నేడు ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం
ABN , Publish Date - Dec 13 , 2025 | 01:38 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం (వేవ్స్)-2025 బీచ్‌రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నది.
ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి
సర్వాంగ సుందరంగా ముస్తాబైన వర్సిటీ
విశాఖపట్నం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం (వేవ్స్)-2025 బీచ్‌రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నది. ఈ ఏడాది పూర్వ విద్యార్థుల సమావేశం వేవ్స్-2025ను మహిళా సాధికారిత థీమ్‌తో నిర్వహిస్తున్నట్టు పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కేవీవీ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు, రచయిత, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్ సుధామూర్తి హాజరుకానున్నారు. కార్యక్రమంలో ఏయూ అలూమ్ని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, జీఎంఆర్ అధినేత డాక్టర్ గ్రంథి మల్లికార్జునరావుతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొంటారు. వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే పదివేల మందికిపైగా రిజిస్ర్టేషన్ చేసుకోగా, మూడు వేల మందికిపైగా హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. హాజరైన వారంతా కార్యక్రమాన్ని తిలకించేందుకు వీలుగా ప్రాంగణంలో ప్రత్యేక స్ర్కీన్లు ఏర్పాటుచేశారు. ఏయూ పరిపాలనా భవనం వద్దనున్న వ్యవస్థాపక ఉప కులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి శనివారం ముఖ్యఅతిథి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం వర్సిటీలోని పలు విభాగాలను సందర్శిస్తారు.
వర్సిటీకి విద్యుత్ కాంతుల శోభ
పూర్వ విద్యార్థుల సమావేశం నేపథ్యంలో ఏయూ పరిపాలనా భవనం, పూర్వ విద్యార్థుల సంఘ కార్యాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. పరిపాలనా భవనానికి ఇరువైపులా ముఖ్య అతిథిగా హాజరుకానున్న సుధామూర్తి, పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు చిత్రాలతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.