బెర్రీ బోరర్ కీటకం ప్రమాదకరం
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:28 PM
కాఫీ తోటలను ఆశిస్తున్న బెర్రీ బోరర్ ప్రమాదకరమైన కీటకమని, ఈ తెగులుపై గిరిజన రైతులు చైతన్యవంతులు కావాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి అన్నారు.
ఈ తెగులుపై గిరిజన రైతులు చైతన్యవంతులు కావాలి
ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి
చింతపల్లి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాఫీ తోటలను ఆశిస్తున్న బెర్రీ బోరర్ ప్రమాదకరమైన కీటకమని, ఈ తెగులుపై గిరిజన రైతులు చైతన్యవంతులు కావాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి అన్నారు. బుధవారం మండలంలోని ఉమ్రాసగొంది గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం కాఫీ బెర్రీ బోరర్‌పై గిరిజన రైతులకు అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా అప్పలస్వామి రైతులతో మాట్లాడుతూ బెర్రీ బోరర్ కాఫీ కాయలు, పండ్లలోకి చొచ్చుకుని లోపలకు వెళుతుందన్నారు. కాయ లోపల గింజను తింటూ అక్కడ సొరంగం ఏర్పాటు చేసుకుంటుందన్నారు. ఈ సొరంగంలో గుడ్లు పెడుతుందని తెలిపారు. రోజుల వ్యవధిలో కాయ నుంచి కీటకాలు అధిక సంఖ్యలో బయటకు వస్తాయన్నారు. ఈ కీటకాలు వృద్ధి చెందితే కాఫీ తోటలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. రైతులు పంటను భారీగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ తెగులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నాశనం చేయాలన్నారు. అరకులోయ, చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఈ తెగులు బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు ప్రారంభించిందన్నారు. కాఫీ కాయలు, పండ్లలో నల్లని రంధ్రాలు కనిపిస్తే ఈ తెగులు ఆశించిందని రైతులు గుర్తించాలన్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బయ్యపురెడ్డి, వ్యవసాయశాఖ అధికారి టి.మధుసూదనరావు, వీఏఏ అనురాధ పాల్గొన్నారు.