Share News

ఆదమరిస్తే అంతే..

ABN , Publish Date - Dec 09 , 2025 | 01:55 AM

ఎలమంచిలి- గాజువాక ప్రధాన రహదారిలో స్థానిక ఊటగెడ్డ జంక్షన్‌ నుంచి బంగ్లా జంక్షన్‌ వరకు రోడ్డు పలుచోట్ల అధ్వానంగా తయారైంది.

ఆదమరిస్తే అంతే..

అధ్వానంగా ఎలమంచిలి- గాజువాక ప్రధాన రహదారి

పరవాడ మండలంలో పలుచోట్ల పెద్దపెద్ద గోతులు

ప్రమాదాలబారిన వాహనదారులు

ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

పరవాడ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

ఎలమంచిలి- గాజువాక ప్రధాన రహదారిలో స్థానిక ఊటగెడ్డ జంక్షన్‌ నుంచి బంగ్లా జంక్షన్‌ వరకు రోడ్డు పలుచోట్ల అధ్వానంగా తయారైంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రహదారిలో పలుచోట్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వీటి వల్ల వాహనాలు పాడైపోవడమే కాకుండా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణించే సమయం అధికం అవుతున్నది. ఈ రహదారికి మరమ్మతులు చేపట్టి ఏడాది కాకముందే పరిస్థితి మళ్లీ మొదటి రావడంపై (గోతులు ఏర్పడడం) వాహనచోదకులు మండిపడుతున్నారు.

సింహాద్రి ఎన్టీపీసీ, అచ్యుతాపురం సెజ్‌, ఫార్మాసిటీకి చెందిన కార్మికులు, ఉద్యోగులు, మండలంలోని పలు గ్రామాల ప్రజలతోపాటు గాజువాక, విశాఖపట్నం, ఎలమంచిలి, తదితర ప్రాంతాలకు చెందిన వారు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. పలుచోట్ల గోతులు ఏర్పడడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల వద్ద ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా.. ప్రమాదానికి గురికాక తప్పదని అంటున్నారు. రాత్రిపూట దగ్గరకు వచ్చే వరకు గోతులు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. పరిమితికి మించి బొగ్గు లోడుతో ప్రయాణిస్తున్న లారీలు గోతుల వద్ద అదుపుతప్పి బోల్లా పడిన సందర్భాలు ఎన్నో వున్నాయని స్థానికులు అంటున్నారు. వర్షాకాలం ముగిసినందున ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రహదారిపై గోతులు పూడ్చాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 01:55 AM