Share News

పాఠ్య పుస్తకాలు వచ్చేస్తున్నాయ్‌!

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:46 AM

పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటికే గాజువాకలోని ఉమ్మడి విశాఖ జిల్లా పాఠ్యపుస్తక కార్యాలయానికి పాఠ్యపుస్తకాలు చేరాయి. వీటిని శనివారం నుంచి ఎంఈవో కార్యాలయాలకు తరలిస్తారు. అనంతరం మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తారు

పాఠ్య పుస్తకాలు వచ్చేస్తున్నాయ్‌!
గాజువాక గోదాములో జిల్లాలో మండలాలకు తరలించేందుకు సిద్ధం చేసిన పాఠ్యపుస్తకాలు

నేడు గాజువాక గోదాము నుంచి మండలాలకు సరఫరా

జిల్లాకు 5,30,355 పాఠ్యపుస్తకాల ఇండెంట్‌

ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా పుస్తకాల రాక

జూన్‌ మొదటి వారంలోగా స్కూళ్లకు చేరవేత

పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు పంపిణీ

రెండు, మూడు సబ్జెక్టులు కలిపి ఒక పుస్తకంగా ముద్రణ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటికే గాజువాకలోని ఉమ్మడి విశాఖ జిల్లా పాఠ్యపుస్తక కార్యాలయానికి పాఠ్యపుస్తకాలు చేరాయి. వీటిని శనివారం నుంచి ఎంఈవో కార్యాలయాలకు తరలిస్తారు. అనంతరం మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తారు.

జిల్లాలో ప్రభుత్వ, మునిసిపల్‌, జిల్లా పరిషత్‌, ఇతరత్రా యాజమాన్యాల కింద 1,958 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు రెండు లక్షల మందికిపైగా విద్యార్థులు వున్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి విద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇప్పటికే గాజువాకలోని గోదాముకు చేరాయి. జిల్లా విద్యా శాఖాధికారుల ఇండెంట్‌ ప్రకారం ఇక్కడి నుంచి శనివారం ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి జోన్‌, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీలు, అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తారు. ఆయా కేంద్రాలకు చేరిన పుస్తకాలను ఎంఈఓలు తమ పరిధిలోని పాఠశాలలకు పంపిణీ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియను జూన్‌ మొదటి వారం నాటికి పూర్తి చేసి, పాఠశాలల పునః ప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తామని జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావునాయడు తెలిపారు. జిల్లాకు 5,30,355 పాఠ్యపుస్తకాలు అవసరమని ఇండెంట్‌ పెట్టామని, ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా పాఠ్యపుస్తకాలు గాజువాక గోదాముకు చేరుకున్నాయని ఆయన చెప్పారు. కాగా ఈ ఏడాది ఏడో తరగతి పాఠ్యపుస్తకాలు మారనున్నందున అవి ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

రెండు, మూడు సబ్జెక్టులు కలిపి ఒక పుస్తకం!

విద్యార్థులకు పుస్తకాలు భారం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండు, మూడు సబ్జెక్టులను కలిపి ఒక పుస్తకంగా రూపొందించారు. 1వ తరగతి నుంచి 5 తరగతి వరకు చెందిన తెలుగు, ఇంగ్లిషు, గణితం కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. వర్క్‌బుక్‌ అదనంగా వుంటుంది. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిషు, హిందీ కలిపి ఒక పుస్తకంగా, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం కలిపి ఒక పుస్తకంగా ముద్రించారు. సిలబస్‌ విషయంలో కూడా కొంత వెసులుబాటు కల్పించారు.

Updated Date - Apr 26 , 2025 | 12:46 AM