Share News

ప్రశాంతంగా ముగిసిన బంద్‌

ABN , Publish Date - May 03 , 2025 | 11:54 PM

మెగా డీఎస్‌సీతో సంబంధం లేకుండా గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని, షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని టీచర్‌ పోస్టులన్నీ ఎస్‌టీ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలని, షెడ్యూల్డ్‌ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం రూపొందించాలనే డిమాండ్లపై ప్రత్యేక డీఎస్‌సీ సాధన సమితి నిర్వహించిన రెండు రోజుల మన్యం బంద్‌ శనివారం ప్రశాంతంగా ముగిసింది. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో టీచర్‌ పోస్టులను ఇతరులతో భర్తీ చేయవద్దని, వాటిని గిరిజనులకు మాత్రమే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ గిరిజనులు స్వచ్ఛందంగా రెండు రోజులు బంద్‌ పాటించారు.

ప్రశాంతంగా ముగిసిన బంద్‌
పాడేరులో మూతపడిన దుకాణాలు

- రెండు రోజుల పాటు స్తంభించిన ఏజెన్సీ ప్రాంతం

- గిరిజనులకు ప్రత్యేక డీఎస్‌సీ ప్రకటించాలని, షెడ్యూల్డ్‌ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం రూపొందించాలని డిమాండ్‌

- స్వచ్ఛందంగా బంద్‌ పాటించిన ప్రజలు

- మద్దతు తెలిపిన వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు

పాడేరు, మే 3(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్‌సీతో సంబంధం లేకుండా గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని, షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని టీచర్‌ పోస్టులన్నీ ఎస్‌టీ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలని, షెడ్యూల్డ్‌ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం రూపొందించాలనే డిమాండ్లపై ప్రత్యేక డీఎస్‌సీ సాధన సమితి నిర్వహించిన రెండు రోజుల మన్యం బంద్‌ శనివారం ప్రశాంతంగా ముగిసింది. షెడ్యూల్డ్‌ ప్రాంతంలో టీచర్‌ పోస్టులను ఇతరులతో భర్తీ చేయవద్దని, వాటిని గిరిజనులకు మాత్రమే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ గిరిజనులు స్వచ్ఛందంగా రెండు రోజులు బంద్‌ పాటించారు. మన్యం బంద్‌కు వైసీపీకి చెందిన అరకులోయ ఎంపీ డాక్టర్‌ జి.తనూజారాణి, జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండల కేంద్రాల్లోనూ బంద్‌ను పాటించారు. పాడేరులో శనివారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక డీఎస్‌సీ సాధన సమితి ప్రతినిధులు పి.అప్పలనర్స, కె.రాధాకృష్ణ, ఎస్‌.మాణిక్యం, కిల్లో సురేంద్ర, కె.కాంతారావు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, తదితరులు రోడ్లపైకి వచ్చి బంద్‌ను పర్యవేక్షించారు. అలాగే నారా చంద్రబాబునాయుడు అరకులోయలో ఇచ్చిన హామీ మేరకు జీవో:3 పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, షెడ్యూల్డ్‌ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని రూపొందించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఇదే క్రమంలో అరకులోయ ఎంపీ జి.తనూజారాణి, స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి స్థానిక ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ రోడ్డులో బైఠాయించి బంద్‌కు మద్దతు తెలిపారు. అరకులోయలో సీపీఎం నేతలు పొద్దు బాల్‌దేవ్‌, కె.రామారావు, ఉమామహేశ్వరావు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, నిరుద్యోగులు బంద్‌ను పాటించారు. అలాగే చింతపల్లిలో సీపీఎం నేత బి.చిన్నయ్యపడాల్‌, డీఎల్‌వో నేత కె.శేఖర్‌, ఎంపీపీ అనూషాదేవి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తదితరులు బంద్‌ను పాటించారు.

రెండు రోజులు స్తంభించిన మన్యం

స్పెషల్‌ డీఎస్‌సీ సాధన సమితి పిలుపు మేరకు రెండు రోజుల బంద్‌తో మన్యం ప్రాంతం స్తంభించింది. స్థానిక ఆర్టీసీ డిపో నుంచి బస్సులు రోడ్డెక్కలేదు. ప్రైవేటు జీపులు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిపేశారు. పాడేరులో దుకాణాలు, హోటళ్లు, ఇతర ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు సైతం రెండు రోజులు మూతపడ్డాయి. జనం ఇళ్లకే పరిమితం కావడంతో పాడేరులోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అలాగే పర్యాటక కేంద్రం అరకులోయలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, అనంతగిరి మండలం బొర్రాలోని గుహలు పూర్తిగా మూతపడ్డాయి.

ఆందోళనకారులతో కలెక్టర్‌ చర్చలతో బంద్‌ విరమణ

ప్రత్యేక డీఎస్‌సీ సాధనకు రెండో రోజు బంద్‌ జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ శనివారం కలెక్టరేట్‌కు వెళుతుండగా ఆందోళనకారులు మెయిన్‌రోడ్డులో ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కలెక్టర్‌ కారు దిగి ఆందోళనకారుల వద్దకు వచ్చి పలు సంఘాల నేతలు కలెక్టరేట్‌కు వస్తే చర్చించుకుందామని పేర్కొన్నారు. దీంతో ఆయనతో చర్చలకు డీఎస్‌సీ సాధన సమితి ప్రతినిధులైన పి.అప్పలనర్స, కె.రాధాకృష్ణ, ఎస్‌.మాణిక్యం, కె.రాజశేఖర్‌, తదితరులు కలెక్టరేట్‌కు వెళ్లారు. ఇప్పటికే ఈ సమస్యపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటన చేశారని, అలాగే వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వ సీఎస్‌, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శితో సైతం భేటీ అయ్యేందుకు అవకాశం కల్పిస్తామని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. మెగా డీఎస్‌సీలో గిరిజన అభ్యర్థులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందన్నారు. ఈ క్రమంలో బంద్‌ను విరమించాలని కలెక్టర్‌ వారికి సూచించారు. దీంతో డీఎస్‌సీ సాధన సమితి ప్రతినిధులు, తదితరులు పట్టణ వీధుల్లో ర్యాలీ చేపట్టి అనంతరం బంద్‌ విరమిస్తున్నట్టు ప్రకటించారు. రెండు రోజుల బంద్‌కు సహకరించిన అందరికీ ఽకృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 03 , 2025 | 11:54 PM