టీచర్లకూ టెట్
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:20 AM
ఉపాధ్యాయులు (ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వారు) కూడా ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్-టెట్)లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చి న తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉపాధ్యాయుల్లో అలజడి మొదలైంది.
సుప్రీంకోర్టు తీర్పు అమలుకు ప్రభుత్వ నిర్ణయం
ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల
2014కు ముందు విధుల్లో చేరిన వారికి వర్తింపు
ఐదేళ్లలో రిటైరయ్యే వారికి మినహాయింపు
ఉమ్మడి జిల్లాలో పదివేల మందికి పరీక్ష
రివ్యూ పిటిషన్ వేయాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
ఉపాధ్యాయులు (ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వారు) కూడా ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్-టెట్)లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చి న తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉపాధ్యాయుల్లో అలజడి మొదలైంది.
టెట్ కు వచ్చే నెల 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబరు 10న పరీక్ష నిర్వహిస్తామని పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. 2014 కంటే ఉద్యోగంలో చేరిన వారంతా టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంది. అయితే 2030 ఆగస్టు 31లోగా ఉద్యోగ విరమణ చేయనున్న వారు, 1968 ఆగస్టు 31లోగా పుట్టిన వారు టెట్ రాయాల్సిన అవసరం లేదు. రెండేళ్లలో టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎస్సీలో మెరిట్ సాధించి విధుల్లో చేరిన పదిహేనేళ్ల తరువాత టెట్ రాయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు పక్కనపడేశాయని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
గణితం టీచర్‌కు బయాలజీ పరీక్ష
టెట్‌లో రెండు భాగాలు...లెవెల్ 1, 2 పేపర్లు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో బోధించే టీచర్లు అన్ని సబ్జెక్టులతో కూడిన లెవెల్-1 పరీక్ష రాయాలి. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బోధించే వారు లెవెల్-2 పరీక్ష రాయాలి. ఇందులో గణితం/సైన్స్ ఒక పేపర్ కాగా ఆర్ట్స్/లాంగ్వేజెస్‌తో మరో పేపర్ ఉంటుంది. ప్రతి పేపర్ 150 మార్కులకు ఇస్తారు. గణితం/సైన్స్, తెలుగు భాషపై అవగాహన, కంప్యూటర్ నైపుణ్యం, సైకాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు తయారుచేస్తారు. గణితం స్కూలు అసిస్టెంట్‌కు గణితం, భౌతికశాస్త్రంపై అవగాహన ఉంటుంది తప్ప జీవశాస్త్రంతో సంబంధం ఉండదు. బయాలజీ టీచర్ గణితంపై ప్రశ్నలకు జవాబులు రాయలేరు. సోషల్ టీచర్‌కు తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లోని కొన్ని కీలక పాఠ్యాంశాలపై అవగాహన ఉండదు. ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఎస్జీటీ, భవిష్యత్తులో పదోన్నతి కోరుకుంటే లెవెల్-2 పరీక్ష రాయాలి.
ఉమ్మడి జిల్లాలో పది వేల మంది
ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, గిరిజన సంక్షేమ శాఖ, గురుకులాల్లో సుమారు 15 వేల మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో 2014కు ముందు నియమితులైన, టెట్ రాయాల్సిన టీచర్లు నది వేల మంది వరకూ ఉంటారని అంచనా వేస్తున్నారు. 2014 తరువాత మూడు డీఎస్సీలు నిర్వహించారు. వీరంతా టెట్ అర్హత సాధించిన తరువాతే డీఎస్సీ ద్వారా ఎంపికై ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారు ఇప్పుడు కొత్తగా టెట్ రాయాల్సిన అవసరం లేదు. 2014కు ముందు పలు డీఎస్సీల ద్వారా ఎంపికై 1968 ఆగస్టు 31 తరువాత పుట్టినవారు, 2030 ఆగస్టు 31 తరువాత పదవీ విరమణ చేయనున్న టీచర్లు టెట్ అర్హత సాధించాలి. ఓపెన్ కేటగిరీ అయితే 90 మార్కులు, బీసీ అభ్యర్థులు 75 మార్కులు, ఎస్సీ/ఎస్టీలు 60 మార్కులు సాధించాలి. రెండేళ్లు అంటే 2027 సెప్టెంబరు నెలాఖరులోగా టెట్ అర్హత సాధించాలి. టీచర్లు టెట్ రాయాలని ఆదేశించడంపై ఎస్జీటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం స్పందించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు.