Share News

సింహగిరికి ఉత్సవ శోభ

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:01 AM

ఏడాది పొడవునా చందనపు పైపూతతో పూజలందుకునే సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి బుధవారం ద్వయావతారుడిగా తన నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

సింహగిరికి ఉత్సవ శోభ

  • నేడే చందనోత్సవం

  • భక్తులకు నిజరూపంలో దర్శనమివ్వనున్న అప్పన్న

  • తెల్లవారుజామున 4 గంటల నుంచి అవకాశం

  • ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

  • విద్యుద్దీపాలతో దేవస్థానం, రాజగోపురం, పరిసర ప్రాంతాల అలంకరణ

సింహాచలం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి):

ఏడాది పొడవునా చందనపు పైపూతతో పూజలందుకునే సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి బుధవారం ద్వయావతారుడిగా తన నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అపురూపమైన స్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) కోసం లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలుపుతారు. 1.30 గంటలకు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనము, తదితరాలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఏడాది పొడవునా స్వామి వారిపై పూతగా ఉండే చందనాన్ని తొలగించి, ప్రభాత ఆరాధన చేస్తారు. బుధవారం తెల్లవారుజామున 3.00 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పిస్తారు. 3.30 గంటల నుంచి 4 గంటల నడుమ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సంప్రదాయ వస్త్ర సమర్పణలు ఉంటాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. స్వామి దర్శనం కోసం అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి భక్తులు వందలాది మంది మంగళవారం సాయంత్రానికి సింహగిరికి చేరుకున్నారు. దేవస్థానం ఏర్పాటుచేసిన ఉచిత దర్శనం క్యూలో వేచిఉన్నారు.

ఉత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం అధికారులు రంగురంగుల విద్యుత్‌ దీపాలతో సింహగిరిని శోభాయమానంగా అలంకరించారు. అదేవిధంగా క్యూలను గతంకంటే ఎక్కువగా నిర్మించారు. ఎక్కడికక్కడ తాగునీటి సదుపాయం కల్పించారు. అనేకచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటుచేశారు. దివ్యాంగులను సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.

జిల్లా కలెక్టర్‌ మంగళవారం సింహగిరిపై పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్యూలు, బారికేడ్లు, మజ్జిగ, తాగునీటి పంపిణీ వంటి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సూచిక బోర్డులను ఎక్కువసంఖ్యలో ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కొండ దిగువన కొత్తఘాట్‌రోడ్డు, న్యూ గోశాల, పాత గోశాల రోడ్లలో ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట రెవెన్యూ, దేవదాయ శాఖ, పోలీస్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే నగర పోలీస్‌ కమిషనర్‌ శంకబ్రత బాగ్చీ భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. పార్కింగ్‌ ప్రాంతాలను, సైన్‌బోర్డులను చూడడంతో పాటు పోలీసు కంట్రోల్‌ రూమ్‌ వ్యవస్థపై కూడా పలు సూచనలిచ్చారు.

చందనోత్సవ టిక్కెట్లకు డిమాండ్‌

సాధారణ భక్తులకు అందని రూ.వేయి టిక్కెట్లు

సిఫారసు చేయించుకున్న వారికే...

అందుబాటులో లేని దేవస్థానం ఈఓ

కార్యాలయం వద్ద పలువురి ధర్నా

ఎమ్మెల్యేలకు ఏడేసి పాస్‌లు

రూ.1,500 టిక్కెట్లు 50 చొప్పున,

రూ.1,000 టిక్కెట్లు 150 చొప్పున కేటాయింపు

వెహికల్‌ పాస్‌లు రాత్రి ఏడు గంటలకు ముద్రణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

చందనోత్సవం రోజున అప్పన్న దర్శన టికెట్ల కోసం ఈసారి ఎన్నడూ లేనంత డిమాండ్‌ కనిపించింది. సామాన్య భక్తులకు వేయి రూపాయల టిక్కెట్‌ దక్కకుండా చేశారు. అన్ని టిక్కెట్లు సిఫారసు చేయించుకున్న వారికే ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు టిక్కెట్ల కోసం మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇక ప్రజా ప్రతినిధులు, ప్రొటోకాల్‌ వ్యక్తులు సొంత కార్లలో కొండపైకి వెళ్లడానికి వాహన పాస్‌లు జారీచేస్తామని ప్రకటించారు. వాటిని కూడా రాత్రి ఎనిమిది గంటలకు ముద్రించలేదు. కొండపైకి వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్య తగ్గించడానికి ఈ విధంగా వ్యవహరించారు. కొండ దిగువన వీఐపీల కోసం ఇన్నోవా కార్లు, ఏసీ బస్సులు ఏర్పాటుచేశారు.

సింహాచలంలో ఈఓ కార్యాలయం వద్ద టికెట్ల జారీలో గందరగోళం సృష్టించారు. ఈఓ ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. అయితే ఇదంతా వ్మూహాత్మకంగానే చేశారంటున్నారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారికి గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉండడంతో టిక్కెట్లు ఎడాపెడా ఇవ్వకుండా కట్టడి చేశారు. ఈ చర్యల వల్ల సామాన్య భక్తులకు సులభ దర్శనం జరిగితే మంచిపని చేసినట్టే.

ఎమ్మెల్యేలకు 1+6 అంతరాలయ దర్శన టిక్కెట్లు

విశాఖ జిల్లాలోని ఎమ్మెల్యేలకు అంతరాలయ దర్శనం చేసుకునేందుకు ఏడు టిక్కెట్లు (1+6...ఒకటి ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యుల కోసం ఆరు) చొప్పున ఇచ్చారు. ఇవి కాకుండా రూ.1,500 విలువ కలిగిన టిక్కెట్లు 50 చొప్పున, వేయి రూపాయల విలువైన టిక్కెట్లు మరో 150 చొప్పున ఇచ్చారు. అంతరాలయ దర్శన టిక్కెట్లు ఇంకా కావాలని కొందరు పట్టుబట్టగా ఇవ్వలేమని అధికారులు స్పష్టంచేశారు. అధికారుల అంచనా ప్రకారం ప్రొటోకాల్‌ ద్వారా సుమారుగా మూడు వేల మందికి అంతరాలయ దర్శనం జరిగే అవకాశం ఉంది. ఉదయం ఆరు తరువాత అంతరాలయ దర్శనం ఉండదని ప్రకటించినా నాలుగు గంటలకు ప్రారంభించి ఆరు గంటలలోపు దర్శనాలు ముగించడం సాధ్యం కాదు. కాబట్టి ఉదయం పది గంటల వరకూ వీఐపీలు, అంతరాలయ దర్శనాలు ఉండవచ్చునంటున్నారు.

ప్రణాళిక విజయవంతమైతే మేలు చేసినట్టే

గత ఏడాది ఎన్నికల కోడ్‌ వల్ల అధికారులకు ప్రొటోకాల్‌ పాటించాల్సిన అవసరం తప్పింది. దాంతో ఊపిరి పీల్చుకొని సామాన్య భక్తులకు రెండు గంటల్లో దర్శనం చేయించగలిగారు. ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించినందున సామాన్య భక్తులకు సులువుగా దర్శనం జరగాల్సి ఉంది. ఈ ప్రణాళిక విజయవంతమైతే అధికారులు భక్తులకు మేలు చేసినట్టే.

Updated Date - Apr 30 , 2025 | 01:01 AM