ఉత్తమ గురువులు
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:28 AM
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. అక్కిరెడ్డిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంట్ (ఇంగ్లీష్)గా పనిచేస్తున్న జి.కుమారస్వామి, యారాడ జడ్పీ ఉన్నత పాఠశాలో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)గా పనిచేస్తున్న జీఎం సుజాత, గోపాలపట్నం లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ ఎం.మోహనరావు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.
జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ప్రదానం
విశాఖపట్నం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. అక్కిరెడ్డిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంట్ (ఇంగ్లీష్)గా పనిచేస్తున్న జి.కుమారస్వామి, యారాడ జడ్పీ ఉన్నత పాఠశాలో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ)గా పనిచేస్తున్న జీఎం సుజాత, గోపాలపట్నం లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ ఎం.మోహనరావు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల ఐదో తేదీన విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో ముగ్గురికీ అవార్డులు అందజేస్తారు. అవార్డుకు ఎంపికైన టీచర్లకు డీఈవో ఎన్. ప్రేమ్‌కుమార్ అభినందనలు తెలిపారు.
3జిపిటి12: మెట్ట మోహనరావు
విద్యాభివృద్ధికి విశేష కృషి
గోపాలపట్నం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
గోపాలపట్నం సమీపంలోని లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న మెట్ట మోహనరావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1995లో బుచ్చెయ్యపేట మండలం పంగిడి పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా మోహనరావు ప్రస్థానం ప్రారంభమైంది. పంగిడి పాఠశాలలో పనిచేసిన ఎనిమిదేళ్లలో పాఠశాల అభివృద్ధికి కృషిచేశారు. గ్రామస్థుల సాయంతో పాఠశాలకు రహదారి నిర్మించారు. అదే మండలంలోని నీలకంఠపురం పాఠశాలలో రెండేళ్లు, పెందుర్తి మండలం దుగ్గవానిపాలెం పాఠశాలలో పదేళ్లు, అచ్యుతాపురం మండలం కొండపాలెం పాఠశాలలో రెండేళ్లు పనిచేశారు. లక్ష్మీనగర్‌కు 2017లో వచ్చిన తరువాత దాతల నుంచి సుమారు రూ.2 లక్షలను సమీకరించి డైనింగ్‌హాల్ నిర్మించారు. పాఠశాలకు సౌండ్ సిస్టమ్, విద్యార్థులకు బెంచీలు, స్టేషనరీ సమకూర్చారు. కృత్యాధార బోధనతో విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్ధమయ్యేలా చెప్పడంలో మోహనరావు కృతకృత్యులయ్యారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు, ఏటా పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరగడానికి కృషిచేశారు. మోహనరావు రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికవ్వడంతో ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు.
3 ప్లాంట్ 2: గుడిమెట్ల కుమార స్వామి
అవార్డు బాధ్యత పెంచింది
అక్కిరెడ్డిపాలెం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): అక్కిరెడ్డిపాలెం ఉన్నత పాఠశాల ఇంగ్లీషు ఉపాధ్యాయుడు గుడిమెట్ల కుమారస్వామి రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. 1990లో సర్వీసులో చేరిన కుమారస్వామి విద్యార్థులకు వినూత్న రీతిలో పాఠాలు బోధిస్తున్నారు. ఆంగ్ల విద్యా బోధనను సరళతరం చేసి, వారిని ఆకట్టుకునేలా ప్రత్యేక పద్ధతులు రూపొందించుకున్నారు. 2019లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు దక్కించుకున్నారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని కుమారస్వామి తెలిపారు.
3 ప్లాంట్ 3: జీఎం.సుజాత
వినూత్న రీతిలో బోధన
యారాడ ఉన్నత పాఠశాల బయాలజీ టీచర్ జీఎం సుజాత రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె 27 ఏళ్ల పాటు మాడుగుల ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసి రికార్డు సృష్టించారు. ఏడాది కిందట యారాడకు బదిలీపై వచ్చారు. సుజాత 2023లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందుకున్నారు. వినూత్న ఆలోచనలు, ప్రాజక్టుతో విద్యార్ధులు సులువుగా అర్థం చేసుకునేలా పాఠాలు బోధిస్తుంటారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని, విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించడం ద్వారా వారి మనసులోకి పాఠ్యాంశాలను చొచ్చుకునేలా చేయవచ్చన్నారు. రాష్ట్ర స్థాయి అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సరళతరమైన వినూత్న విధానాలతో పాఠ్యాంశాల బోధన సాగిస్తానన్నారు.