం డివిజన్‌లోని ఏడు మండలాలను రాజమహేంద్ర వరంలో కలపాలని అప్పట్లో ఆ ప్రాంతీయులు డిమాండ్‌ చేశారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలవరం కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని నారా చంద్రబాబునాయుడు ఆ ప్రాంతీయులకు హామీ ఇచ్చారు.

18 గిరిజన మండలాలతో ’పోలవరం’ జిల్లా ఏర్పాటు

జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రంపచోడవరం కేంద్రంగా 18 మండలాలతో పోలవరం పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం ఆమోదం తెలిపారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని రంపచోడవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం, దేవీపట్నం, రాజవొమ్మంగి, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలు, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, టి.సరసాపురం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు.. మొత్తం 18 గిరిజన మండలాలను కలిపి పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆయా ప్రాంతీయులకు జిల్లా కేంద్రం చేరువకావడంతో పాటు అధికారులకు పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. అలాగే తాజా జిల్లాల పునర్విభజనతో పాడేరు, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మొత్తం పదకొండు మండలాలకే అల్లూరి సీతారామరాజు జిల్లా పరిమితం కానుంది.

Updated Date - Nov 26 , 2025 | 12:15 AM