పుస్తకాలు వచ్చేశాయ్
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:19 AM
పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులకు పుస్తకాలతో పాటు బ్యాగు, యూనిఫారం, షూ, బెల్టుతో కూడిన కిట్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముందుగా ఇండెంట్ మేరకు జిల్లాకు పుస్తకాలు వచ్చాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం నాటికి అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు. జిల్లాలో 5,13,837 పాఠ్య పుస్తకాలు అవసరమని ఇండెంట్ పెట్టారు.
- పాఠశాలల పునఃప్రారంభం రోజు పంపిణీకి ఏర్పాట్లు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులకు పుస్తకాలతో పాటు బ్యాగు, యూనిఫారం, షూ, బెల్టుతో కూడిన కిట్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముందుగా ఇండెంట్ మేరకు జిల్లాకు పుస్తకాలు వచ్చాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం నాటికి అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు. జిల్లాలో 5,13,837 పాఠ్య పుస్తకాలు అవసరమని ఇండెంట్ పెట్టారు. ఇప్పటికే 5,13,654 పుస్తకాలు జిల్లాకు చేరాయి. నోట్‌పుస్తకాలు 6,90,528 అవసరం కాగా, అన్ని పుస్తకాలు వచ్చాయి. బెల్టులు 60,901, ఆక్స్‌ఫర్డ్ ఆంగ్లం- తెలుగు అనువాద నిఘంటువులు 9,784 అవసరం కాగా, ఇప్పటికే శత శాతం జిల్లాకు చేరాయి. వీటిని జిల్లా సమగ్ర శిక్షా అధికారులు మండల విద్యాశాఖాధికారుల ఇండెంట్ ప్రకారం పంపుతున్నారు. ఈసారి పుస్తకాలు, ఇతరత్రా స్కూల్ కిట్లలోని సామగ్రి రవాణాకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. జిల్లాకు ఈ ఏడాది 96,807 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడేసి జతలు చొప్పున యూనిఫారాలు అందజేయాలని ఇండెంట్ పెట్టారు. అలాగే 96,807 స్కూల్ బ్యాగ్స్, 96,642 షూ అందజేయాలని ఇండెంట్ పెట్టారు. ఇవి జిల్లా కేంద్రం గోదాముకు ఇంకా చేరలేదు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి వీటిని అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సమగ్ర శిక్షా ఏపీసీ ఆర్.జయప్రకాశ్ తెలిపారు.