అడవి గాచిన అందాలు!
ABN , Publish Date - Sep 26 , 2025 | 10:37 PM
మన్యం అంటేనే సహజ సిద్ధమైన అందాలతో ప్రకృతి ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకునే సుందర ప్రదేశం. అటువంటి ప్రదేశంలో పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టాలే గాని ఆకాశమే హద్దు అన్నట్టు ఎన్నో చేయవచ్చు. కాని ఏజెన్సీలో అందుకు భిన్నమైన పరిస్థితి రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రకృతి అందాలకు మెరుగులు దిద్ది మరింతగా సుందరంగా తయారు చేసే చర్యలు చేపట్టడడం లేదు. దీంతో మన్యంలో పర్యాటకాభివృద్ధి అడవి గాచిన అందాలు చందంగా ఉంది. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏజెన్సీలో పర్యాటకంపై ప్రత్యేక కథనం..
రెండు దశాబ్దాలుగా పర్యాటకాభివృద్ధికి నోచుకోని విశాఖ మన్యం
కేవలం సహజసిద్ధ అందాలతో సరిపెట్టుకుంటున్న సందర్శకులు
కొత్త అందాల అన్వేషణ.. సాహస క్రీడలు వంటి ఊసేలేదు
ప్రతి ఏటా మన్యానికి పది లక్షల మంది పర్యాటకులు రాక
ప్రతిపాదనల స్థాయిలోనే హోమ్ స్టేలు, కారవాన్ టూరిజం ప్రాజెక్టు
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఎటుచూసినా పచ్చని కొండలు.. గలగల పారే సెలయేళ్లు.. ఉరికే జలపాతాలు.. కొండలను చుట్టిన పాములా కనిపించే ఘాట్ మార్గాలు.. ఇవీ విశాఖ మన్యంలో కనిపించే సుందర దృశ్యాలు.. అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు మొదలుకుని అక్కడికి సమీపంలోని జలపాతాలు, ఘాట్‌లోని కాఫీ తోటలు, అరకులోయ చేరుకునే వరకు కనుచూపు మేర పచ్చదనం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అరకులోయలోని గిరిజన మ్యూజియం, మాడగడ సన్‌రైజ్ పాయింట్, పద్మాపురం ఉద్యావనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడలోని చాపరాయి, హుకుంపేట మండలంలో మత్స్యగుండం తిలకించిన పర్యాటకులు పాడేరు చేరుకుంటున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి చోడవరం మీదుగా పాడేరు ఘాట్ మార్గంలో ప్రయాణిస్తూ పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాలకు తరలివస్తుంటారు.
ఆ మూడు ప్రాంతాలే కీలకం
అరకులోయ తర్వాత అధిక సంఖ్యలో పర్యాటకులు తిలకిస్తున్నది పాడేరు మండలంలోని వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలోని చె రువులవేనం ప్రాంతాలే. శీతాకాలంలో కశ్మీరు అందాలను తలపించేలా ప్రకృతి సౌందర్యం వంజంగి హిల్స్, చెరువులవేనంలో దర్శనమిస్తున్నది. అలాగే రోడ్డుకు పక్కనే ఎంతో ఆకర్షణీయంగా కొత్తపల్లి జలపాతం ఉంటుంది. దీంతో పిక్నిక్‌ల సీజన్‌లో ఏపీకి వచ్చే సగటు పర్యాటకుడు ఈ మూడు ప్రదేశాలను తిలకించకుండా తిరిగి వెళ్లరంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత లంబసింగి పరిసరాల్లో స్ట్రాబెరీ తోటలు, సీలేరు జలవిద్యుత్ కేంద్రం, ధారాలమ్మ ఆలయం, యర్రవరం జలపాతాన్ని పర్యాటకులు సందర్శిస్తున్నారు.
మౌలిక సదుపాయాల ఊసేలేదు
ఏజెన్సీలో ఇటు బొర్రా గుహలు మొదలుకుని అటు చింతపల్లి మండలం లంబసింగి, యర్రవరం జలపాతం వరకు ఎక్కడ చూసినా కనీస సదుపాయాలు లేమితో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కటికి, రణజిల్లెడ, చాపరాయి, కొత్తపల్లి, యర్రవరం జలపాతాల్లో జలకాలాడే క్రమంలో ఆయా ప్రదేశాల్లో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు కనీస సౌకర్యాలు లేవు. అలాగే తాగునీరు, మరుగుదొడ్ల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏజెన్సీలోని పర్యాటక ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని సందర్శకులు పదేపదే ఆవేదన చెందుతున్నారు. ఎంతో ప్రాచుర్యం పొందిన వంజంగి హిల్స్, చెరువులవేనం, యర్రవరం జలపాతానికి నేటికీ సరైన రోడ్డు లేని దుస్థితి కొనసాగుతున్నది.
ఏటా పది లక్షల మంది మన్యం సందర్శన..
ఏజెన్సీలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు ప్రతీ ఏడాది పది లక్షల మంది మన్యాన్ని సందర్శిస్తున్నారనేది ఒక అంచనా. అంతటి ప్రాధాన్యత గల ప్రదేశాలున్నప్పటికీ పర్యాటకంగా గిరిజన ప్రాంతాన్ని ఉన్నత శిఖరానికి తీసుకువెళ్లేందుకు పాలకులు కనీసం కృషి చేయడం లేదనేది అక్షర సత్యం.
ప్రతిపాదనల్లో హోమ్‌స్టేలు, కారవాన్ టూరిజం ప్రాజెక్టు..
మన్యంలోని కొత్తగా పర్యాటకాభివృద్ధి చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలో అరకులోయ, లంబసింగి, మారేడుమిల్లి క్లస్టర్లుగా హోమ్ స్టే టూరిజం ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తున్నారు. అందుకుగానూ స్వదేశీ దర్శన్‌లో కేంద్ర ప్రభుత్వానికి రూ.5 కోట్లతో జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే కేంద్రం జిల్లాకు నిధులు కేటాయిస్తే, అప్పుడు హోమ్ స్టే టూరిజం అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. అయితే అవన్నీ జరగాలంటే వచ్చే పర్యాటక సీజన్ వరకు ఆగాల్సిన పరిస్థితి కన్పిస్తున్నది. అలాగే పాడేరు డివిజన్ పరిధిలో అరకులోయ మండలం మాడగడ, ముంచంగిపుట్టు మండలం సుజనకోట, చింతపల్లి మండలం లంబసింగిలో మూడు, రంపచోడవరం డివిజన్ పరిధిలో మారేడుమిల్లి, రంపచోడవరం మండలం గాంధీనగరంలో రెండు చోట్ల కారవాన్‌టూరిజం పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్నాయి.